iDreamPost
android-app
ios-app

మరో యేడు కాలగర్భంలోకి.

  • Published Dec 31, 2019 | 11:34 AM Updated Updated Dec 31, 2019 | 11:34 AM
మరో యేడు కాలగర్భంలోకి.

కాలం ఒడిలో మరో సంవత్సరం కరిగిపొయింది. ప్రతి సంవత్సరం మాదిరే ఈ ఏడు కూడా ఎన్నో అనుభవాలను, జ్ఞాపకాలను మిగిల్చింది. మరెన్నో పాఠాలను, గుణపాఠాలను నేర్పింది. కొందరికి జీవితాంతం గుర్తుండిపొయే విజయాలకు సాక్షీభూతంగా నిలిస్తే మరికొంతమంది అత్యంత దారుణమైన ఓటమిని చవి చూపించి చేదు జ్ఞాపకంగా మిగిలిపొయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో గడచిన ఈ 2019 ఒక సంచలనం, ఒక మహా రాజకీయ యుద్దానికి సజీవ సాక్ష్యం. రాజకీయంగా పార్టీల జాతకాలను తారుమారు చేస్తూ మహామహులనే మట్టికరిపించేలా చేసి, మర్చిపోలేని చరిత్రను లిఖించి కాలగర్భంలో కలిసిపొయింది.

తెలుగుదేశం ఘోర ఓటమి

2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన రోజునుండి ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కొక్క హామీకి మంగళం పాడుతూ, అమరావతి తప్ప ఈ రాష్ట్రంలో ఇంకో ప్రాంతమే లేదనే విధంగా తీసుకున్న నిర్ణయాలతో ప్రజల్లో అసహనం పెల్లిబికింది.ఒకానొక దశలో భారతదేశంలో అమరావతి అనేది ఒక ప్రాంతంలా కాకుండా, అమరావతిలోనే భారతదేశం ఒక ప్రాంతం అనుకునేంతగా ప్రచారం జరిగింది. కానీ అక్కడ నిజానికి ఊహా బొమ్మలు తప్ప ఒక్క శాశ్వత కట్టడం లేకపొవటం,ఇదేంటి అని ప్రశ్నించినవారిని మీడియా ద్వారా అభివృద్ది నిరోధకులు అని ముద్రవేసే ప్రయత్నం చేయటం, దీంతోపాటు కౌలు రైతులకు ఎటువంటి మేలు చేయకపోవటం, రైతుకి గిట్టుబాటు ధర కల్పించకపోవటంతో ప్రభుత్వ తీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి గూడుకట్టుకుంది. నిఘా వర్గాలు ముందుగానే ప్రజల్లో వున్న వ్యతిరేకతను చంద్రబాబు దృష్టికి తీసుకుని రావటంతో ఆఖరి అస్త్రంగా పథకాలే ఓట్లు రాలుస్తాయని ఎన్నికలకి రెండు నెలల ముందు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వేసిన పాచిక అత్యంత దారుణంగా విఫలం అయింది. పసుపు కుంకుమ అంటూ డ్వాక్రా మహిళలకు 10వేలు, సామాజిక పించన్లను వెయ్యి నుండి రెండువేలకు పెంచటం ద్వారా ఎన్నికల్లో లబ్ది పొందుదాం అనుకుని తెలుగుదేశం వేసిన ఎత్తుగడలకు ఓటర్ల నుండి సానుకులత రాలేదు. పోలింగ్ రోజున మధ్యాహ్నం తరువాత మహిళలు అధిక సంఖ్యలో వచ్చి తెలుగుదేశంకే ఓటు వేశారని తెలుగుదేశం నేతలు భావించారు. కానీ గడచిన 5 ఏళ్ళు తెలుగుదేశం నేతలు అవలంబించిన దుందుడుకు చర్యలకు విసిగి వేసారిన ప్రజలు తెలుగుదేశం పార్టీని దారుణంగా ఓడించారు.175 స్థానాల్లో కేవలం తెలుగుదేశాన్ని 23 స్థానాలకు కి పరిమితం చేశారు.

ఎన్నికల తరువాత కూడా తెలుగుదేశం ఆశించిన స్థాయిలో ప్రతిపక్ష పాత్ర పోషించటంలో విఫలం అవుతు వచ్చింది. అసెంబ్లీలో జరిగే చర్చల్లో ముఖ్యమంత్రి జగన్ ధాటికి తెలుగుదేశం నిలబడలేకపొయింది. అనేక రకాలుగా తెలుగుదేశం జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసినా ప్రభుత్వం ఇచ్చే ధీటైన సమాధానాలతో దిక్కుతోచని స్థితిలోకి వెల్లిపోయి అసెంబ్లీ సమావేశాల్లో ఘోరంగా విఫలం అవుతూ వస్తుంది. దీనికి తోడు తెలుగుదేశం పార్టీకి ఆర్ధిక సహాయం అందించే సుజనా, సి.యం రమేష్ లాంటి వారు బి.జే.పి కండువా కప్పుకున్నారు. మరికొంతమంది తెలుగుదేశం నాయకులు కూడా అదే బాట పట్టారు. వంశీ లాంటి నేతలు తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. గ్రామ స్థాయిలో క్యాడర్ పూర్తి స్థాయి నిస్తేజంలోకి వెళ్ళిపోయింది. ప్రభుత్వంపై పోరాటానికి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా తెలుగుదేశం క్యాడర్ నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందకపోవటంతో నాయకులు సైతం దిక్కు తోచని స్థితిలోకి వెళ్ళిపొయారు.

చరిత్రలో గుర్తుండిపొయే జగన్ సునామీ.

చండ్ర గాడ్పులలో, వాన మబ్బులలో, మంచు సొనలలో నేనొక్కడినే అంటూ ధిక్కారం నుండి అధికారంవైపుగా సాగిన పాదయాత్ర ఈ దశాబ్ద జగన్ పొరాటంలో ఒక అపూర్వ ఘట్టం గా నిలిచిపొయింది. 3,648 కిలో మీటర్లు, 341 రోజులు, 134 నియోజకవర్గాలు, 2,516 గ్రామాలు, 231 మండలాలు, 55 ఆత్మీయ సమ్మేళనాలు, 124 బహిరంగ సభలతో సాగిన ఈ మహా పాదయాత్రలో జగన్ ప్రజల మనోభావాలు, అవసరాలు, ఇబ్బందులు తెలుసుకుంటూ వారికి భరోసా ఇస్తూ వారి నమ్మకాన్ని గెలుచుకున్నారు. ఫలితంగా ఏప్రిల్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ సునామీ సృష్టించింది. తెలుగుదేశం కంచుకోటలుగా చెప్పబడే నియోజకవర్గాలను సైతం బద్దలకొట్టింది. ఈ ప్రభంజనంలో తెలుగుదేశంపార్టీ తరపున నిలబడిన ఫ్యామిలీ ప్యాకేజీలు మట్టి కరిచాయి. డిప్యుటి సి.యం గా ఉన్న కే.యి తోపాటు భూమా, జేసి, పరిటాల, బోల్లినేని కుటుంభాలు, బొబ్బిలి రాజులు , విజయనగరం రాజులు, చివరికి చంద్రబాబు తనయుడు నారా లొకేష్ తో సహా ఓటమి పాలయ్యారు. చంద్రబాబు మంత్రివర్గం దాదాపు గల్లంతయ్యింది. 24 మంది మంత్రుల్లో 22 మంది పోటి చెయగా 19మంది ఘోర పరాజయం మూటగట్టుకున్నారు.

ఎన్నికల్లో గెలుపుతో నేను ఉన్నాను అంటు భరోసాతో సాగిన ప్రమాణస్వీకర మహొత్సవంతో జగన్ జనరంజక పాలనకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా నవరత్నాల అమలుకు పెద్దపీట వేస్తూ విప్లవాత్మక నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. తెలుగుదేశం గోడ దూకటానికి మెజారిటి శాశన సభ్యులు సిద్దంగా ఉన్నా రాజీనామ షరతు పెట్టి తన విశ్వసనీయతను నిరూపించుకున్నారు. పించన్ల పెంపు, మహిళలకు ఆసరా పథకం ద్వారా చేయూత , పారిశుథ్య కార్మికుల, అంగన్వాడి వర్కర్లు, డ్వాక్రా యానిమేటర్లు, కమ్యూనిటి హెల్త్ వర్కర్లు, హొంగార్డుల జీతాలు పెంపుతో తొలి అడుగులు వేసారు. దేశంలోనే తొలి ప్రయత్నంగా రివర్స్ టెండరింగ్ ద్వారా వేల కోట్లు ఆదా చేయడంలో సఫలీకృతం అయ్యారు. పరిశ్రమల్లో 75% స్థానికులకే ఉద్యోగం అనే బిల్లు, మహిళలపై సాగుతున్న దాడులను అరికట్టే విధంగా దిశ బిల్లు ప్రవేశపెట్టి దేశం తన వైపు చూసేలా చేశారు. రైతు భరోసా , అగ్రిగోల్డ్ సమస్య , ఆటో టాక్సి వారికి ప్రోత్సాహం, గ్రామ సచివాలయాలు, విలేజి వాలెంటీర్లు, దశలవారి మద్యపాన నిషేధంతో తన పాలనలో ప్రజా సంక్షేమం కోసం ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారో చాటి చెప్పారు. అలగే మొదట్లో వరదల వలన వచ్చిన ఇసుక కొరత, కరెంటు కోతలతో ప్రజలు కాస్త ఇబ్బంది పడ్డా వాటిని అధిగమించి తనది ప్రజా ప్రభుత్వం అని నిరూపించుకున్నారు. (సరిగ్గా ఎన్నికల ముందు సొంత చిన్నాన్న అయిన వివేకానంద రెడ్డి హత్య జగన్ కి కోలుకోలేని దెబ్బ, ఆ కుటుంబంలో ఈ ఏడు అది ఒక మహా విషాధం).

చతికిల పడ్డ జనసేన

ఇక జనసేన విషయానికి వస్తే గడచిన సంవత్సరం జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ కి తీవ్ర నిరాశ మిగిల్చింది. ఏదో చేస్తారు, ఎంతో చేస్తారు, జాతకాలు తారుమారు చెయగల ప్రభావిత శక్తి అంటు చెప్పుకొచ్చిన జనసేన పార్టీ అభ్యర్ధులు ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డారు. ప్రత్యర్ధులకి కనీస పోటి ఇవ్వలేకపోవటం, ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోవటం ప్రజారాజ్యం కన్న దారుణంగా విఫలం అవ్వడం సాక్ష్యాత్తు అధినేత పవన్ కళ్యాణే పోటి చేసిన రెండు చోట్ల ఓడిపొవటం, కార్యకర్తలకు తీవ్ర నిరాశను మిగిల్చింది. దీనికి తోడు ఎన్నికల అనంతరం జనసేన పార్టీలో నుండి సుమారు 10మంది ముఖ్యనేతలు పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోవటం, పవన్ కళ్యాణ్ కి అత్యంత ఆప్తుడిగా ఉన్న రాజా రవితేజ సైతం బయటికి వచ్చి పవన్ కళ్యాణ్ ప్రజల మధ్య విద్వేషాలు రగిలిస్తు విచ్చిన్నకర శక్తిగా మారిన తీరుపై ఘాటుగా విమర్శ చేసి వెళ్ళిపోయారు. జనసేన భారతీయ జనతా పార్టీలో విలీనం చెయటానికి సన్నాహాలు చాపకింద నీరులా జరుగుతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతున్నది. నేను సినిమాలు చేయను అని చెప్పిన పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లో నటించటానికి సిద్దం అని సంకేతాలు పంపటంతో ఈ పార్టీ మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది.

2014 లో ఎన్నికల ముందు ప్రశ్నిస్తా అంటూ ఎంతో ఆర్భాటంగా ప్రారంభం అయిన పవన్ పార్టీ ఆ తరువాత గడిచిన 5ఏళ్లలో ప్రవర్తించిన తీరు చంద్రబాబు ప్రభుత్వాన్ని అనేక అంశాల్లో వెనకేసుకు వచ్చిన విధానంతో ఆ పార్టీ పైన , పవన్ కళ్యాణ్ అజెండా పైన ప్రజల్లో అనేక అనుమానాలు పెరుగుతూ వచ్చాయి. వాటిని నిజం చేసేలా ఎన్నికల్లో అప్పటివరకు ప్రతిపక్షంలో ఉన్న జగన్ ని తీవ్రంగా విమర్శించటం, చంద్రబాబు పై అంటి ముట్టని విమర్శలు చేయటం, చంద్రబాబు తనయుడు లోకేష్ నిల్చున్న మంగళగిరి నియోజకవర్గంలో అభ్యర్ధిని పెట్టకపోగా చివరికి ప్రచారం కూడా చేయకపోవడంతో ప్రజల్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి B టీం అనే అనుమానం ప్రజల్లో బలపడింది. దీంతో ఎన్నికల్లో కేవలం రాజోలు సీటు తప్ప మరొక చోట సత్తా చాటలేకపొయింది. ఉన్న ఆ ఒక్క శాసన సభ్యుడు ఎప్పుడు గోడ దూకుతారో తెలియని స్థితి.

ప్రభావం చూపని జాతియ పార్టీలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో పలు జాతీయ పార్టీలు కాంగ్రెస్‌, బిజెపి, కమ్యూనిస్టులు కనీసస్థాయిలోనైనా ప్రభావాన్ని చూపలేకపోయాయి. గెలుపోటముల సంగతి అలా ఉంచితే, కనీసం డిపాజిట్లు కూడా సాధించలేకపోయాయి. పైగా ఆ పార్టీలకు వచ్చిన ఓట్లు ఏ పార్టీ విజయావకాశాలనూ ప్రభావితం చేయలేకపోయాయి. వీటికంటే ఎక్కువగా అనేక చోట్ల నోటాకు ఓట్లు దక్కడం విశేషం.

2019 సంవత్సరం రాజకీయంగా చాలామందికి పరాభవాన్ని మిగిల్చినా 2020 మొదటి లోనే తిరిగి తమ సత్తా చాటుకునే అవకాశం స్థానిక ఎన్నికల రూపంలో తిరిగి వచ్చింది. ఈ తరుణంలో ఓడిన పార్టీలు పోరాడి తమ అస్తిత్వం కాపాడుకుని నిలబడతాయో 2019 లో వచ్చిన ఫలితాలు పునరావృతం అయ్యి చతికిలపడి అస్థిత్వం కోల్పోతారో.. ఈ కొత్త ఏడాది రాజకీయ నాయకులకు ఎలాంటి అనుభవాలని మిగల్చబోతుందొ వేచి చూడాలి.. బై బై 2019 …