iDreamPost
android-app
ios-app

సనాతన ధర్మంపై BRS ఎంపీ సంచలన వ్యాఖ్యలు!

సనాతన ధర్మంపై BRS ఎంపీ సంచలన వ్యాఖ్యలు!

ఇటీవల కాలంలో సనాతన ధర్మంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్నే రేపుతున్నవిషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉదయనిధి మరోసారి స్పందిస్తూ.. నేను లేనిది ఏం మాట్లాడలేదని, నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేదే లేదని చెప్పారు. కాగా, ఈ నేపథ్యంలోనే సనాతన ధర్మంపై దేశ ప్రధాని సైతం స్పందించగా తాజాగా సనాతన ధర్మంపై బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు స్పందించారు.

సనాతనం పేరుతో దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. సనాతనం ఆచరించే అందరూ ఏకమవ్వాలని ప్రధాని అన్నారని.. అంటే.. సనాతన ధర్మం ఆచరించని వారిపై యుద్ధం ప్రకటిస్తున్నారా అంటూ ఆయన ప్రశ్నించారు. ఇప్పటి వరకు దేశంలోని ప్రజలను హిందు, ముస్లిం పేర్లతో విభజించారని, ఇప్పుడు సనాతనీ, నన్ సనాతనీ పేరుతో విభజన చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు.  పురుషసూక్తంలో వర్ణ వ్యవస్థ గురించి ఉందని, ఇది సమాజంలో అసమానతలను సూచిస్తుందని ఆయన తెలిపారు. నేను ఈ అంశంపై గతంలో పీహెచ్ డీ కూడా చేశానని, అవసరమైతే ఎంత లోతుగా అయినా సరే మాట్లాడతానని BRSఎంపీ కే. కేశవరావు తెలిపారు. అఖిలపక్ష సమావేశం అనంతరం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు.