iDreamPost
android-app
ios-app

Free Internet: కేంద్రం కీలక నిర్ణయం.. అలా జరిగితే.. ఇకపై అందరికీ ఫ్రీగా ఇంటర్నెట్‌..?

  • Published Jul 22, 2024 | 3:14 PMUpdated Jul 22, 2024 | 3:14 PM

Central Govt-Private Members Bill On Free Internet: దేశ ప్రజలందరు ఉచితంగా ఇంటర్నెట్‌ పొందే అవకాశం ఉందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. అసలేం జరిగిందంటే..

Central Govt-Private Members Bill On Free Internet: దేశ ప్రజలందరు ఉచితంగా ఇంటర్నెట్‌ పొందే అవకాశం ఉందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. అసలేం జరిగిందంటే..

  • Published Jul 22, 2024 | 3:14 PMUpdated Jul 22, 2024 | 3:14 PM
Free Internet: కేంద్రం కీలక నిర్ణయం.. అలా జరిగితే.. ఇకపై అందరికీ ఫ్రీగా ఇంటర్నెట్‌..?

నేటి కాలంలో తిండి, నీరు, బట్ట ఎలా నిత్యవసరం అయ్యాయో.. ఇంటర్నెట్‌ డేటా కూడా అదే విధంగా మారింది. ఈరోజుల్లో రోడ్డు పక్కన ఉండే వారి దగ్గర సైతం స్మార్ట్‌ఫోన్‌, దానిలో ఇంటర్నెట్‌ డేటా ఉంటుంది. ఇక తాజాగా టెలికాం కంపెనీలు అన్ని రీఛార్జ్‌ ప్లాన్స్‌ ధరలను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. దీనిపై కస్టమర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రేట్లను పెంచడంతో.. చాలా మంది ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారుతున్నారు. ఇదిలా ఉంటే.. త్వరలోనే దేశ ప్రజలందరికి ఉచితంగా ఇంటర్నెట్‌ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుందా అంటే.. అవుననే సమాధానమే వినిపిస్తోంది. దీనికి సంబంధించి కీలక అప్డేట్‌ వచ్చేసింది. ఆ వివరాలు..

దేశ ప్రజలందరికి సమానంగా, ఉచితంగా ఇంటర్నెట్‌ సౌకర్యం హక్కును కల్పించడానికి గాను.. ఉచిత ఇంటర్నెట్‌ బిల్లును తెర మీదకు తీసుకువచ్చారు. కాకపోతే ఇది ప్రైవేటు బిల్లు. అయితే దీన్ని పరిశీలించేందుకు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇక ఈ బిల్లు చట్టంగా మారితే.. దేశంలోని అన్ని ప్రాంతాలకు ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం మారుమూల ప్రాంతాల్లో సైతం టవర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంతేకాక మారుమూల ప్రాంతాల ప్రజలు ఇంటర్నెట్‌ కనెక్షన్‌ కోరితే.. అందుకు అంగీకరించాల్సి రావడమే కాక.. ఈ వెసులుబాటు పొందేందుకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదు. కాకపోతే నెట్‌ వాడుకున్నందుకు మాత్రం డబ్బు చెల్లించాల్సి వస్తుంది. ఈ బిల్లు పూర్తి వివరాలు మీ కోసం..

అందరికి ఉచితంగా ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించే ఈ బిల్లును.. గతేడాది అనగా 2023, డిసెంబర్‌లో సీపీఎం సభ్యుడు వి శివదాసన్‌ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును పరిశీలించాలని రాష్ట్రపతి ప్రతిపాదించినట్లు రాజ్యసభ ప్రధాన కార్యదర్శికి టెలికం మంత్రి జ్యోతిరాదిత్య సింథియా చెప్పారని రాజ్యసభ జారీ చేసిన తా.ఆ బులిటెన్ తెలిపింది. ఆర్థిక అంశాలకు సంబంధించి ప్రైవేట్ సభ్యులు ప్రవేశ పెట్టే బిల్లులను సభ పరిశీలించాలంటే, అందుకు ముందుగా రాష్ట్రపతి అనుమతి అవసరం. అందుకే ఈ బిల్లును పరిశీలించాలని రాష్ట్రపతి ప్రతిపాదించారు. ఈ బిల్లు ఆమోదం పొందితే.. దేశంలోని ప్రజలందరికి ఉచితంగా ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించాల్సి వస్తుంది.

ఈ బిల్లు చట్టం అయితే, దేశంలోని ప్రజలందరికీ ఇంటర్నెట్ సదుపాయం లభిస్తుంది. అప్పుడు అడవులు, కొండలు, మారుమూల ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు సైతం నెట్ కనెక్షన్ పొందగలరు. మరీ ముఖ్యంగా నెట్ కనెక్షన్ ఇవ్వకుండా ఎగ్గొట్టే అవకాశం.. సర్వీస్ ప్రొవైడర్లకు ఉండదు. అంతేకాక నగరాలు, పట్టణాల్లో ఉండే వారికి ఎలా అయితే తక్కువ ధరకే ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పిస్తున్నారో.. అలాగే మారుమూల ప్రాంతాల వారికీ కూడా అవే ధరలకు ఇవ్వాల్సి ఉంటుంది. అందరికీ ఫ్రీ ఇంటర్నెట్‌ అమలుకోసం కేంద్రం అవసరమైతే, రాష్ట్రాలకు గ్రాంట్ ఇవ్వాలని బిల్లులో ప్రతిపాదన ఉంది.

రాజ్యాంగంలో భావ వ్యక్తీకరణ స్వేచ్చ హక్కు ఉందని.. దానిలో భాగంగానే దేశ ప్రజలందరికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని బిల్లు చెబుతుంది. ఐతే.. రకరకాల కారణాలు చెప్పి, టెలికం సర్వీస్ ప్రొవైడర్లు మారుమూల ప్రాంతాల వారికి నెట్ కనెక్షన్ ఇవ్వట్లేదు, టవర్లు వెయ్యట్లేదు. అందుకే కొత్తగా బిల్లు తెచ్చి, సమానత్వం తేవాలనే వాదన ఎప్పటి నుంచో ఉంది. కేంద్రం ఈ బిల్లును పరిశీలించేందుకు ఒప్పుకుంది కాబట్టి, పరిశీలించాక, తేవాలో వద్దో త్వరలో నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ కేంద్రం ఆమోదం తెలిపితే అందరికి ఉచితంగా ఇంటర్నెట్‌ యాక్సెస్‌ సౌకర్యం లభిస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి