iDreamPost
iDreamPost
1990 మే నెల
ఒక పక్క భారీ వర్షాలతో కూడిన తుఫాను రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. సినిమాల సంగతి దేవుడెరుగు ముందు ఉన్న గూడు భద్రంగా ఉండి నాలుగు మెతుకులు దొరికితే చాలనే రీతిలో జనం ఉన్నారు. ఎప్పుడు తెరిపినిస్తుందో తెలియదు. చాలా ప్రాంతాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. అప్పటికే ఆడుతున్న చిత్ర నిర్మాతల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. కలెక్షన్స్ తగ్గిపోయి ఎగ్జిబిటర్లు లబోదిబోమంటున్నారు. విపత్తు లేని ప్రాంతాల్లో ఓ మోస్తరుగా ఉంది కాని మొత్తంగా చూసుకుంటే ప్రభావమైతే గట్టిగానే తగులుతోంది. అశ్వినిదత్ కోట్లు పోసి అప్పటిదాకా అంత భారీ బడ్జెట్ తో ఏ ప్రాజెక్ట్ తీయలేదు. ఆఖరి పోరాటానికి మించి ఖర్చయ్యింది. బ్లాక్ బస్టర్ అయితే తప్ప కొన్నవాళ్ళు సేఫ్ కారు. ఎంత చిరంజీవి సినిమా అయినా ఆయన మెగాస్టారని ప్రకృతికేం తెలుసు. అందుకే అది తన పని తాను చేసుకుంటూ పోయింది. ఏటికి ఎదురీదే సాహసంతో భారం దేవుడి మీద వేసి దత్తు గారు నిశ్చింతగా ఉండటం అలవాటు చేసుకున్నారు. ఎందుకంటే వెనుకడుగు వేసే ఛాన్స్ లేదు.
ఆ సినిమా పేరు జగదేకేవీరుడు అతిలోకసుందరి.
9వ తేది వచ్చేసింది.
ఈ వర్షాల వల్ల కొన్నిచోట్ల ప్రింట్లు ఆలస్యంగా చేరుకున్నాయి. ఇప్పట్లా డిజిటల్ సిస్టం కాదు కాబట్టి ప్రతి బాక్సు రవాణా కావాల్సిందే. ఎక్కడ ఆలస్యం జరిగినా షో టైంలో తేడాలు వచ్చేస్తాయి. ట్రాకులు పాడైన చోట రైళ్ళు షెడ్యూల్ ప్రకారం తిరగడం లేదు. డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర ఒత్తిడిలో ఇవన్నీ మేనేజ్ చేస్తున్నారు. వాళ్ళ చేతుల్లోనూ ఏమి లేదు. అనుకున్న టైంకి కొన్ని ఊళ్లలో ఆటలు మొదలయ్యాయి. ఇంకొన్ని చోట్ల మధ్యాన్నం నుంచని బోర్డులు పెట్టారు. ఎక్కడో అభిమానుల గోల మొదలైంది. కమ్యునికేషన్ ఫాస్ట్ గా లేని కాలమది. ల్యాండ్ లైన్ ఫోన్ లేదా టెలిగ్రామ్. మూడో ఆప్షన్ లేదు.
అప్పటికే హిమశిఖరమంత స్థాయికి చేరుకున్న చిరంజీవి బొమ్మ కావడంతో క్లాసు మాసు తేడా లేకుండా గొడుగులు పట్టుకుని మరీ థియేటర్లకు తండోపతండాలుగా బయలుదేరారు. వైజయంతి మూవీస్ ఆఫీస్ ఫోన్ బహుశా అప్పుడు మ్రోగినన్నిసార్లు మళ్ళీ ఆ స్థాయిలో ఇంకెప్పుడు రింగవ్వలేదు. చరిత్ర లిఖించబోయే ఓ ఘట్టానికి తాను ఒక వారధిగా నిలవడం కన్నా ఆ టెలిఫోన్ కు కావాల్సింది ఏముంటుంది. అలా ఒక సువర్ణాధ్యయపు ప్రస్థానానికి నాంది ఇన్ని అడ్డంకుల మధ్య మొదలైంది. మొదటి వారం కలెక్షన్స్ బాగున్నాయి కాని ఆశించిన రేంజ్ కాదు. కారణం వాతావరణం. రెండో వారంలోకి అడుగు పెట్టాక కాని వరుణుడు కుదుటపడలేదు. ఇక అక్కడ మొదలైంది జైత్రయాత్ర.
” ఏముందిరా బొమ్మ. సూడనీకె రెండు కళ్ళు సాలలేదు. ఓపక్క సిరంజీవి, ఇంకో పక్క శ్రీదేవి. బేగి ఇంకో ఆటకు టికెట్లు కొనురా” – బెనిఫిట్ షో కాగానే ఓ మిత్రుడితో మాస్ ప్రేక్షకుడన్న మాటలు
” నాన్నా, సినిమాకు తీసుకెళ్తావా లేదా. రేపన్నావంటే ఈ రోజంతా నేను ఉపవాసం ఉంటాను ” – తండ్రికి ఓ పదేళ్ళ కుర్రాడి వార్నింగ్
” సార్, అర్థం చేసుకోండి. రెండో ఆటకు కూడా అడ్వాన్స్ బుకింగ్ అయిపోయింది. మీరు ఎమ్మెల్యే అయినా నేనేం చేయలేను. రేపు మీ ఫ్యామిలీ మొత్తానికి బాల్కనీ రో అట్టిపెడతాను. ప్లీజ్ సర్” – టికెట్ల కోసం ఫోన్ చేసిన ఓ ప్రజాప్రతినిధికి హాలు మేనేజర్ వేడుకోలు
” రేయ్ ఇది టూ మచ్ రా, చిరు కోసం 10 సార్లు, శ్రీదేవి కోసం 10 సార్లు చూసేసావ్. మళ్ళీ ఇప్పుడు ఇళయరాజా వంక పెట్టుకుని కొత్త కౌంట్ మొదలుపెట్టావ్” – ఓ ఫ్రెండ్ తో వేరే హీరో అభిమాని
” నువ్వెన్నైనా చెప్పరా, ఇలాంటివి చేశాడు కాబట్టి మెగాస్టార్ అయ్యాడు” టీ కొట్టులో ఇద్దరి మధ్య ముచ్చట
” దాసూ, ఎప్పుడు కాఫీకొచ్చినా ఆ సినిమా పాటలేనా. క్యాసెట్ అరిగిపోదూ. మార్చవయ్యా బాబు” – ఓ టిఫిన్ సెంటర్ ఓనర్ తో రెగ్యులర్ కస్టమర్ ఇచ్చిన కంప్లయింట్
ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో. 90ల ప్రాంతంలో యువకులు, పిల్లలుగా ఉన్న వాళ్ళ జీవితాల్లో ఓ ప్రత్యేకమైన ముద్రవేసిన ఆ మాయాజాలం పేరు “జగదేకవీరుడు అతిలోకసుందరి”
అద్భుతానికి మొదటి అడుగు
నిజానికి ఈ సినిమా మొదలుపెట్టే టైంకి చిరంజీవిది భీభత్సమైన ఫామ్. ఎటొచ్చి రాఘవేంద్రరావే ఫ్లాపుల్లో ఉన్నారు. నాగార్జున అగ్ని, వెంకటేష్ ఒంటరి పోరాటం రెండూ దెబ్బేశాయి. మెగాస్టార్ కూ యుద్ధభూమి, రుద్రనేత్రలతో డిజాస్టర్లు ఇచ్చారు. ఆ సమయంలో భారీ బడ్జెట్ తో జగదేకేవీరుడు అతిలోకసుందరి లాంటి విజువల్ ఫాంటసీ ప్రాజెక్ట్ ని ఆయన చేతుల్లో పెట్టడం మీద సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు ఇండస్ట్రీలోనూ రకరకాల కామెంట్లు. అశ్వినీదత్ కి ఇవన్నీ వినపడక కాదు. ఆయనకు నమ్మకముంది. దర్శకేంద్రులు ఆఖరి పోరాటం డీల్ చేసిన తీరు, దాని ఫలితం ఇంకా కళ్ళ ముందు కదలాడుతూనే.ఉన్నాయి. అడవిరాముడుతో బాక్సాఫీస్ కు గ్రామర్ నేర్పించిన మహానుభావుడి మీదే అపనమ్మకమా. నో వే. అందుకే ఆ గుసగుసలను పట్టించుకోకుండా ముందుకెళ్లాలని డిసైడ్ అయ్యారు.
రచయిత శ్రీనివాస చక్రవర్తి ఇచ్చిన చిన్న ఐడియాని రాఘవేంద్రరావుతో పాటు యండమూరి వీరేంద్రనాథ్, మాటల రచయిత జంధ్యాల, సత్యమూర్తి, దివాకర్ బాబు, క్రేజీ మోహన్ తదితర దిగ్గజాలు కూర్చుని కథకు చక్కని రూపాన్ని తీసుకొచ్చారు. ఫైనల్ వెర్షన్ అయ్యాక ముందు అనుకున్న లైన్ ఇదేనా అనిపించేలా అద్భుతంగా కుదిరింది. ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్నారు. చిరంజీవి సైతం వీలు దొరికినప్పుడంతా నెలరోజులు చర్చల్లో పాల్గొని కీలక మార్పులు కొన్ని రికమండ్ చేయడం చాలా పెద్ద ప్లస్ అయ్యింది.
చిరంజీవికి స్టార్ డం వచ్చాక శ్రీదేవి తనతో జోడిగా నటించలేదు. ఎందరో దర్శక నిర్మాతలు ట్రై చేశారు కాని కుదరలేదు. ఎవరో ఎందుకు శ్రిదేవే నిర్మాతగా మారి ‘వజ్రాల దొంగ’ పేరుతో షూటింగ్ కూడా మొదలుపెడితే అది పావు వంతు కూడా కాకుండానే ఆగిపోయింది. ఈ కాంబినేషన్ కుదిర్చే అదృష్టం అశ్వినిదత్ కు రాసినప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు. విలన్ మహాద్రష్టగా అమ్రిష్ పూరి ఫిక్స్. కన్నడం నుంచి ప్రభాకర్, తెలుగు నుంచి అంకుశం రామిరెడ్డి, తనికెళ్ళ భరణి ఇలా విలన్ గ్యాంగ్ ని భారీగా సెట్ చేసుకున్నారు. కామెడీ ట్రాక్ కోసమే ప్రత్యేకంగా తమిళం నుంచి జనకరాజ్ ను తీసుకొచ్చి అల్లు రామలింగయ్య, బ్రహ్మానందంలకు జోడించారు.
ప్రత్యేకంగా 7 సెట్లు వేశారు. సినిమా ఏ మాత్రం తేడా కొట్టినా అశ్వినిదత్ మళ్ళీ సున్నా నుంచి కెరీర్ ని మొదలుపెట్టాల్సి ఉంటుంది. అయినా తెగించారాయన. విఘ్నాలేవి లేకుండా నిర్విరామంగా షూటింగ్ పూర్తయ్యింది. దినక్కుతా పాట షూట్ కు 103 టెంపరేచర్ జ్వరం ఉన్నా కమిట్ మెంట్ కోసం చిరంజీవి అలాగే చిత్రీకరణలో పాల్గొని అదయ్యాక మూడు రోజులు హాస్పిటల్ బెడ్ మీద ఉండాల్సి వచ్చింది. ఇలాంటి మనసుకు కష్టమనిపించే సంఘటనలు తప్ప ఇంకే ఇబ్బందులు ఎదురుకాలేదు. దత్తు గారు మొదలుపెట్టిన మహాయజ్ఞంకు అసలు పరీక్ష మే 9 వచ్చేసింది. ఫస్ట్ క్లాస్ మార్కులు వస్తే చాలు అనుకుంటే ఏకంగా డిస్టింక్షన్ స్కోర్ కొట్టేసింది బొమ్మ.
నా పేరే రాజు
హీరో పాత్ర అంతగా కనెక్ట్ అవ్వడానికి కారణం అతను ఓ మాములు మనిషి కావడమే. నలుగురు అనాధ పిల్లలను చేరదీసి గైడ్ గా నాలుగు రాళ్ళు సంపాదించుకుంటూ ఎక్కడైనా అన్యాయం జరిగితే సహించలేని వాడిగా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేశాడు. రాజు ఎక్కడా మితిమీరిన హీరోయిజం చూపడు. తనకు చేతనైన స్టైల్ లోనే ఫైట్లు చేస్తాడు. తప్పు చేస్తే వాడు కోటీశ్వరుడైనా, మాయలు తెలిసిన మంత్రగాడైనా ట్రీట్మెంట్ లో ఏం తేడా ఉండదు. తుక్కు రేపడమే. కాని తన పంచన పెరుగుతున్న పిల్లలంటే ప్రాణం. అపాయమని తెలిసినా కాలు విరిగిన పండు కోసం మానససరోవరం వెళ్లేందుకు సిద్ధపడతాడు. ఆఖర్లో మహాద్రష్టను చంపేందుకు మహిమ గల ఉంగరాన్ని తీసుకోమని ఇంద్రజ చెప్పినా దాన్ని వద్దని కత్తి తీసుకునే మొనగాడతడు. ఇలా రాజు క్యారెక్టర్ ని తీర్చిదిద్దిన తీరు అందరికి అలా ఎక్కేసింది
మానవా ..ఈ అందమెలా వచ్చింది మానవా
నిజంగా ఇంద్రలోకంలో దేవేంద్రుడికి కూతురు ఉంటే ఖచ్చితంగా శ్రీదేవి అంత అందంగా ఉండదని బెట్టు కట్టొచ్చనే అభిప్రాయం అభిమానుల్లోనే కాదు సామాన్య పబ్లిక్ లోనూ ఉండేది. పసిడి రంగులో ముట్టుకుంటే ఆ లేలేత లావణ్య సౌకుమార్యం మనకు కొంతైనా అంటుకోదా అని ఆశపడేలా మెరిసిపోయే శ్రీదేవి కన్నా బెస్ట్ ఛాయస్ అతిలోకసుందరిగా ఇంకెవరిని(అగ్ర హీరోయిన్లతో సహా) ఊహించుకున్నా నవ్వు రావడం ఖాయం. మానవా మానవా అంటూ చేసే అల్లరి, అమాయకత్వం కూడిన మొహంతో కల్మషం లేని లేని హావభావాలతో శ్రీదేవిని చూస్తుంటే డబ్బింగ్ ఆర్టిస్టుల టాలెంట్ తో నెట్టుకొస్తున్న కొందరు ఇప్పటి కథానాయికలును చూస్తే జాలి వేస్తుంది.
బాలికా కాపాలికా
ఫార్ములా విలనిజంతో కమర్షియల్ సినిమా ఒక మూసగా మారిపోతున్న తరుణంలో ఆఖరి పోరాటంతో అమ్రిష్ పూరిని తీసుకొచ్చిన రాఘవేంద్రరావు ఇందులో మహాద్రష్టగా ఆయన తప్ప ఇంకెవర్ఫు చేయలేరన్నంత గొప్పగా ఆ పాత్రను పండించారు. బాలికా కాపాలికా ఆవాహయామి అంటూ అమ్మాయిలను వశపరుచుకొని వాళ్ళ ముందు నిమ్మకాయలు వేసే మ్యానరిజంతో చిన్నపిల్లలు నిజంగానే భయపడిపోయారు. గుండు మీద పిలకతో సగ ఆచ్చాదన ఉండే వస్త్రధారణతో అమ్రిష్ పూరి స్వంతంగా డబ్బింగ్ చెప్పుకుని ప్రాణప్రతిష్ట చేసిన తీరు నిజంగా ప్రత్యేకం
రాజా ది గ్రేట్
కమర్షియల్ గా మాస్ వెర్రెక్కిపోయే పాటలు ఇచ్చే సబ్జెక్ట్ కాదిది. అలా అని ఏదో సాగర సంగమం తరహాలో సంగీతం కూర్చే తరహానూ కాదు. ఉపమానాలకు సరిపోని మెగా ఇమేజ్ ఉన్న చిరంజీవి లాంటి హీరో ఆల్బమ్ అంటే ఖచ్చితంగా అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. వాటిని అందుకుంటూనే ఫార్ములా పేరుతో కథలో ఆత్మను చంపకూడదు. అలా చేయాలంటే ముందీ రాజు ఇంద్రజల ప్రేమకథను రాఘవేంద్రరావు కంటే ఎక్కువగా ప్రేమించాలి. అందుకే రాజా క్లాసిక్ అనే పదాన్ని మించే ఇంకేదైనా కొత్తది వాడేలా మర్చిపోలేని గీతాలు ఇచ్చారు.
అబ్బనీ తీయని దెబ్బకు ప్రేక్షకులు ఎంత మైమరిచిపోయారో అంతకు రెట్టింపు యమహా నీ యమాయమా అందంకు ఈలలతో హోరెత్తించారు. ఇక జై చిరంజీవా అంటూ పిల్లలు పాడే పాటను రోమాలు నిక్కబొడుచుకునే రీతిలో స్వరపరిచిన తీరు దాన్ని ఆ టైంలో హనుమాన్ గుళ్ళలో పెట్టుకునేలా చేసింది. ఇక రీ రికార్డింగ్ గురించి రాజా చేసిన మేజిక్ గురించి చెప్తూ పోతే పుస్తకమే అవుతుంది. ఇంద్రజ భూమ్మీదకు వచ్చినప్పుడు ఇచ్చిన బీజీఎమ్ ఇప్పటికీ వైజయంతి సంస్థ తమ బ్యానర్ టైటిల్ కార్డ్స్ లో ఉపయోగిస్తోందంటే ఇంతకన్నా చెప్పేదేముంది. అందుకే రాజా ది గ్రేట్
జంధ్యాల మాటల జల్లు
అప్పటికే దర్శకుడిగా విఖ్యాతి గాంచిన జంధ్యాల గారు జగదేకవీరుడు అతిలోకసుందరికి అద్భుతమైన సంభాషణలు సమకూర్చారు. మాములు మనుషులకు దేవకన్యకు మధ్య జరిగే మాటలను మాస్ ప్రేక్షకుడికి సైతం అర్థమయ్యేలా రాసిన తీరు వాహ్ అనిపించక మానదు. మానవా మానవా అంటూ శ్రీదేవి చేసే పదాల అల్లరి వెనుక జంధ్యాల మార్కు చమత్కారం కనిపిస్తుంది. మెగాస్టార్ అయినా చిరంజీవికి అతిగా అనిపించే హీరోయిజం డైలాగులు జొప్పించకుండా చాలా సహజంగా కూర్చిన తీరు నేలబెంచీకి సైతం సులువుగా చేరిపోయింది. ప్రతి పాత్రకు విలక్షణమైన మాటలు రాసి తానెందుకు ప్రత్యేకమో ఇందులో మరోసారి ఋజువు చేశారు జంధ్యాల.
అందరూ అందరే
ఒకరా ఇద్దరా దీనికి పనిచేసిన ప్రతిఒక్కరు ప్రాణం పెట్టారు కాబట్టే ఊహకందని వెండితెర మాయాజాలం ఆవిష్కృతమై ముప్పై ఏళ్ళు అవుతున్నా ఇంకా వాడిపోని సౌరభాలను వెదజల్లుతూనే ఉంది. టెక్నాలజీ అంతగా లేని టైంలోనే కెమెరాతో అద్భుతాలు సృష్టించిన విన్సెంట్, చిరు శ్రీదేవిల జంటను ఇంపుగా చూపించిన కెఎస్ ప్రకాష్ ఛాయాగ్రహణం, రెండున్నర గంటల పాటు ఒక్క సెకను విసుగు లేకుండా కట్ చేసిన ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వర్ రావు గారి ఎడిటింగ్, నిజమా స్వప్నమా అనిపించేలా ఉన్న చలం కళా నైపుణ్యం, ఫైట్స్ తో ఆబాలగోపాలాన్ని మెప్పించిన పప్పు వర్మ పోరాటాలు ఇలా అందరి సమిష్టి కృషి కళ్ళు పక్కకు తిప్పుకోనివ్వని అద్భుతాన్ని ఆవిష్కరింపజేసింది.
దర్శకేంద్రాయ నమోనమః
చదువుతుంటేనే సవాలక్ష సందేహాలు వచ్చే ఇలాంటి కథను ఎక్కడా లాజిక్స్ గురించి ఆలోచించే అవకాశం ఇవ్వకుండా రాఘవేంద్రరావు గారు తీర్చిదిద్దిన తీరు నభూతో నభవిష్యత్. కేవలం ఉంగరం పోగొట్టుకుంటేనే ఇంద్రలోక ప్రవేశం పోవడం ఏమిటనే సిల్లీ పాయింట్ ని సైతం చాలా కన్విన్సింగ్ గా కథనం ముందుకు వెళ్ళే కొద్ది ఆ అనుమానం తలెత్తకుండా తన టీంతో కలిసి కూర్చిన తీరు నిజంగా ఒక గ్రామర్ పుస్తకం లాంటిది. సన్నివేశాలను కూర్చిన తీరు, ప్రతి అంశంలోనూ తీసుకున్న శ్రద్ధ అణువణువూ కనిపిస్తుంది.
సినిమా మొత్తం మీద ఇంద్రలోకం సెటప్ కనిపించేది కేవలం కొన్ని నిమిషాలే. మిగలిన రెండున్నర గంటల కథ భూమ్మీదే ఉంటుంది. అయినా ఇంద్రజ అనే ఫీలింగ్ ని చివరిదాకా కొనసాగిస్తూ రెండు లోకాల మధ్య ప్రేమకథగా నడిపించడం వల్లే ప్రేక్షకులు మంత్రముగ్దులయ్యారు. పాటల చిత్రీకరణలోనూ తనదైన స్టైల్ చూపించిన దర్శకేంద్రులు చిరు మార్క్ స్పీడ్ స్టెప్స్ ఒక్కటి కూడా లేకపోయినా అసలు ఆ లోటే తెలియనివ్వకుండా మళ్ళి మళ్ళి పాటల కోసమే వచ్చేలా చేయడం ఆయనకే చెల్లింది
ధైర్యం కేరాఫ్ దత్తు గారు
ఇదంతా ఒక ఎత్తైతే ఇలాంటివి విజువల్ వండర్ ను తెరక్కించడానికి భారీ బడ్జెట్ తో పూనుకున్న అశ్వినీదత్ సాహసం గురించి మాత్రం ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమా మీద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రేపు విడుదల అన్నప్పుడు రాష్ట్రం మొత్తాన్ని వరదలు ముంచెత్తిన సమయంలో ఎవరికైనా గుండెపోటుకు తక్కువ ఇంకేదీ రాదు. అయినా కూడా ఫలితం మీద భరోసాతో తన టీమ్ ను నమ్ముకుని ఆయన చేసిన మహా యజ్ఞం మూడు దశాబ్దాలు దాటినా తలుచుకునేలా చేసింది. అందుకే చిరంజీవి ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా రికార్డులు బద్దలు కొట్టినా ఇది మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే
సివరాఖరికి వచ్చేద్దాం
పైన నిజమైన ఇంద్రలోకంలో ఇప్పుడు జరుగుతున్న సన్నివేశం ….
ఇంద్రుడు : ” శ్రీదేవిగారు మీరు నన్ను క్షమించాలి. ఇంద్రజగా ఆ పాత్రకు మీరు చేసిన ప్రాణ ప్రతిష్ట గురించి ఈ రోజు 30 ఏళ్ళు పూర్తైన సందర్భంగా ప్రజలు జగదేకవీరుడు అతిలోకసుందరి గురించి ఇంత గొప్పగా మాట్లాడుకోవడం ఆశ్చర్యంగా ఉంది. మిమ్మల్ని చాలా త్వరగా ఈ లోకానికి రప్పించుకుని నేను ఎంత పొరపాటు చేశానో అర్థమవుతోంది “
శ్రీదేవి : ” పర్వాలేదు ఇంద్రవర్యా. మీ కూతురిగా నటించిన అభిమానంతో ఒక్క వరం ఇవ్వండి. మీ పురవాసులందరికీ ఒకసారి ఈ సినిమా స్పెషల్ షోని వేయండి. సుఖాలను అనుభవించడంలోనే కాదు తెలుగు సినిమా చూడటంలోనూ స్వర్గం ఉంటుందని ప్రతిఒక్కరు తెలుసుకుంటారు. అంతే చాలు”
ఇంద్రుడు : ” తప్పకుండా తల్లి. తక్షణమే ఏర్పాట్లు చేసేదను. ఇక్కడే నివాసముంటున్న ఎన్టీఆర్, ఎఎన్ఆర్, ఎస్వీఆర్, సావిత్రి, కెవి రెడ్డి, బిఎన్ రెడ్డి, అల్లు రామలింగయ్య తదితర దిగ్గజాల సమక్షంలో మీతో కలిసి మేమూ ఆ దృశ్య కావ్యాన్ని మరోసారి వీక్షించెదము”
ఇప్పుడే కాదు ఇంకో 100 ఏళ్ళు దాటినా ఇలాంటి అద్భుతాల గురించి చెప్పేవాళ్ళు రాసేవాళ్ళు తెలుగు సినిమా బ్రతికున్నంత కాలం ఉంటారు వస్తారు……