పూరీ – దర్శకత్వం ఒక వ్యసనం

అతని సినిమాల్లో హీరో తిన్నగా ఉండడు….

బుద్ధిగా మసలుకోవడం అంటే వాడికి తెలియదు…. ‘

నోటికొచ్చినట్టు మాట్లాడతాడు, కాని అదే కరెక్ట్ అని మనతో అనిపిస్తాడు…..

ఇష్టమొచ్చినట్టు కొడతాడు,మనకూ భయం వేస్తుంది తప్పు చేస్తే వాయిస్తాడని….

పిచ్చి పిచ్చి గెంతులు వేస్తాడు, కాకిగోల టైపులో పాటలు పాడతాడు, ఆ పాటలే మళ్ళి మళ్ళి వింటాం..

ఇంతకీ ఎవరా హీరో, ఏమా దర్శకుడి కథ అనుకుంటున్నారా ?

ఆ హీరో, దర్శకుడు రెండు ఒక్కరే………పూరి జగన్నాథ్

పవన్ బాక్స్ ఆఫీస్ పవర్ చూపిన బద్రి

మొదటి సినిమా పవర్ స్టార్ తో చేసే అవకాశం రావాలంటే దాని వెనుక కృషి, పట్టుదల, కసి ఉండాలి. అవి నరాల్లో నింపుకున్న వాళ్ళకు అదృష్ట దేవత ఆటోమేటిక్ గా ఫ్రెండ్ అయిపోతుంది. అందుకే ఆ తల్లి ఫ్రెండ్ లిస్ట్ లో పూరి కూడా చేరిపోయాడు. ఫలితం బద్రి సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్. అప్పటికే పవన్ కళ్యాణ్ స్టార్ హీరో. అతని ప్రతి సినిమా మీద చాలా అంచనాలు ఉంటున్నాయి. అతన్ని డైరెక్ట్ చేసిన వాళ్ళు కూడా అధిక శాతం స్టార్ డైరెక్టర్లే. సో పవన్ కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడనేది టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. స్క్రిప్ట్ విషయంలో ఎక్కడా తప్పు జరక్కుండా కేర్ తీసుకున్నాడు పూరి. క్యూట్ లవ్ స్టొరీ సెట్ చేసుకున్నాడు. తమ్ముడు సినిమాతో ఆడియో షాపుల్లో పవన్ ఫాన్స్ బారులు తీరేలా చేసిన రమణ గోగుల ను మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకున్నాడు.దాన్ని మించిన ఆల్బం ఇచ్చాడు రమణ.

లవ్, యాక్షన్, మ్యూజిక్, కామెడీ, పవన్ మార్క్ హీరోయిజం అన్ని పర్ఫెక్ట్ గా మిక్స్ చేసాడు. ఫైనల్ రిజల్ట్ కోట్ల రూపాయల వసూళ్ళతో వరల్డ్ వైడ్ 40 కేంద్రాల్లో వంద రోజులు. ఊహించిన దాని కంటే పెద్ద సక్సెస్. అప్పుడు రింగ్ అవ్వడం మొదలైన పూరి నెంబర్ ఇప్పటికీ మోగుతూనే ఉంది. సక్సెస్ ఇచ్చే గిఫ్ట్ అంతే. ఎప్పుడు కింగ్ సైజులోనే ఉంటుంది. తర్వాత బాచి. జగపతి బాబు హీరో. హెవీ కంటెంట్ బాలన్స్ తప్పింది. రెండో సినిమాకే లెసన్స్ నేర్చుకున్నాడు పూరి. కాస్త రిలీఫ్ కోసం తమ్ముడు సినిమాని కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ హీరోగా యువరాజ పేరుతో తీస్తే సూపర్ హిట్. రీమేక్ అయినా టేకింగ్ లో వైవిధ్యం చూపించి రాజ్ కుమార్ ఫ్యామిలీ మొత్తాన్ని తనతో ప్రేమలో పడేసుకున్నాడు.

తెలుగుతెరకు వైవిధ్యం నేర్పిన సుబ్రహ్మణ్యం

మామూలుగా హీరో, హీరొయిన్ ప్రేమించుకోవడానికి ఒకే రకమైన నేపధ్యాన్ని వాడటం అన్ని సినిమాల్లో చూస్తూ వచ్చారు ప్రేక్షకులు. చూస్తూ వచ్చారు అనటం కన్నా అలా అలవాటు చేసారు అనాలి. వాళ్ళలో కలిసిపోతే పూరి ప్రత్యేకత ఏముంది. తన పంధా వేరు. ఆలోచనలు వేరు. సో ఒక షాకింగ్ లైన్ తో అప్పుడప్పుడే పైకొస్తున్న రవితేజను హీరోగా పెట్టుకుని ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం మొదలు పెట్టాడు. తను రాయ్ అనే బక్కపలచని అమ్మాయి హీరొయిన్. సపోర్టింగ్ కాస్ట్ మాత్రం పేరున్నవాళ్లనే తీసుకున్నాడు. సెప్టెంబర్ 14, 2001 లో విడుదల అయ్యింది. మొదటి రోజు చూసిన వాళ్ళు నమ్మలేదు. ఏంటి ఇలా కూడా తెలుగు సినిమా తీయోచ్చా అని. కథలోని వైవిధ్యానికి పట్టం కట్టారు. ఫలితం సూపర్ హిట్. కమర్షియల్ లెక్కలు ఇంత అని చెప్పలేం కాని మ్యూజికల్ గా అటు చక్రిని, దర్శకుడిగా ఇటు పూరిని ఓ పది మెట్లు పైకి ఎక్కించింది ఈ సినిమా. అందుకే ఉత్తమ కథ రచయితగా నంది అవార్డు కూడా కొట్టేసాడు.

కన్నడ లో రాజ్ కుమార్ కుటుంబ ప్రేమాభిమానాలు సంపాదించుకున్న పూరి కి వాళ్ళ నుంచి కాల్.అర్జెంటు గా బెంగుళూరు రమ్మని. ఉద్దండులైన దర్శకులు కన్నడలో ఎందరో ఉండగా ఆయన చిన్న కుమారుడు పునీత్ రాజ్ కుమార్ తెరంగేట్రం పూరి దర్శకత్వంలోనే జరగాలని నిర్ణయం తీసుకున్నారు. రాజ్ కుమార్ అంతటి సూపర్ స్టార్ అడిగితే కాదనే వారెవరు. అప్పూ పేరుతో సినిమా తీసారు. 2002 సంవత్సరం. రాజ్ కుమార్ ఎలాగైతే తమ వారసుడు లాంచ్ అవ్వాలని కోరుకున్నారో దాని కన్నా ఇంకో వంద రెట్లు మిన్నగా తీసి చూపించాడు పూరి. విడుదల అయిన అన్ని ప్రధాన కేంద్రాల్లో 200 రోజులు ఆడేసింది. కన్నడ నిర్మాతలు బ్లాంక్ చెక్ లతో పూరి వెంట పడ్డారు. ససేమిరా అన్నాడు. తనకు కన్నతల్లి తెలుగు పరిశ్రమ. వదిలి వచ్చే సమస్యే లేదన్నాడు. ప్రూవ్ అయిన సబ్జెక్టు కాబట్టి అప్పూ నే రీమేక్ చేయాలనీ డిసైడ్ అయ్యాడు. మళ్ళి రవితేజ హీరో. కన్నడ లో చేసిన రక్షిత హీరొయిన్. చక్రి సంగీతం. మొదలైంది.

రవితేజ ను స్టార్ ను చేసిన ఇడియట్

ఇడియట్ పేరుతో అప్పూ రీమేక్ మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే రోజు ఆగస్ట్ 22 న విడుదల అయింది. ఓపెనింగ్స్ పర్వాలేదు. బాగానే వచ్చాయి. రిలీజ్ అయిన సెంటర్స్ తక్కువే. మెల్లగా పాజిటివ్ టాక్ మొదలైంది. స్లో గా వైరస్ లాగా మౌత్ పబ్లిసిటీ రాష్ట్రమంతా పాకిపోతోంది. టికెట్ కౌంటర్ల దగ్గర జనాలు పోటెత్తడం మొదలైంది. ప్రింట్ల సంఖ్య పెంచే పనిలో పూరి కి ల్యాబ్ లోనే సమయం గడిచిపోతోంది. తనే నిర్మాత మరి. ఫోన్ల మీద ఫోన్లు కంగ్రాట్స్ చెబుతూ. సమాధానం చెప్పడానికే రోజు చాలడం లేదు. చక్రి స్టూడియో నుంచి ఇంటికి వెళ్ళడానికి కూడా టైం ఇవ్వట్లేదు నిర్మాతలు. తమ సినిమా చేస్తా అని హామీ ఇస్తే తప్ప వదలమని భీష్మించుకు కూచున్నారు. స్టార్ హీరో కాని సినిమా 100 రోజులు ఆడటం టాలీవుడ్ చాలా కాలం తర్వాత చూసింది. ఇడియట్ దెబ్బకు రవితేజ స్టార్ హీరో అయ్యాడు. ఒక్క సినిమాతో ఎందరో జీవితాల్ని సమూలంగా మార్చేసాడు పూరి జగన్నాథ్.

ఈ సారి మార్షల్ ఆర్ట్స్ నేపధ్యంలో రవితేజ తోనే అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి మొదలు పెట్టాడు. కొత్త అమ్మాయి అసిన్. సీనియర్ నటి జయసుధ అండ ఈసారి. విచిత్రంగా టైటిల్ లో హీరో కు ఇంపార్టెన్స్ ఉండదు. జయసుధ, ప్రకాష్ రాజ్, అసిన్ వీళ్ళు ముగ్గురిని ఉద్దేశించి పేరు పెట్టాడు. కాని సినిమాలో చెలరేగిపోయేది మాత్రం రవినే. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో అద్బుతమైన సెంటిమెంట్ జోడించిన విధానానికి ఫ్యామిలీలు సినిమా హాల్స్ వైపు వెళ్ళడం మొదలు పెట్టాయి. ఇడియట్ హిట్ స్టేటస్ ని, కాంబినేషన్ కు వచ్చిన క్రేజ్ ని కాపాడుకునే రీతిలో ఇంకో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు పూరి.

మెంటల్ పోలీస్ కథకళి ‘శివమణి’

ఇన్ని సాధించినోడి మీద అగ్ర హీరోల కళ్ళు పడలేదా అనే కామెంట్స్ కు చెక్ పెడుతూ అక్కినేని నాగార్జున నుంచి కాల్. అప్పుడే మొదలైన సెల్ ఫోన్ రెవల్యూషన్ పసిగట్టి శివమణి అనే టైటిల్ తో ట్యాగ్ లైన్ లో ఫోన్ నెంబర్ వచ్చేటట్టు డిజైన్ చేసిన క్రియేటివ్ ఐడియా ను సూపరన్నారు అందరూ. ఇడియట్ భామ రక్షిత, తమిళ్ అమ్మాయి అసిన్ హీరొయిన్లు. 35 కేంద్రాల్లో వంద రోజులు ఆడిన సినిమాను సూపర్ హిట్ కాక ఇంకేమంటారు. టాప్ హీరో తో చేసినా తడబడకుండా పూరి బాక్స్ ఆఫీస్ కి తన స్టామినా పవర్ రుచి చూపించాడు. ఇంకో స్టార్ హీరో తో అవకాశం.

ఈ సారి జూనియర్ ఎన్టీఆర్. ఆంధ్రావాలా టైటిల్. ఫాన్స్ గాల్లో మేడలు కట్టేశారు సినిమా గురించి. సైకిల్ నేర్చుకునేటప్పుడు కింద పడేకొద్ది బాగా వస్తుందంటారు పెద్దలు. ఆ సామెత కోసమే అన్నట్టు బొమ్మ ఆడలేదు. పెద్ద ఫ్లాప్ ఎలా ఉంటుందో రుచి చూసాడు పూరి. అంచానాలు హద్దులు దాటితే ఫలితం ఇంత దారుణంగా ఉంటుందాని తెలుసుకున్నాడు. ఇదే సినిమా కన్నడలో పునీత్ రాజ్ కుమార్ తో చేస్తే ఆడటం గమనార్హం. ఈసారి మళ్ళి సాహసం చేయదలుచుకోలేదు. తనేంటో ప్రూవ్ చేయాలి. తమ్ముడు సాయి రాం శంకర్ తో 143 తీసాడు. పాస్ మార్కులు పడ్డాయి. నాగ్ మళ్ళి పిలిచాడు. సూపర్ అనే టైటిల్ తో హాలీవుడ్ రేంజ్ లో రాబరీ కాన్సెప్ట్ తో సినిమా తీసాడు. మరీ స్టైలిష్ గా ఉండేసరికి మనవాళ్ళు మనస్పూర్తిగా ఆదరించలేకపోయారు. ఇంకో లెసన్.

ఇండస్ట్రీ రికార్డులకు మైండ్ బ్లాక్ చేసిన పోకిరి

సూపర్ స్టార్ కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబు అప్పటికే నాన్నకు తగ్గ పేరు తెచ్చుకున్నాడు. ఒక్కడు తర్వాత దాన్ని మించిన సాలిడ్ బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్నాడు. మరోవైపు ఒక కొత్త హీరో తెరంగేట్రంతో పక్క రాష్ట్రంలో ఇండస్ట్రీ హిట్ సాధించిన పూరి మన దగ్గర ఎందుకు సాధించలేడనేది అందరిలో మెదులుతున్న డౌట్. పూరి దగ్గర ఒక కథ ఉంది. టైటిల్ ఉత్తమ్ సింగ్ అని ఏదో అనుకున్నాడు. దానికి మహేష్ అయితేనే పర్ఫెక్ట్. కాని అప్పటిదాకా మహేష్ ఫుల్ మాస్ క్యారెక్టర్ చేయలేదు ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి.

సో పూరికి ఇది సవాల్. తుఫాను గాలిలో సముద్రంలో ఎదురీదుతూ పడవను నడిపే ఛాలెంజ్ స్వీకరించాడు. పక్కా స్క్రిప్ట్. టైటిల్ పోకిరి గా మార్చాడు. మాస్ రౌడీ గా దందా చేసే పాత్రలో మహేష్. ప్రీ క్లైమాక్స్ లో ఇచ్చే ట్విస్ట్ కి మతి పోవాలి. అదే జరిగింది థియేటర్లో. ఏప్రిల్ 28, 2006 విడుదల. యధావిధిగా మహేష్ ఫాన్స్ హంగామా థియేటర్ల దగ్గర. మొదటి 5 రోజులు బాగుంది అనే టాక్. రెండో వారం నుంచి మొదలైంది సునామి.

అది ఎంత భీభత్సంగా మారిందంటే రెండో వారం మొదలైన ఉప్పెన 25 వారాల దాకా ఆపే దమ్ము ఎవరికీ లేకపోయింది. రికార్డులు బద్దలయితే ఆ ముక్కలు ఎక్కడున్నాయో కూడా దొరకలేదు. ఎవడు కొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు అన్న డైలాగ్ పలకని యూత్ లేడు. ఆ సినిమాలో షియాజీ షిండే ఒక సెటైర్ వేస్తూ 100 డేస్ 200 సెంటర్స్ అంటాడు. యాధాలాపంగా పూరి రాసుకున్న ఆ డైలాగ్ ను ప్రిన్స్ నిజం చేసి చూపించాడు. 15 కేంద్రాల్లో ద్విశతదినోత్సవం చేసుకున్న చివరి తెలుగు సినిమా ఇదే. మణి శర్మ మేజిక్ ట్యూన్స్ కి రాష్ట్రం మొత్తం ఊగిపోయింది.మహేష్ బాబు ఇండస్ట్రీ హిట్ కల తీర్చాడు పూరి.

తర్వాత కథ బన్నీది. అల్లు అర్జున్ కి స్టైలిష్ స్టార్ గా అప్పటికే పేరొచ్చింది. టిపికల్ హీరో క్యారెక్టర్ తో పిచ్చెక్కిస్తున్న పూరి డైరెక్షన్ లో బన్నీ సినిమా ఎలా ఉంటుందనేది దేశముదురు రూపంలో ఆడియన్స్ కి కనిపించింది. సన్యాసం తీసుకున్న అందమైన యువతిని ప్రేమించేలా చేయటమే పనిగా పెట్టుకున్న ఒక్క కుర్ర జర్నలిస్ట్ లవ్ స్టోరీని మసాలా మిస్ అవ్వకుండా తీసిన పూరి నేర్పరితనానికి నిర్మాత దానయ్య గల్లా పెట్టెలు నిండిపోయాయి. చక్రి ఫాస్ట్ బీట్స్ కు బన్నీ స్టెప్స్ తోడై రచ్చ రచ్చ జరిగింది. మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు పూరి.

మెగా పవర్ స్టార్ తొలి అడుగు చిరుత

3 దశాబ్దాల పాటు ఏకచత్రాదిపత్యంగా టాలీవుడ్ ను ఏలిన మెగాస్టార్ చిరంజీవి ఏకైక వారసుడు రాం చరణ్ తేజ్ ను తెరకు పరిచయం చేయాలి. చిరుతో ఎన్నో భారీ బ్లాక్ బస్టర్స్ తీసిన వైజయంతి అశ్వినిదత్ ముందుకు వచ్చారు. దర్శకుడు ఎవరు. ఎందరినో అనుకున్నారు. సీనియర్ దర్శకులైతే ఎలా ఉంటుందని తర్జన భర్జన పడ్డారు. చివరికి యూత్ పల్స్ మీద రీసెర్చ్ చేసినంత పరిజ్ఞానం పెంచుకున్న పూరి జగన్నాథ్ కే ఓటు వేసారందరూ. సినిమా పేరు చిరుత.

ఇండస్ట్రీ హిట్ కాకపోయినా చెర్రీ కి సరైన లాంచింగ్ ప్యాడ్ గా ఉపయోగపడింది. మణిశర్మ వన్ అఫ్ ది బెస్ట్ ఆల్బం ఇచ్చాడు. 178 కేంద్రాల్లో 50 రోజులు, 40 డైరెక్ట్ సెంటర్స్ లో 100 రోజులు ఆడటాన్ని యావరేజ్ అంటే నేరమే అవుతుంది. తర్వాత ప్రభాస్ తో మొదటి సారి చేసిన బుజ్జిగాడు సినిమాలో హీరోను అందరు ప్రేమించారు. ఎవరు చూపించనంత కొత్తగా రెబెల్ స్టార్ ను చూపించటం అభిమానులను పరవశుల్ని చేసింది. సీనియర్ మోస్ట్ యాక్టర్ మోహన్ బాబు ను ఒప్పించి ఇందులో ఒక ఇంపార్టెంట్ రోల్ వేయించాడు పూరి. ప్రభాస్ బెస్ట్ మూవీస్ లో ప్లేస్ దక్కించుకుంది బుజ్జిగాడు.

రవితేజతో చేసిన నేనింతే కృష్ణ నగర్ లో సినిమా చాన్సుల కోసం వచ్చి నానా యాతన పడుతున్న వైనాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిన తీరు ఇప్పటికి లైవ్లీ గా అనిపిస్తుంది. నిజాలు చేదుగా ఉంటాయి కాబట్టి దీన్ని అంగీకరించడానికి ప్రేక్షకులకు మనసు ఒప్పలేదు . ఇదే సినిమా బుల్లి తెరపై సూపర్ హిట్ అవ్వటం మర్చిపోకూడదు. బుజ్జిగాడు హాంగ్ ఓవర్ నుంచి బయటికి రాలేకపోయిన ప్రభాస్ ఇంకోటి ట్రై చేద్దామన్నాడు . ఏక నిరంజన్ వచ్చింది . ఇంకో లెసన్ పూరికి. ఆడలేదు మరి. సిన్సియర్ పోలీస్ కాప్ గా గోపీచంద్ తో తీసిన గోలీమార్ బాగానే దూసుకెళ్లింది. గోపి టాప్ 5 లో దీనిది ప్రత్యేకమైన స్థానం.

తర్వాత రానా తో చేసిన నేను నా రాక్షసి మరో లెసన్. మొదటిసారి బాలీవుడ్ లో అడుగు పెట్టి అమితాబ్ తో చేసిన బుడ్డా హోగయా తేరా బాప్ కారణంగా ఆయనకు అభిమాన పాత్రుడు అయిపోయాడు. తక్కువ టైం లో సూపర్ స్టార్ మహేష్ బాబు తో రెండో సారి చేసిన బిజినెస్ మెన్ రియల్ సినిమా బిజినెస్ ఎలా చేయాలో చూపించింది. లో బడ్జెట్ మోర్ రిటర్న్స్ సూత్రం ఋజువు చేసి చూపించాడు. తర్వాత దేవుడు చేసిన మనుషులు, కెమెరామెన్ గంగతో రాంబాబు, ఇద్దరమ్మాయిలతో దర్శకుడిగా ఫెయిల్ కానప్పటికీ బాక్స్ ఆఫీస్ లెక్కలో మాత్రం తేడాలు వచ్చాయి. నితిన్ తో చేసిన హార్ట్ ఎటాక్ డల్ అయిన నితిన్ కెరీర్ కు బూస్ట్ లాగా పని చేసింది.

తారక్ లోని నటనకు పరాకాష్ట ‘టెంపర్’

తారక్ లోని బెస్ట్ యాక్టర్ ని కృష్ణ వంశీ రాఖీ సినిమాలో చూపించాడు. కాని తోడుకున్నవాళ్ళకు తోడుకున్నంత ఇచ్చేస్తాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ విషయాన్ని గుర్తించే నిర్మాత బండ్ల గణేష్ ఎన్టీఆర్, పూరి కాంబినేషన్ లో టెంపర్ సెట్ చేసుకున్నాడు. ఎన్టీఆర్ మాట కాదనలేకో,వక్కంతం వంశీ నేరేషన్ లో గొప్పదనం కనిపించో మొదటి సారి తన కెరీర్ లో బయటి కథను ఒప్పుకున్నాడు పూరి. వక్కంతం వంశీ ఇచ్చిన దాని కన్నా గొప్పగా తీసి చూపించాడు. కరప్టెడ్ పోలీస్ గా ఉండి, ఒక్క అమ్మాయి హత్య తో పూర్తిగా మారిపోయే పాత్రలో ఎన్టీఆర్ నటనకు ఫాన్స్ మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులు కూడా హాట్స్ ఆఫ్ అన్నారు. వరస పరాజయలతో సతమతమవుతున్న తారక్ కు బౌన్స్ బ్యాక్ రూపం లో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు పూరి. అప్పుడెప్పుడో మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి నవలను ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టు జ్యోతిలక్ష్మి పేరుతో తీస్తే క్రిటిక్స్ మాత్రమే మెచ్చుకున్నారు. కంటెంట్ బాగున్నా టైమింగ్ తేడా కొట్టడంతో వరుణ్ తేజ్ తో తీసిన లోఫర్ మరో లెసన్ నేర్పింది. నందమూరి బాలకృష్ణ లాంటి కమర్షియల్ మాస్ హీరోతో మొదటిసారి వచ్చిన పైసా వసూల్ అవకాశాన్ని ఏ కారణంగానో పూర్తిగా సద్వినియోగపరుచుకోలేకపోయాడు పూరి. అందులో బాలయ్య మ్యానరిజం, కొత్తగా చూపించిన విధానం అభిమానులకు నచ్చినప్పటికీ అంతిమంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఇదీ నేర్చుకోవడానికి మరో పాఠం అంతే.

ఘాటైన ఇస్మార్ట్ సక్సెస్

పూరి ఇక తన మార్క్ చూపించలేడా, తనకు మాత్రమే సొంతమైన హీరోని మళ్ళీ తీసుకురాడా అనే అనుమానాలు రెండు మూడు పరాజయాల తర్వాత కలగడం సహజం. కానీ పూరి ఇవన్నీ పట్టించుకునే బాపతు కాదు. కమర్షియల్ మసాలా సినిమా సూత్రాన్ని బాగా ఒంటబట్టించుకున్న అతికొద్ది దర్శకుల్లో ఒకడు. మిల్కీ బాయ్ లా క్యూట్ గా కాలేజీ స్టూడెంట్ గా ఉండే రామ్ ని ఊర మాస్ అవతారంలో ఇస్మార్ట్ శంకర్ గా చూపించిన తీరు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది.

ఈ మధ్య ఫామ్ తగ్గిపోయిన మణిశర్మతో ఇస్మార్ట్ శంకర్ కోసం ఉర్రూతలూగించే పాటలు చేయించి ఏకంగా మెగాస్టార్ ఆచార్యకు ఆఫర్ వచ్చేలా చేయడంలో పూరి పాత్ర లేదంటే అది అబద్దమే. ఇప్పుడు విజయ్ దేవరకొండతో చేస్తున్న ప్రాజెక్ట్ కావొచ్చు దాని తర్వాత ఇంకో స్టార్ తో ఏదైనా మూవీ తీయొచ్చు, వీటి జయాపజయాల్లో ఎన్ని మార్పులున్నా పూరి తీరులో అభిమానులు అతన్ని ఇష్టపడే రీతిలో మార్పు ఎప్పటిరాదు. ఎందుకంటే పూరి పేరు తెలుగు సినిమా చరిత్రలో కేవలం ఒక పేజీ కాదు. ఎందరో వర్ధమాన దర్శకులు పదే పదే తిరగేసి చదువుతున్న ఛాప్టర్.

ది కంక్లూజన్

పూరి జగన్నాధ్ దర్శకత్వం ఒక వ్యసనం లాంటిది. అందులోని కిక్ కి ఒక్కసారి అలవాటు పడిన ఏ హీరో అయినా మళ్ళి మళ్ళి చేయాలని తాపత్రయ పడేది అందుకే. హిట్ ఫ్లాప్ సంబంధం లేదు. నమ్మిన నిర్మాతను ముంచేంత ఖర్చు పూరి ఎప్పుడూ పెట్టించడు . తెరమీద హీరో అగ్రెసివ్ గా ఉన్నా తాను మాత్రం ప్రోగ్రెసివ్ గా ఉండటం పూరి స్టైల్. అందుకే పూరి సినిమా అంటే అందరికి అంత ఆసక్తి, ఇష్టం, ప్రేమ. అఫ్ ది స్క్రీన్ ఒక హీరో అనట్టు పూరి డైరెక్షన్ లో చేస్తే ఏ యాక్టింగ్ స్కూల్ అవసరం లేదు. పూరి స్పీడ్ తగ్గదు. ఫాన్స్ కు అతని పట్ల ఉన్న ప్యాషన్ తగ్గదు. ఇది ఫిక్స్. ఇవాళ ఏప్రిల్ 20 మొదటి సినిమా బద్రి విడుదలైన తేదీ. ఈ డేట్ పూరి డెబ్యూగా నిలిచినందుకు ఎంత గర్వపడుతూ ఉంటుందో అతని అభిమానుల కాలర్ లాగా. అది ఎప్పటికీ నలగదు, చెరగదు…..

Show comments