iDreamPost
iDreamPost
ఇంకో ఆరు రోజుల్లో విడుదల కానున్న ఆర్ఆర్ఆర్ కోసం థియేటర్లు అభిమాన సంఘాలు కాచుకుని ఉన్నాయి. ఎప్పుడెప్పుడు చూడాలాని ముళ్ళమీద కూర్చున్నట్టుగా కౌంట్ డౌన్ మొదలు పెట్టారు. రాజమౌళి ఇద్దరు హీరోలతో నాన్ స్టాప్ ప్రమోషన్ చేస్తూనే ఉన్నారు. ఇవాళ బెంగుళూరు దగ్గరలో చిక్ బళ్లాపూర్ లో చేయబోయే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో అంచనాలు ఇంకెక్కడికో వెళ్తాయని టాక్. అంతా బాగానే ఉంది కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన టికెట్ రేట్లు మూవీ లవర్స్ ని బాగా టెన్షన్ పెడుతున్నాయి. మొదటి రోజు ధర ఎంత ఉన్నా ఫ్లోలో వెళ్ళిపోతుంది కానీ సెకండ్ డే నుంచి చూడాలనుకున్న వాళ్లకు మాత్రం ఇది శరాఘాతమే.
ముందుగా తెలంగాణ సంగతి చూస్తే మొదటి మూడు రోజులకు గాను అదనంగా మల్టీ ప్లెక్సులకు 100 రూపాయలకు అనుమతి ఇవ్వడంతో అది కాస్తా ఇప్పుడు 400 రూపాయలు దాటనుంది. సింగల్ స్క్రీన్ లోనూ 236 రూపాయలు ముక్కుపిండి వసూలు చేస్తారు. వీకెండ్ వరకు ఇవి ఉంటాయి. ఆ తర్వాత పెంపు కొంత తగ్గించినా కూడా కేవలం అది 50 రూపాయలకు మాత్రమే పరిమితం. ఆ మధ్య కొత్త జిఓ వచ్చాక మల్టీ ప్లెక్సులో 295 రూపాయలు, సింగల్ స్క్రీన్ లో 175 రూపాయలు మీడియం రేంజ్ సినిమాలకు కూడా వసూలు చేయడం మీద ఇప్పటికే తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఇప్పుడీ పోకడ వల్ల కలెక్షన్లు వస్తాయేమో కానీ ఫ్యూచర్ లో ఇబ్బందులు తప్పవు.
ఆంధ్రప్రదేశ్ లోనూ పెంపు ఇచ్చారు కానీ అమలులో ఉన్న రేట్ల మీద 75 రూపాయలకు పర్మిషన్ వచ్చింది. అలా చూసుకుంటే పక్క రాష్ట్రం కంటే నయమని చెప్పొచ్చు. ఆర్ఆర్ఆర్ మీద ఉన్న హైప్ కి జనం మొదటి రోజు డబ్బును లెక్కచేయకపోయినా ఇలా కామన్ ఆడియన్స్ ని దూరం చేసుకోవడం పట్ల ఎగ్జిబిటర్లు పునరాలోచన చేసుకోవడం అవసరం. ప్రభుత్వాలు గరిష్ట పరిమితిని నిర్దేశిస్తున్నాయి కానీ ప్రతి సినిమాకు అలా చేసుకోమని వాటి ఉద్దేశం కాదు. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం జరుగుతున్నది వేరే. మరి జనం రెండు వారాలు అయ్యాక అప్పుడు ఆర్ఆర్ఆర్ చూద్దామని నిర్ణయించుకుంటారా అంత ఓపిక పట్టలేక వసూళ్లు ఇచ్చేస్తారా వేచి చూడాలి
Also Read : Radhe Shyam : వంద కోట్లకు పైగా నష్టం తెచ్చిన ప్యాన్ ఇండియా మూవీ