మహిళా బిల్లుపై స్పందించిన నటి తమన్నా.. ఏమన్నదంటే?

దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసిన మహిళా రిజర్వేషన్ బిల్లుపైనే చర్చ. కేంద్ర ప్రభుత్వం మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ‘నారీ శక్తి వందన్‌ అధినియం’ బిల్లు-2023 ను తీసుకొచ్చింది. కాగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ ఈ నెల 19న మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ అనంతరం 454 మంది పార్లమెంట్ సభ్యులు అనుకూలంగా ఓటు వేయడంతో ఈ బిల్లు ఆమోదం పొందింది. ఇక ఈ బిల్లుపై రాజకీయ, సినీ ప్రముఖులు తమ స్పందనను తెలియజేస్తున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ తమన్నా మహిళా రిజర్వేషన్ బిల్లుపై స్పందించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

హుషారైన డ్యాన్స్, మెస్పరైజింగ్ యాక్టింగ్ తో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది తమన్నా. ఇటీవల వచ్చిన లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ లో రొమాన్స్ సీన్లలో రెచ్చిపోయి ఊపిరాడకుండా చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రీసెంట్ బ్లాక్ బస్టర్ సినిమా జైలర్ లో అదరగొట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇందులో తమన్నా చేసిన కావాలయ్యా పాటకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే హీరోయిన్ తమన్నా తాజాగా నూతన పార్లమెంట్ భవనాన్ని సందర్శించింది. ఇది వరకే కంగనా రనౌత్ వంటి స్టార్ హీరోయిన్స్ కొత్త పార్లమెంట్ భవనాన్ని సందర్శించి మహిళా రిజర్వేషన్ బిల్లుపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇప్పుడు తమన్నా కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

తమన్నా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుతో మహిళా లోకానికి పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరనుందని తెలిపింది. మహిళలు రాజకీయంగా ఎదగడానికి తోడ్పడుతుందని చెప్పింది. సామాన్య మహిళలు సైతం చట్ట సభల్లోకి వచ్చేందుకు వీలు ఏర్పడుతోందని వెల్లడించింది. కాగా లోక్ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు ఎగువ సభలో ప్రవేశపెట్టనున్నారు. ఉభయ సభల ఆమోదం తర్వాత రాష్ట్రపతి ముద్రతో బిల్లు చట్ట రూపం దాల్చుతుంది. అయితే నియోజకవర్గాల పునర్విభజన పూర్తైన తర్వాతే ఈ బిల్లు అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే.

Show comments