తెలుగు ప్రేక్షకులది గొప్ప మనసనే చెప్పాలి. టాలీవుడ్ మూవీస్‌తో పాటు కంటెంట్ బాగుంటే ఇతర భాషా సినిమాలను కూడా మనోళ్లు ఆదరిస్తుంటారు. అందుకే తమిళం, కన్నడతో పాటు ఇంగ్లీష్ మూవీస్ కూడా ఇక్కడ డబ్ అయి రిలీజ్ అవుతుంటాయి. డబ్బింగ్ చిత్రాలతో రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య, విక్రమ్ సహా ఎందరో పర భాషా ఇండస్ట్రీలకు చెందిన హీరోలు తెలుగు నాట స్టార్ ఇమేజ్ సంపాదించారు. ఈ కోవలోనే ఇక్కడ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు రక్షిత్ శెట్టి. డిఫరెంట్ మూవీస్‌తో కన్నడలో ఈ యంగ్ హీరో సంచలన హిట్స్ అందుకున్నారు. ‘అతడే శ్రీమన్నారాయణ’, ‘777 చార్లీ’ మూవీస్‌తో తెలుగువారికీ ఆయన దగ్గరయ్యారు.
‘777 చార్లీ’ సినిమా కన్నడలో తర్వాత ఎక్కువగా వసూళ్లు సాధించింది తెలుగునాటే. అందుకే తన రీసెంట్ మూవీ ‘సప్త సాగరాలు దాచే ఎల్లో’ను తెలుగులోకి తీసుకొచ్చారు రక్షిత్ శెట్టి. ఈ మూవీని ‘సప్త సాగరాలు దాటి: సైడ్-ఎ’ పేరుతో ఇక్కడ రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 22న విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే కలెక్షన్స్ మాత్రం అనుకున్నంత స్థాయిలో రాలేదు. కన్నడలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ మూవీ తెలుగు నాట థియేటర్లలో రిలీజై వారం కూడా కాకుండానే డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అయిపోయింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సైలెంట్‌గా ఓటీటీలోకి రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ థ్రిల్ అవుతున్నారు.
‘సప్త సాగరాలు దాటి’ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీలోనూ ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. హేమంత్ ఎం రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రక్షిత్ శెట్టి సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్గా యాక్ట్ చేశారు. పవిత్ర లోకేష్‌తో పాటు అవినాష్, అచ్యుత్ కుమార్‌లు కీలక పాత్రల్లో కనిపించారు. మనసుకు హత్తుకునే లవ్ స్టోరోగా దీన్ని హేమంత్ తెరకెక్కించారు. మను (రక్షిత్ శెట్టి), ప్రియ (రుక్మిణీ వసంత్) మధ్య ప్రేమ, ఫ్యూచర్ గురించి వీళ్లు కనే కలలు నేపథ్యంగా ఈ సినిమా స్టోరీ సాగుతుంది. కలలు కన్నంత అందంగా ఈ జంట తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకుందా అనేది తెలియాలంటే మూవీని చూడాల్సిందే.
ఇదీ చదవండి: హీరో సిద్ధార్థ్‌కు సారీ చెప్పిన ప్రకాశ్ రాజ్.. ఎందుకంటే?