iDreamPost
android-app
ios-app

షకీల అంటే అదొక్కటే కాదు! మనకి తెలియని మరో కోణం ఉంది!

షకీల అంటే మనకు టక్కున గుర్తుకు వచ్చేది శృంగార సినిమాలు. అయితే, ఆమె జీవితంలో చాలా విషాదం దాగి ఉంది. షకీల ఎన్ని కష్టాలు పడ్డా.. తన మంచి మనసును మాత్రం మార్చుకోలేదు...

షకీల అంటే మనకు టక్కున గుర్తుకు వచ్చేది శృంగార సినిమాలు. అయితే, ఆమె జీవితంలో చాలా విషాదం దాగి ఉంది. షకీల ఎన్ని కష్టాలు పడ్డా.. తన మంచి మనసును మాత్రం మార్చుకోలేదు...

షకీల అంటే అదొక్కటే కాదు! మనకి తెలియని మరో కోణం ఉంది!

షకీల.. ఇప్పటి జనరేషన్‌ వారికి ఈమె గురించి పెద్దగా తెలియకపోచ్చు. కానీ, 1990లలో ఈమె తెలియని సినీ ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. తన శృంగార సినిమాలతో అప్పటి జనాన్ని పిచ్చివాళ్లను చేశారు. స్టార్‌ హీరోలకు మించిన స్టార్‌డమ్‌ను అనుభవించారు. అప్పట్లో షకీల సినిమా టిక్కెట్ల కోసం మగాళ్లు కొట్టుకునేవారంటే క్రేజ్‌ ఏవిధంగా ఉండేదో చెప్పొచ్చు. ఏ సినిమా రిలీజైనా హౌస్‌ ఫుల్‌ బోర్డులు పడేవి. షకీల బయటకు వస్తే.. ఆమెను చూడ్డానికి జనం తండోపతండాలుగా వచ్చే వారు.

అలా రెండు దశాబ్ధాల పాటు శృంగార పరిశ్రమను రారాణిలా ఏలారు. తర్వాత శృంగార పరిశ్రమకు దూరంగా వచ్చేశారు. మామూలు సినిమాలు చేస్తున్నారు. అయితే, చాలా మందికి ఆమె ఓ శృంగార తారగానే తెలుసు. కానీ, శృంగార తారగా ఎంతో మందికి ఆనందాన్ని పంచిన ఆమె జీవితంలో అంతులేని విషాదం ఉంది. ఆమె ఎందుకు ఈ పరిశ్రమలోకి వచ్చారు? తన జీవితంలో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారు. సొంత తల్లిదండ్రులు ఆమె పట్ల వ్యవహరించిన తీరు.. కన్న తల్లే వ్యభిచార కూపంలోకి దింపిన విషయాలు ఎవరికీ తెలియవు. తోడ బుట్టిన వాళ్లు.. బంధువులు రాబందుల్లా పీక్కుతింటే.. ఆర్థికంగా ఆమెను మోసం చేస్తే  ఆమె పడ్డ కష్టాలు తెలిస్తే.. ఎంత వారికైనా కన్నీళ్లు రాకమానవు.

కన్న తల్లే వ్యభిచారంలోకి దింపింది..

చిన్నప్పటినుంచి తల్లి ఆమెను వేరుగానే చూసేది. దానికి కారణం షకీలకు కూడా తెలిసేది కాదు. ఎంత సంపాదించినా కూడా తల్లిలో షకీల పట్ల మార్పు రాలేదు. అస్తమానం షకీలను తిట్టేది. శాపనార్థాలు పెట్టేది. షకీల తన ఆత్మకథ పుస్తకంలో తల్లి గురించి మాట్లాడుతూ.. ‘‘ నాకు పదహారేళ్లు వచ్చాయి. ఎప్పుడూ నన్ను తిట్టే మా అమ్మ ఒక రోజు నన్ను పొగిడింది. నన్ను ఓ వ్యక్తి బయటకు తీసుకువెడతాడని చెప్పింది. అతను నన్ను ఒక డబ్బున్న వ్యక్తి దగ్గరకు తీసుకువెళ్తాడనీ.. అతనితో ‘మంచి’గా ఉంటే.. కుటుంబ ఆర్థిక సమస్యలు తీరిపోతాయని అంది. అతడు చెప్పినట్లు చేయాలని మరీమరీ చెప్పింది. నేను షాక్‌ తిన్నా.. నాకు వేరే ప్రత్యామ్నాయం లేకపోయింది. ఓ హోటల్‌ గదికి వెళ్లాను. ఆ వ్యక్తి నన్ను అక్కడ రేప్‌ చేశాడు’’ అని అన్నారు.

నాడు కోట్లు సంపాదించి.. నేడు ఆర్థిక కష్టాల్లో.. 

వెండి తెరపై ఏవిధంగా కనిపించినా.. షకీల మనసు మాత్రం ఎంతో మంచిది. అడిగిన వారికి లేదనుకుండా సాయం చేసేవారు. తన దగ్గరకు వచ్చి కష్టాలు చెప్పుకుని ఏడిస్తే.. ఆమె కూడా కంటతడి పెట్టుకునేవారు. వారికి ఆర్థిక సాయం చేసేవారు. బంధువులు, పరిచయం ఉన్నవాళ్లు, లేని వాళ్లు .. ఇలా ఎంతో మందికి ఆమె ఆర్థిక సాయం చేశారు. చివరకు తోబుట్టువులను, బంధువులను నమ్మి దారుణంగా మోస పోయారు. ఆర్థికంగా వారందరూ ఆమెను మోసం చేశారు. వారి కారణంగా షకీల ఆర్థిక కష్టాల్లో పడ్డారు.

షకీల తల్లిని నమ్మి ఆర్థిక వ్యవహారాలన్నీ ఆమెకు అప్పగించారు. ఆ తల్లి షకీల అక్కను నమ్మి డబ్బంతా ఆమె చేతుల్లో పెట్టింది. ఓ సమయంలో షకీల అక్క తల్లితో పాటు షకీలను కూడా మోసం చేసింది. లక్షల రూపాయలు కాజేసింది. సొంత అక్కే మోసం చేయటంతో షకీల షాక్‌ అయింది. తోబుట్టువు కావటంతో పోలీస్‌ స్టేషన్‌లో కంప్లైంట్‌ ఇ‍వ్వకుండా ఆగిపోయింది. అక్కే కాదు.. నమ్మి డబ్బు ఇవ్వటంతో బంధువులు కూడా షకీలను మోసం చేశారు. ఇలా తోబుట్టువు, బంధువుల చేతిలో ఆమె దారుణంగా మోస పోయింది.

స్టార్‌ హీరోలతో సమానంగా క్రేజ్‌ సంపాదించినా.. చివరకు ఆర్థిక కష్టాల్లో పడ్డారు. తల్లి తనను ఎంత ఇబ్బంది పెట్టినా షకీల మాత్రం ఆమెపై ప్రేమను మాత్రమే చూపించారు. తల్లికి ఆరోగ్యం బాగోలేకపోతే షకీల విలవిల్లాడిపోయారు. ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. తల్లి ఆరోగ్యం కోసం నానా తిప్పలు పడి డబ్బులు అరెంజ్‌ చేశారు. తల్లి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఉండటంతో తరచుగా డయాలసీస్‌ చేయించాల్సి వచ్చేది. ఇందుకు కూడా షకీల దగ్గర డబ్బులు లేని పరిస్థితి వచ్చింది.

ఇప్పటికీ ఆ మనసు వెన్నే..

శారీరకంగా.. మానసికంగా ఎన్ని ఇబ్బందులు పడ్డా.. అయిన వాళ్ల కారణంగా ఎన్ని కష్టాలు అనుభవించినా.. ఎదుటి వ్యక్తి సాయం చేసే విషయంలో.. వారికి కష్టం వస్తే స్పందించే విషయంలో షకీలలో ఏమాత్రం మార్పు రాలేదు. స్టార్‌డమ్‌ పూర్తిగా కోల్పోయి బతకటానికి మామూలు సినిమాలు చేస్తున్న ఈ సమయంలో కూడా ఆమె తన మంచి మనసును చాటుకుంటున్నారు. ఎవరి కష్టం వచ్చినా తన వంతు సాయం చేస్తున్నారు. ఇబ్బంది ఉన్న చోటుకు పిలుపులేకపోయినా వెళ్లి బాధితుల పక్షాన నిలబడుతున్నారు. ముఖ్యంగా ఆడవాళ్లకు అండగా నిలుస్తున్నారు. వారి హక్కుల కోసం పోరాడుతున్నారు. కొన్ని నెలల క్రితం చెన్నైలోని చూలైమేడులో చిత్ర రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌ లో అద్దెకు ఉంటూ ఇబ్బంది పడుతున్న బ్యాచిలర్స్‌ తరపున పోరాటం చేశారు. సోషల్‌ మీడియాలో వారి గురించి తెలుసుకుని సాయం చేయటానికి వెళ్లారు. రోడ్డుపై కూర్చుని ధర్నా చేశారు. దీంతో వారి సమస్య ఓ కొలుక్కి వచ్చింది.