ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమార్తె పోలీసులను ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత ఉమెన్ చాందీ చిన్న కుమార్తె అచ్చు ఉమెన్ పోలీసులను ఆశ్రయించారు. తన మీద సైబర్ దాడులు జరుగుతున్నాయంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. తిరువనంతపురానికి చెందిన ఒక వ్యక్తి తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా ఫేస్బుక్ అకౌంట్లో పోస్టులు పెడుతున్నాడని కంప్లయింట్లో పేర్కొన్నారు. తన ప్రతిష్టను దిగజార్చడంతో పాటు తండ్రిని, తనను అవినీతిపరులుగా చిత్రీకరిస్తున్నాడని అచ్చు ఉమెన్ ఫిర్యాదు చేశారు.
ఆ వ్యక్తి కావాలనే తప్పుడు సమాచారాన్ని, అవాస్తవాలను వ్యాప్తి చేస్తున్నాడని కంప్లయింట్లో పేర్కొన్నారు అచ్చు ఉమెన్. కొన్ని సంవత్సరాల నుంచి తాను ఫ్యాషన్, ట్రావెల్ సెక్టార్లో కంటెంట్ క్రియేటర్‌గా పనిచేస్తున్నానని ఆమె తెలిపారు. అయితే తన జాబ్‌లో భాగంగా తీసిన ఫొటోగ్రాఫ్‌లను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో పోస్టు చేస్తూ స్వార్థం ప్రయోజనాల కోసం, తన తండ్రి ప్రతిష్టను దిగజార్చే ఉద్దేశంతో దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని అచ్చు ఉమెన్ వాపోయారు. ఉమెన్ చాందీ రీసెంట్గా మరణించడంతో సెప్టెంబర్ 5న పూతుప్పల్లి నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది.
ఉప ఎన్నిక నేపథ్యంలో తమపై జరుగుతోన్న దుష్ప్రచారాన్ని అచ్చు ఉమెన్ ఖండించారు. రాష్ట్రంలో ద్రవ్యోల్బణం, అవినీతి లాంటి సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఇలాంటి దాడులు చేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు. అచ్చు ఫిర్యాదు ఆధారంగా నిందితుడి మీద పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. మరోవైపు ఉప ఎన్నిక సమీపిస్తుండటంతో అక్కడ ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఈ ఎలక్షన్స్‌లో అచ్చు ఉమెన్ సోదరుడు చాందీ ఉమెన్ కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.