iDreamPost
iDreamPost
అదేంటో కొన్నిసార్లు జరిగే సంఘటనలు కాకతాళీయమే అయినా వినడానికి ఆశ్చర్యకరంగా ఉంటాయి. అందులోనూ సెంటిమెంట్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే సినిమా పరిశ్రమలో ఏ స్థాయిలో ఉంటాయో వేరే చెప్పాలా. ఇక ఇక్కడి హెడ్డింగ్ విషయానికి వద్దాం. అదేం విచిత్రమో కానీ నలుగురు సినిమా బ్రదర్స్ అదే రెండు జంటల సినిమాలు ఒకేసారి లాక్ డౌన్ వల్ల బ్రేక్ పడటం అంటే వింతేగా.
అక్కినేని వారసులు నాగ చైతన్య-అఖిల్ ల బ్యాచ్ ఒకటైతే సాయి ధరమ్ తేజ్-వైష్ణవ్ తేజ్ ల టీమ్ ఒకటి. మొత్తం కలిపి నాలుగు.
శేఖర్ కమ్ముల-నాగ చైతన్య కాంబోలో సాయి పల్లవి హీరోయిన్ గా రూపొందుతున్న లవ్ స్టోరీ షూటింగ్ ఆఖరి స్టేజిలో ఉండగా బ్రేక్ పడింది. లేకపోతే ఇంకో నెలలో రిలీజ్ డేట్ ఉండేది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా రూపొందుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ది కూడా ఇదే పరిస్థితి. పూజా హెగ్డే హీరోయిన్ కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. అదిగో ఇదిగో అంటూ విడుదల తేదీ ఊరించే టైంలోనే దీనికీ అడ్డంకి వచ్చి పడింది. ఇక సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా సుబ్బు డైరెక్షన్ లో రూపొందుతున్న సోలో బ్రతుకే సో బెటరూ యమా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న టైంలో ఆగిపోయింది. లేకపోతే ఈపాటికి షోలు పది రోజులు దాటేసింది.
తమ్ముడు వైష్ణవ్ తేజ్ ని తెరకు పరిచయం చేస్తూ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిస్తున్న ఉప్పెన ఫస్ట్ కాపీ రెడీ అవుతున్న టైంలో పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర నిలిచిపోయింది. లేకపోతే థియేటర్లలో ఆడేసి ఈపాటికి ఓటిటి రిలీజ్ కోసం ఎదురు చూసే వాళ్ళం. ఇలా దాదాపు ఒకే స్టేజి లో ఈ నలుగురు అన్నదమ్ముల సినిమాలు ఆగిపోవడం గమనార్హం. లాక్ డౌన్ తీసేశాక ఏది ముందు వస్తుందో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. నిర్మాతలంతా కూర్చుకుని ఒక ఏకాభిప్రాయానికి వచ్చి ఆమేరకు తేదీలు ప్రకటించాల్సి ఉంటుంది. ఇది తమిళనాడులో ముందు నుంచి ఉన్న పద్దతే. ఇకపై టాలీవుడ్ లోనూ అమలు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అభిమానులు మాత్రం రెండున్నర నెలలుగా థియేటర్లలో అడుగు పెట్టక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు