iDreamPost
iDreamPost
హీరోగా చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి లేట్ గా అయినా స్వయంకృషితో తన సత్తా చాటుకుని ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న హీరోల్లో రవితేజకున్న ఫాలోయింగ్ వేరు. వయసును లెక్కచేయకుండా ఒకే ఎనర్జీని మైంటైన్ చేస్తూ హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా తన మాస్ రాజా ట్యాగ్ ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వస్తున్నరవితేజ కెరీర్ లో ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ గా నిలిచిన భద్ర సరిగ్గా ఇవాళ్టితో 15 ఏళ్ళు పూర్తి చేసుకుంది. 2005లో విడుదలైన భద్ర ఆ ఏడాది టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది.
ఇది బోయపాటి శీను మొదటి సినిమా. డెబ్యూతోనే ఇంత పెద్ద కమర్షియల్ సక్సెస్ అందుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒకరకంగా చెప్పాలంటే లవ్ స్టోరీస్ రాజ్యమేలుతున్న ట్రెండ్ లో బోయపాటి ఇంత మాస్ సినిమాను తీయడం పట్ల ముందు కామెంట్లు వినపడినా ఫలితం చూశాక అవే నోళ్లు మూతబడ్డాయి. భద్ర ఒక ఫక్తు ఫ్యాక్షన్ కథ. అప్పటికే ఆ ట్రెండ్ ముగిసిపోయింది. చిరంజీవి లాంటి మెగాస్టార్ తో మొదలుకుని తారకరత్న లాంటి కొత్త హీరోల దాకా అందరూ దాన్ని పీల్చి పిప్పి చేశారు. కొత్తగా చూపడానికి ఏమి లేదు.
అందుకే బోయపాటి రెగ్యులర్ స్టైల్ లో వెళ్లకుండా ఫస్ట్ హాఫ్ మొత్తం కాలేజ్ బ్యాక్ డ్రాప్ నడిపి దానికి సమానంగా ఫ్యామిలీ ఎమోషన్స్ ని మిక్స్ చేసి సెకండ్ హాఫ్ లో చూపబోయే హింసకు ఒక రకంగా మెంటల్ ప్రిపరేషన్ చేశాడు. భద్రకు ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉందన్న సస్పెన్స్ మైంటైన్ చేస్తూనే హీరోయిన్ వెనుక తీవ్రమైన గతం ఉందనే ఉత్సుకత రేపుతూ ఇంటర్వెల్ బ్లాక్ నుంచి ట్విస్ట్ ఇచ్చి సడన్ గా టెంపో పెంచేసి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇక్కడే భద్ర కుటుంబ ప్రేక్షకులు సైతం కనెక్ట్ అవ్వడానికి దోహదపడింది.
సెకండ్ హాఫ్ లో ఊరికి పెద్ద దిక్కుగా ప్రకాష్ రాజ్ ఎపిసోడ్, అతనే రవితేజ ప్రేమించిన అమ్మాయికి అన్నయ్య కావడం, ప్రాణ స్నేహితుడు కూడా తన తమ్ముడు అవ్వడం ఇవన్నీ ఎమోషనల్ గా ఆ ట్రాక్ నడపడానికి బాగా ఉపయోగపడ్డాయి. తనకు సంబంధం లేని ఊరి విషయమైనా ఒక మంచి మనిషిని, అతనితో పాటు క్లోజ్ ఫ్రెండ్ ని చంపిన తీరుకి ఉగ్రుడైన భద్ర తన ప్రేయసిని కాపాడుకోవడంతో పాటు శత్రువుల అంతం ఎలా చూశాడనే పాయింట్ ని బోయపాటి శీను మాస్ కి విపరీతంగా నచ్చేలా పిక్చరైజేషన్ చేశాడు.
దానికి తోడు దేవిశ్రీ సంగీతం కూడా భద్ర విజయంలో కీలక పాత్ర పోషించింది. విలన్ బ్యాచ్ లో ప్రదీప్ రావత్, సుబ్బరాజు పాత్రలు హెల్ప్ అయ్యాయి. సాధారణ కథకు సైతం ట్రీట్మెంట్ తో మెప్పించిన భద్ర ఆ తర్వాత తమిళ్, కన్నడ, బెంగాలీ, బంగ్లాదేష్ బెంగాలిలో రీమేక్ కాగా హిందీ, మలయాళంలో డబ్బింగ్ చేశారు. దాదాపు అని సక్సెస్ అయ్యాయి. భద్ర ప్రాంతాలతో సంబంధం లేకుండా విజయవంతం అయ్యింది కాబట్టే రెండో సినిమాకే విక్టరీ వెంకటేష్ తో ఛాన్స్ కొట్టేశాడు బోయపాటి శీను. ఇప్పటికీ మాస్ కి రీచ్ అయ్యే కథలు చెప్పడం బి గోపాల్ తర్వాత బోయపాటికే అంత పేరుంది.