Elections 2024 Results: UPలో బీజేపీని దెబ్బ కొట్టిన ఎర్ర టోపి.. అసలేంటి దీని కథ

సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి భారీ షాక్‌ తగిలింది. అక్కడ ఎర్ర టోపి కాన్సెప్ట్‌ కాషాయ పార్టీని గట్టి దెబ్బ కొట్టింది. ఆ వివరాలు..

సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి భారీ షాక్‌ తగిలింది. అక్కడ ఎర్ర టోపి కాన్సెప్ట్‌ కాషాయ పార్టీని గట్టి దెబ్బ కొట్టింది. ఆ వివరాలు..

రెండు నెలల క్రితం సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కాగా.. నిన్న అనగా జూన్‌ 4, మంగళవారం నాడు ఫలితాల వెల్లడితో ఆ ప్రక్రియ పూర్తయ్యింది. ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించారు. లోక్‌సభతో పాటు.. కొన్ని రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. అయితే ఈసారి ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్‌ పోల్స్‌ దారుణంగా తారుమారయ్యాయి. ఇక ఈసారి కచ్చితంగా 400 సీట్లలో విజయం సాధించాలని భావించిన ఎన్‌డీఏ కూటమి.. ఊహించని రీతిలో 290 పైచిలుకు స్థానాలకే పరిమితం అయ్యింది.

ఇక గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో కుదేలవుతూ వస్తోన్న ఇండియా కూటమి.. ఈసారి బాగానే ప్రభావం చూపింది. ఎన్‌డీఏ కూటమికి గట్టి పోటీ ఇస్తూ.. ఏకంగా 230 పైచిలుకు స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఎన్‌డీఏ కూటమి, బీజేపీకి కీలకంగా ఉండే ఉత్తరప్రదేశ్‌లో ఈసారి అనూహ్య ఫలితాలు వచ్చాయి. యూపీలో బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది. ఎర్ర టోపీ వల్లే యూపీలో కాషాయ పార్టీకి ఈ పరిస్థితి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇంతకు ఈ ఎర్ర టోపి కథేంటి..

గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈసారి ఆ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. 2019 ఎన్నికల్లో ఇక్కడ సొంతంగా 62 సీట్లు గెలిచిన బీజేపీ.. ఈసారి 34 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇక ఇక్కడ చతికిల పడింది అని భావిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ బీజేపీకి ఊహించని షాక్‌ ఇచ్చింది. ఆ పార్ట అధినేత, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ నేతృత్వంలో ఇండియా కూటమి.. యూపీలో బీజేపీని గట్టి దెబ్బకొట్టింది. మరీ ముఖ్యంగా బీజేపీని నిలువరించడంలో ఎర్ర టోపీలు బలంగా పనిచేశాయి.

ఎర్ర టోపి కథేంటి

అఖిలేశ్ యాదవ్‌ ఎస్పీ పగ్గాలను చేపట్టినప్పటి నుంచి యూపీలో ఎర్ర టోపీ రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన ఎస్పీ.. ఈ సారి మాత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ బలం ఈసారి 37 సీట్లకు పెరిగింది. నోటిఫికేషన్ విడుదలకు ముందే అఖిలేశ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మొత్తం 80 స్థానాల్లో కాంగ్రెస్‌కు 18 సీట్లు, టీఎంసీకి ఒక స్థానాన్ని కేటాయించి, మిగిలిన 61 చోట్ల ఎస్పీ అభ్యర్థులను బరిలోకి దింపారు. తన తండ్రి ములాయం సింగ్‌ యాదవ్‌ మరణం తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో.. అఖిలేషఖ ప్రతిపక్షాల ప్రచారాన్ని ముందుండి నడిపించారు. అంతేకాక ఎన్నికల ప్రచారంలో అఖిలేష్‌ ఎర్ర టోపితోనే కనిపించేవాడు. ఇప్పుడు ఆ ఎర్ర టోపినే మోదీకి గట్టి షాకిచ్చింది.

బీజేపీని వ్యతిరేకించే వామపక్షాల సాంఘీక, సామాజిక న్యాయం సిద్ధాంతాలను తాము ఆచరిస్తున్నామని చెప్పేందుకు అఖిలేశ్ సమాజ్‌వాద్‌ పార్టీలోకి ఎర్ర టోపీ ధరించే విధానాన్ని తెచ్చాడు. 2017 నుంచి ఎర్ర టోపీని కచ్చితంగా ధరిస్తున్న ఆయన.. ఎస్పీలోని అన్ని స్థాయిల నాయకులు, కార్యకర్తలు కూడా ఎర్ర టోపి ధరించాలని ఆదేశాలు జారీ చేయడమే కాక.. కచ్చితంగా అమలు చేస్తున్నారు. ప్రతి ఎస్పీ కార్యకర్త ఎర్ర టోపీ పెట్టుకునేలా ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించారు. ఇక ఈఎన్నికల ప్రచారంలోనూ ఎర్రటోపీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల సభల్లోనూ ఎర్రటోపీలు ధరించి పెద్ద సంఖ్యలో ఎస్పీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక తాజాగా ఇవే ఎర్ర టోపీలు బీజేపీకి గట్టి షాక్‌ ఇచ్చారు.

Show comments