Venkateswarlu
Venkateswarlu
ప్రముఖ వ్యాపార సంస్థ టాటా గ్రూపు భారత విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను టేక్ ఓవర్ చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొన్ని నెలల నుంచి ఎయిర్ ఇండియా టాటా గ్రూపు ఆధీనంలోనే నడుస్తోంది. టేక్ ఓవర్ చేసుకున్న నాటినుంచి బ్రాండ్ రీ డిజైన్‌లో భాగంగా టాటా గ్రూపు ఎయిర్ ఇండియాలో తన మార్కు మార్పులకు శ్రీకారం చుడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎయిర్ ఇండియా లోగోలో మార్పులు చేసింది. కొత్త లోగోను తాజాగా తెరపైకి తెచ్చింది. గురువారం జరిగిన కార్యక్రమంలో టాటా గ్రూపు సభ్యులు ఎయిర్ ఇండియా కొత్త లోగోను ఆవిష్కరించారు.
ఎరుపు, బంగారం, నీలం రంగుల్లో ఉన్న ఆ లోగోకు ‘ది విస్టా’అని పేరు పెట్టారు. ‘విండో ఆఫ్ పాజిబిలీటీస్’కు ప్రతీకగా ఈ లోగోను సృష్టించినట్లు సంస్థ పేర్కొంది. పాత లోగోలో ఆరెంజ్ రంగు ఈకలు కలిగిన ఎర్ర హంస ఉండేది. ఇక, ఎయిర్ ఇండియాలో చోటుచేసుకుంటున్న కొత్త మార్పులపై టాటా సంస్థ సీఈవో కాంప్‌బెల్ విల్సన్ మాట్లాడుతూ.. ‘‘ ఎయిర్ ఇండియాను ప్రపంచ స్థాయి విమానయాన సంస్థగా తీర్చిదిద్దటమే మా లక్ష్యం. సేవలో భారత దేశ ఆతిధ్యానికి ప్రపంచ స్థాయిలో ఓ మార్కు తెచ్చేలా కొత్త ఎయిర్ ఇండియా చరిత్ర, సంప్రదాయాలతో వేళ్లూనుకుపోయింది’’ అని పేర్కొన్నారు.
అయితే, ఈ కొత్త ఎయిర్ ఇండియా లోగో మార్పు డిసెంబర్ 2023నుంచి ప్రయాణికులకు కనిపించనుంది. కాగా, టాటా గ్రూపు దాదాపు 18000 కోట్ల రూపాయలకు గత ఏడాది అక్టోబర్ నెలలో ఎయిర్ ఇండియాను టేక్ ఓవర్ చేసింది. ఎయిర్ ఇండియాతో పాటు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్ ఇండియా సాట్స్ ఎయిర్‌పోర్ట్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లను టాటా సంస్థ ఆధీనంలోనే ఉన్నాయి. మరి, టాటా సంస్థ బ్రాండ్ రీ డిజైన్‌లో భాగంగా లోగోను మార్చటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.