iDreamPost
iDreamPost
సాధారణంగా ప్రతి మనిషిలోనూ విభిన్నమైన భావోద్వేగాలు ఉంటాయి. వాటిని మనం బయట పెట్టుకునే తీరులోనే సమాజం ఇచ్చే గుర్తింపు ఉంటుంది. అందుకే లక్ష్యం ఒకటే అయినా గాంధీకి వచ్చినంత గుర్తింపు సుభాష్ చంద్ర బోస్ కు రాలేదు. పురాణాలలోనూ ఒక కోణంలో రాముడు మంచివాడిగా కనిపిస్తే సీతను అపహరించినా ఆమెను తాకకుండా తన ఉద్దేశాన్ని చాటిన రావణుడిలోనూ ఉత్తముడు కనిపిస్తాడు. ద్రౌపది చీరను వలువమని ఆదేశించిన సుయోధనుడే కుల వివక్షతో అవమానింపబడుతున్న కర్ణుడికి గొప్ప మిత్రుడై స్నేహానికి నిర్వచనంలా నిలిచాడు.
ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. మనుషుల ప్రవర్తన మన చుట్టూ నిర్దేశించబడిన వాతావరణాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. చిన్నప్పుడు విడిపోయిన కవలల్లో ఒకడు గొప్పవాడిగా మరొకడు వీధి రౌడీగా ఎదగడానికి వెనుక సూత్రం ఇదే అంటే కాదనగలమా. దీన్ని ఆధారంగా చేసుకుని చాలా సినిమాలే వచ్చాయి కానీ ఇప్పటి జెనరేషన్ లో ఈ పాయింట్ ని టచ్ చేసిన వాళ్ళు తక్కువ. దానికో మంచి ఉదాహరణగా నిలిచిన ప్రయత్నం గురించి చెప్పడమే ఈ ఉద్దేశం. సుప్రసిద్ధ సైకో అనలిస్ట్ సిగ్మన్డ్ ఫ్రాయిడ్ సూత్రీకరించిన ప్రిన్సిపుల్స్ ని ఆధారంగా చేసుకుని సుకుమార్ అల్లిన వెండితెర మానసిక గ్రంథం జగడం
అంత గొప్ప కథా
నిజానికి జగడం ఒక మాములు గ్యాంగ్ స్టర్ కథ. చిన్నప్పటి నుంచి తనుండే ప్రాంతంలోని దౌర్జన్యపూరిత వాతావరణంలో పెరిగిన మచ్చా శ్రీనివాస్ అలియాస్ శీను పెద్దయ్యాక ఓ పెద్ద రౌడీ కావాలని, అందరూ తనకు వంగి వంగి సలాములు కొడుతూ చెప్పుచేతల్లో ఉంచుకోవాలని గోల్ గా పెట్టుకుంటాడు. అందుకే గొడవని వినపడితే అక్కడికి వాలిపోయి తన మీద భయాన్ని కలిగించే అవకాశాల కోసం వెతుకుతూ ఉంటాడు. ఆ క్రమంలో గూండాలకు పెద్దయిన మాణిక్యం దగ్గర పనికి చేరతాడు. స్వంత దందా చేసే ప్రయత్నంలో మాణిక్యంకు ఎదురు తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ శీను ఊహించినంత అందంగా నేర ప్రపంచం ఉండదు. తాను ఎంత పెద్ద ఊబిలో కూరుకుపోయానో, తన వల్ల తమ్ముడితో సహా కుటుంబం మొత్తం ఎంత పెద్ద ప్రమాదంలో ఉందో ఆలస్యంగా తెలుసుకుంటాడు.వెళ్లడమే కానీ బయటికి వచ్చే అవకాశమే లేని సంకెళ్ళ పద్మవ్యూహం నుంచి శీను అసలు బయటికి వచ్చాడా లేదా అనేదే జగడం.
అద్దంలో కనిపించే మృగం
రోజూ నిత్య జీవితంలో తనకు ఎదురయ్యే ప్రతి అన్యాయాన్ని ఎదురుకోవాలని సగటు మనిషి అనుకుంటూనే ఉంటాడు. కానీ నిస్సహాయత ఏదీ చేయనివ్వదు. అలా చూస్తూ ఉండనిచ్చి రాజీ పడమనే హితబోధ చేస్తుంది. అందుకే ఇన్నేసి నేరాలు, ఘోరాలు, మానభంగాలు, కబ్జాలు జరుగుతున్నా పూర్తిగా కట్టడి చేయలేని దీనస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయి. ఇక్కడ ఎవడు ఎదగాలన్నా డబ్బు ఉండాలి లేదా బలం ఉండాలి. ఈ రెండూ ఉంటే అవి లేనివాడు బానిస మనస్తత్వంతో సహాయం కోసం వస్తాడు. ఆ రెండు ఉన్నవాడికి రాజకీయం ముసుగులో అధికారం తోడైతే జరిగేదే అరాచకం. జగడంలో ఎక్కడిక్కడ సుకుమార్ దీన్ని ప్రేక్షకుల మనసులో బలంగా చొప్పించే ప్రయత్నం చేస్తాడు. లీడర్ కావాలంటే క్యాడర్ కావాలి. కానీ వెన్నంటే నడిచే ఆ క్యాడర్ ఉండాలంటే ఆ సభ్యుల్లో లేని గొప్ప లక్షణాలేవో నాయకుడికి ఉండాలి. దానికి ప్రతినిధిగా మారాలన్న శీను చివరికి దుష్టశక్తులు ఆడించే పన్నాగంలో ఓడిపోయి జీవితాన్నే నాశనం చేసుకుంటాడు.
జగడంలో దర్శకుడి ఉద్దేశం చాలా స్పష్టం. ఒక యువకుడిలో నేరపూరిత మనస్తత్వం ఎలా ఎదుగుతుందో చూపించి దాని వల్ల కలిగే విపరీత పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయో వివరించి చెప్పడం. సొసైటీలో బలవంతుడెపుడూ తనదే పై చెయ్యి ఉండాలని చూస్తాడు. తన ఆధిపత్యాన్ని ఎవరు సవాల్ చేసినా భరించలేడు. ఎంతకైనా తెగిస్తాడు. అనుచరుడనే వాడు తన మోచేతి నీళ్లు తాగుతూనే ఉండాలని నమ్ముతూ వాళ్ళ ఎదుగుదలను అణువంతైనా సహించడు. అందుకే జగడంలో మాణిక్యంని శీను మొదటిసారి ఎదిరించినప్పుడు అక్కడున్నవాళ్ళందరూ సంభ్రమాశ్చర్యాలతో చూస్తే శీనులో మాత్రం ఎంతదూరమైనా వెళ్తాననే పంతం కనిపిస్తుంది. తనకంటూ ఐడెండిటీ కావాలని తపించే శీను దానికోసం ఎంతకైనా తెగిస్తాడు. అవసరమైతే హత్యలు చేసేందుకు కూడా వెనుకాడడు. కానీ రౌడీయిజం ముసుగులో తమ జీవితాలు గాలి బుడగల్లాంటివని గుర్తించే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇలా వాస్తవికత జగడంలో అడుగడుగునా తారసపడుతుంది.
మరెందుకు ఫెయిల్ అయ్యింది
అల్లు అర్జున్ కి ఒక్క దెబ్బ తో స్టార్ ఇమేజ్ కట్టబెట్టిన ఆర్య తర్వాత సుకుమార్ ఇలాంటి సబ్జెక్టు తీసుకోవడం నిజంగా ఆశ్చర్యపరిచేదే. మణిరత్నంకు నాయకుడు ఎలా అయితే ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయిందో అదే తరహాలో జగడం కూడా తనకు మెమొరబుల్ కావాలని సుకుమార్ గట్టిగానే ట్రై చేశాడు. బలమైన ఇంపాక్ట్ తో సన్నివేశాలకు తెరకెక్కించడంలో తనదైన బాణీని చాలా సార్లు చూపిస్తాడు. కానీ సినిమా ఒకే టోన్ లో సాగడం, కథ మొత్తం దాదాపుగా డార్క్ థీమ్ లో సాగడం అధిక శాతం ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. అంతేకాదు సహజత్వం కోసం తాను చెప్పాలనుకున్న మెసేజ్ డిటైల్డ్ గా రాసుకోవడం కూడా కొంతమేర దెబ్బ తీసింది. రామ్ ని ఇంత బరువైన పాత్రలో చూడటం కష్టంగా అనిపించింది. పాలుగారే మొహంతో ఇంత రఫ్ క్యారెక్టర్ చేయించడం ఒకరకంగా సాహసమే. దానికి తోడు కలర్ ఉన్నా ఆకర్షణ లేని హీరొయిన్ ఈషా సహానీ పేలవమైన యాక్టింగ్ లవ్ ట్రాక్ ని సమూలం దెబ్బ తీసింది. కథలో ఓ మలుపుకు తనే కారణమైనప్పటికీ అది రిజిస్టర్ కాకపోవడానికి కారణం తనే.
దానికి తోడు కమర్షియల్ సూత్రాలకు సుకుమార్ కొంతమేర కట్టుబడటం కూడా జగడం స్థాయిని తగ్గించేసింది. సెకండ్ హాఫ్ లో హీరో గ్యాంగ్ ప్రమాదంలో చిక్కుకున్నాక కథ పరుగులు పెట్టదు. కొంత నమ్మశక్యం కానీ తరహాలో శీను చేసే హీరోయిజం ఆర్టిఫీషియల్ గా అనిపిస్తుంది. కానీ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, రత్నవేలు ఛాయాగ్రహణం జగడంని చెరోవైపు తమ శక్తి మేర కాపాడుకునే ప్రయత్నం చేశాయి. సుకుమార్ మనసులో ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నది ఈ ఇద్దరే. ప్రతి ఫ్రేమ్ లో వీళ్ళ పనితనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. పాటలు ట్రెండ్ కు తగ్గట్టు కంపోజ్ చేసిన దేవి తన పనితనాన్ని ఎక్కువ బిజిఎంలోనే చూపించాడు. ఇంటర్వల్ ఇంటర్వల్ బ్యాంగ్ లో శీను క్యారెక్టర్ ఆ స్థాయిలో ఎలివేట్ అవ్వడానికి సుకుమార్ మేధస్సుతో పోటీ పడింది దేవి మ్యూజిక్. ఈ ఒక్క ఉదాహరణ చాలు ఈ ఇద్దరికీ ఎంత సింక్ కుదిరిందో చెప్పడానికి.
ముగింపుకు వద్దాం
అసలు ఇప్పుడీ ఫ్లాప్ సినిమా గురించి ఎందుకీ చర్చ అనుకుంటున్నారా. జగడం బాక్స్ ఆఫీస్ లెక్కల్లో ఫెయిల్యూరే కావొచ్చు. అధిక శాతం ప్రేక్షకులకు రుచించని మాటా వాస్తవం. అయితే స్టార్ హీరోలు తన వెంట పడుతున్నా రిస్క్ అవుతుందని అందరూ వారించినా ఇలాంటి వయోలెంట్ సబ్జెక్టుని ఎంచుకున్న సుకుమార్ సాహసానికి ఇవాళ్టితో 13 ఏళ్ళు పూర్తయ్యాయి. 2007 మార్చ్ 16న విడుదలైన జగడం మనిషిలో మృగ ప్రవృత్తిని ఎత్తిచూపే ప్రయత్నం బలంగా చేసింది. మనిషిలో ఉన్మాది బయటికి వస్తే ఎంతటి దారుణాలు జరుగుతాయో కళ్ళకు కట్టినట్టు చూపింది. ఇది అద్భుతమైన సినిమా అని చెప్పే ప్రయత్నం ఇక్కడ చేయలేదు. కేవలం ఒక నిజాయితి కలిగిన దర్శకుడి ప్రయత్నాన్ని మరోసారి పరచయం చేయడమే ఈ జ్ఞాపకం ఉద్దేశం.