వరదలతో ఢిల్లీ ప్రజలు అల్లాడుతున్నారు. వర్షాలు తగ్గినా కూడా.. యమునా నది ఇంకా ప్రమాదకర స్థాయిలోనే ప్రవహిస్తోంది. ఇప్పటికీ ఢిల్లీలో చాలా ప్రాంతాలు నదులను తలపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా- మంచినీటి సరఫరా పునరుద్ధరణ కాలేదు. లోతట్టు ప్రాంతాలు, వరదనీరు చిక్కుకున్న ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలాగే మూగజీవాలను కూడా ప్రత్యేకంగా రెస్క్యూ చేస్తున్నారు. ఇలాంటి సహాయ చర్యల్లో ఒక ఇల్లీగల్ దందా వెలుగు చూసింది.
ఢిల్లీ, నోయిడా ప్రాంతాల్లో సహాయక చర్యలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, పోలీసులు సహాయకచర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు. పోలీసు ఉన్నాతాధికారులు కూడా ఈ సహాయక చర్యల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. బోట్లు వేసుకుని వరద ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నారు. అలా వరద నీటిలో బాగా లోపలికి వెళ్లగా వారికి కొంత మంది కూలీలు కనిపించారు. అది కూడా పదీ, ఇరవై కాదు దాదాపుగా 500 మంది కూలీలు ఉన్నారు. అయితే వాళ్లు అక్కడ ఏం చేస్తున్నారు అని ఆరా తీయగా ఒక ఇల్లీగల్ దందా వెలుగు చూసింది.
యమునా నదివైపు సెక్టర్ 135 పరిధిలోని నాగ్లీ వాజిద్ పూర్ గ్రామం దగ్గర అక్రమంగా కట్టడాలు జరుగుతున్నాయి. నిబంధనలకు వ్యతిరేకంగా, ఎలాంటి అనుమతులు లేకుండా వందల్లో ఫామ్ హౌస్లు నిర్మిస్తున్నారు. ఆ ప్రాంతంలో నిజానికి వేల సంఖ్యలో కూలీలు ఉంటారని చెబుతున్నారు. చాలా మంది ముందే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోగా కొందరు మాత్రం అక్కడే ఉండిపోయారు. వారితో కొంత ఆహారాన్ని తెచ్చుకుని ఉన్నారు. సెల్లార్ లెవల్లోకి నీరు చేరగా.. రెండో ఫ్లోర్లో ఉంటున్నారు. వీరి జాడను గమనించిన పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
వారిని గురువారం, శుక్రవారం కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే ఇలాంటి ఇల్లీగల్ ఫామ్ హౌస్ లు ఆ ప్రాంతంలో కొత్తేం కాదు అంటున్నారు. ఇప్పటికే అధికారులు 250 వరకు అక్రమ ఫామ్ హౌస్లను కూల్చివేసినట్లు తెలిపారు. ఇంకా 500 నుంచి 600 వరకు అనుమతుల్లేని ఫామ్ హౌస్లు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. వచ్చే రోజుల్లో వాటిని కూడా నేలమట్టం చేస్తామని వ్యాఖ్యానించారు. వారిలో చాలా మంది కూల్చివేతపై స్టే కోసం కోర్టుకు వెళ్లినట్లు తెలిపారు. వాటిపై కూడా తప్పకుండా చర్యలు ఉంటాయన్నారు. అధికారులు 10 రోజుల ముందే వర్షాలు, వరదల నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేశారు. చాలా మంది వెళ్లిపోగా.. కొందరు మాత్రం అక్కడే ఉండిపోయారు.