టాలీవుడ్ లో అత్యద్భుతమైన ప్రతిభావంతులైన నటులలో తనికెళ్ళ భరణి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, కవిగా.. ఆయన ఎనలేని గుర్తింపు సంపాదించుకున్నారు. ఇదివరకు ఏ సినిమాలో చూసినా ఏదొక పాత్రలో కనిపించే భరణి.. ఈ మధ్య అసలు కనిపించడం లేదు. అంటే మొత్తానికి కాదు.. ఎప్పుడో ఓ సినిమా అన్నట్లుగా చేస్తున్నారు. దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆయన.. ఎన్నో విభిన్నమైన పాత్రలు చేశారు. అందుకే.. మళ్ళీ మళ్ళీ అవే పాత్రలు చేయకూడదని నిర్ణయించుకొని.. కొత్త తరహా పాత్రలైతే చేయడానికి సిద్ధమే అంటున్నారు. తండ్రి, మామ, బాబాయ్ ఇలా కాకుండా కథలో ఇంపాక్ట్ ఉండే క్యారెక్టర్స్ అయితే బెటర్ అని చూస్తున్నారట.
అదేంటి వచ్చిన అవకాశాలు చేజిక్కించుకొని సినిమాలు చేసేయొచ్చు కదా అని అనిపించవచ్చు. కానీ.. ఒకే ఏడాదిలో పాత్రలన్నీ మూసధోరణిలో ఉన్నాయని.. ఏకంగా పద్దెనిమిది సినిమాలు వదులుకున్నాడంటే నమ్ముతారా! కానీ అదే చేశారట. ప్రస్తుతం ఆయన నటించిన పెదకాపు సినిమా రిలీజ్ అవుతోంది. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన పెదకాపు మూవీ.. సెప్టెంబర్ 29న థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. ఇటీవల పెదకాపు ట్రైలర్ రిలీజ్ కాగా.. అందులో ఆయన తనికెళ్ళ భరణి పాత్ర చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. అయితే.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. తన కెరీర్ గురించి, ప్రస్తుతం సినిమాల గురించి కీలకమైన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది.
ఆయన మాట్లాడుతూ.. ‘ఎప్పుడూ ఒకే రకం పాత్రలు కాకుండా కామెడీ, విలనిజం ఇలా డిఫరెంట్ రోల్స్ ఇవ్వచ్చుగా అని దర్శకులను అడుగుతుంటాను. గత రెండేళ్లలో నేను చేసిన బెస్ట్ రోల్స్ లో ఒకటి పెదకాపులో చేశాను. నా నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో చేసేయాలని అనుకున్న మిథునం మూవీ చేశాను. దర్శకుడిగా సినిమా చేసి పదేళ్లు అయ్యింది. కథలు లేక కాదు.. కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడుకున్న సినిమాలు చేయలేక. నాలాంటి వాళ్లకు ఓటిటి వారు తలుపులు మూసేశారు. హింస, అసభ్యత కనిపించాలని కోరుకుంటున్నారు. వాళ్లకు కావాల్సిన విధంగా అలాంటి కంటెంట్ తో సినిమాలు చేయాలని కోరుతుంటారు.” అని భరణి మాట్లాడినట్లు సమాచారం. మరి తనికెళ్ళ భరణి మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.