iDreamPost
iDreamPost
సినిమా తీయడం ఒక ఎత్తు అయితే వాటిని థియేటర్ దాకా తీసుకురావడం అంతకన్నా పెద్ద సవాల్. ముఖ్యంగా కరోనా వచ్చి వెళ్ళిపోయి ఓటిటి విప్లవం మొదలయ్యాక ఇండస్ట్రీలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీని వల్ల చిన్నా పెద్ద తేడా లేకుండా పలు సినిమాలు ల్యాబు నుంచి బయటికి రావడానికి నానా తంటాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఈ మూడు మాత్రం అభిమానులు కోరుకుంటున్నా విడుదలకు నోచుకోవడం లేదు. మొదటిది విరాట పర్వం. రానా సాయిపల్లవి కాంబినేషన్ లో వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన ఈ నక్సలైట్ డ్రామా ఎప్పుడో పూర్తయిందన్నారు కానీ ఎప్పుడు వదులుతారో తెలియదు.
నిర్మాత సురేష్ బాబు, హీరో రానా ఇద్దరూ మౌనం వహిస్తున్నారు. నెలలు గడిచిపోతున్నా కనీసం ఓటిటికి ఇచ్చే సూచనలు కనిపించడం లేదు. అలాగే మగ్గిపోయేలా చేస్తారో లేదో వాళ్ళకే తెలియాలి. రెండోది కృష్ణవంశీ తీస్తున్న రంగమార్తాండ. ప్రకాష్ రాజ్ టైటిల్ పాత్రలో రమ్యకృష్ణ బ్రహ్మానందం అనసూయ లాంటి క్యాస్టింగ్ తో రూపొందిన ఈ ఎమోషనల్ డ్రామా మరాఠి సూపర్ హిట్ నటసామ్రాట్ కు రీమేక్. రెండేళ్లకు పైగానే నిర్మాణంలో ఉన్న ఈ బడ్జెట్ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేవు. అప్పుడప్పుడు స్పాట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వదలడం మినహా ఏమి చేయడం లేదు. డిజిటల్ దాఖలాలూ లేవు
మూడోది శర్వానంద్ ఒకే ఒక జీవితం. టీజర్ ఎప్పుడు వచ్చిందో గుర్తు చేసుకోవడం కష్టం. అంత గ్యాప్ వచ్చేసింది. కట్ చేస్తే శర్వా వరుస డిజాస్టర్లు తన మార్కెట్ మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆడవాళ్ళూ మీకు జోహార్లు కూడా నిరాశపరచడంతో కథ మళ్ళీ మొదటికే వచ్చింది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రానికి శ్రీకార్తీక్ దర్శకత్వం వహించారు. అక్కినేని అమల ఓ కీలకమైన క్యారెక్టర్ చేశారు. పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ హీరోయిన్. అన్నీ సవ్యంగా ఉన్నా దీనికీ మోక్షం దక్కడం లేదు. చెప్పుకోదగ్గ మంచి కంటెంట్, క్రేజీ క్యాస్టింగ్ ఉన్నప్పటికీ ఇవన్నీ ఇలా ఇంతేసి కాలం ఆగిపోవడం విచిత్రమే.