ఖాకీ డ్రెస్ లో కనిపిస్తే కరిచేలా శునకాలకు ట్రైనింగ్.. తృటిలో తప్పించుకున్న పోలీసులు

సాధారణంగా నేరాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించేందుకు పోలీస్ డిపార్ట్ మెంట్ వారు శునకాలను రంగంలోకి దించుతారు. ఆ శునకాలకు తగిన తర్ఫీదునిచ్చి దొంగలను, నేరగాళ్ళను గుర్తించేలా శునకాలను ట్రైన్ చేస్తారు. కానీ ఓ రాష్ట్రంలో జరిగిన సంఘటన దీనికి విరుద్దంగా ఉంది. ఏకంగా పోలీసులపైనే దాడి చేసి కరిచేలా ట్రైనింగ్ ఇచ్చాడు ఓ ఘనుడు. డ్రగ్స్ సప్లైయర్ గా అనుమానిస్తున్న ఆ వ్యక్తి ఈ చర్యకు పాల్పడ్డాడని పోలీస్ అధికారులు తెలిపారు. దీంతో నిందితుడి ఇంట్లో సోదాలు చేసేందుకు వెళ్లిన పోలీసులకు ఊహించని షాక్ తగిలింది. ఖాకీ డ్రెస్ లో ఉన్న పోలీసులను చూడగానే ఆ కుక్కలు వారిపై విరుచుకుపడబోగా సమయస్ఫూర్తితో తప్పించుకున్నారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కేరళలోని కొట్టాయంకు చెందిన ఓ వ్యక్తి డ్రగ్స్ వ్యాపారిగా మారి పోలీసుల కంటపడకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఒకవేళ పోలీసులు తన ఇంటిపై దాడి చేస్తే పోలీస్ దుస్తుల్లో ఉన్న వారిని కరిచేలా కుక్కలకు ట్రైనింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలో ఆ నిందితుడి ఇంట్లో సోదాలు జరిపేందుకు యాంటీ నార్కోటిక్ స్క్వాడ్, స్థానిక పోలీసులు కలిసి ఆదివారం రాత్రి సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో అతడి ఇంట్లో ఉన్న సుమారు 13 కుక్కలు పోలీసులపైకి దూసుకు వచ్చాయి. ఆ కుక్కల నుంచి పోలీసు వారు తృటిలో తప్పించుకున్నారు. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు.

ఈ హఠాత్పరిణామం అనంతరం తేరుకున్న పోలీసులు ఆ కుక్కలను బందించి, ఆ వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించి 17 కేజీల గంజాయిని సీజ్ చేశారు. ఈ విషయంపై కొట్టాయం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. ఆ వ్యక్తి ఇంట్లో అన్ని కుక్కలు ఉంటాయని తాము ఊహించలేదని, ఖాకీ డ్రెస్ లో ఉన్న వారిని కరిచి గాయపరిచేలా ట్రైనింగ్ ఇచ్చినట్లు వెల్లడించారు.ఈ వ్యవహారంలో రిటైర్డ్‌ బీఎస్‌ఎఫ్‌ అధికారి ద్వారా డాగ్‌ ట్రైనింగ్‌లో ఆ వ్యక్తి శిక్షణ పొందినట్లు తెలిపారు. కాగా పరారైన ఆ వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Show comments