iDreamPost
android-app
ios-app

బాలీవుడ్ మాఫియా మెడలు వంచిన ఇద్దరు తెలుగోళ్ల కథ!

తరతరాలుగా బాలీవుడ్‌లో వేళ్లూనుకుపోయిన మాఫియాకు ఇద్దరు తెలుగు వాళ్లు చుక్కలు చూపిస్తున్నారు. ఆ మాఫియా గ్యాంగ్‌ కంటి మీద కునుకులేకుండా చేస్తూ.. వారి కారణంగా ఇబ్బంది పడ్డ వారికి మనస్సాంతి నిస్తున్నారు.

తరతరాలుగా బాలీవుడ్‌లో వేళ్లూనుకుపోయిన మాఫియాకు ఇద్దరు తెలుగు వాళ్లు చుక్కలు చూపిస్తున్నారు. ఆ మాఫియా గ్యాంగ్‌ కంటి మీద కునుకులేకుండా చేస్తూ.. వారి కారణంగా ఇబ్బంది పడ్డ వారికి మనస్సాంతి నిస్తున్నారు.

బాలీవుడ్ మాఫియా మెడలు వంచిన ఇద్దరు తెలుగోళ్ల కథ!

బలంగా పాతుకుపోయిన ఓ వ్యవస్థలో లోపం ఉంటే? దాన్ని కదిలించాలన్న దైర్యం కూడా ఎవ్వరూ చేయరు. చేయలేరు కూడా! ఇలాంటి ఓ మాఫియానే బాలీవుడ్‌ని శాసిస్తోంది. మా వాళ్ళు మాత్రమే ఎదగాలి. మా వాళ్ళు తీసినవి మాత్రమే సినిమాలు, మా వాళ్ళు మాత్రమే స్టార్స్ అంటూ కుంచిత మనస్తత్వంతో కుళ్ళిపోయి, కంపు కొడుతున్న బాలీవుడ్ మాఫియా అది. ప్రియాంక చోప్రా నుండి ఏఆర్‌ రెహ్మాన్‌ వరకు.. కంగనా రనౌత్‌ నుండి సుశాంత్‌ సింగ్‌ వరకు ఎవ్వరూ కూడా ఈ మాఫియా ఆటలను ఆపలేకపోయారు. వీరిని గొంతెత్తి దైర్యంగా ఎదిరించిలేకపోయారు.

తమ గళాల్నివినిపించి, వారి ముందు నిలిచి గెలవలేకపోయారు. కానీ.., ఇప్పుడు ఓ తెలుగు బిడ్డ బాలీవుడ్ మాఫియాని బట్టలు విప్పి నగ్నంగా నడి వీధిలో నిలుచో బెట్టేస్తే.. మరో తెలుగోడు ఆ బాలీవుడ్ మాఫియా గర్వాన్ని అణిచేలా బాక్సాఫీస్ వద్ద వాళ్ళని పరుగులు పెట్టిస్తున్నాడు. మేము మెచ్చినవే సినిమాలు, మాకు నచ్చిన వారే స్టార్స్ అన్న వారి అంటకట్టిన అహంకారాన్ని తన పదునైన మాటలతో తునాతునకలు చేస్తున్న ఆ ఇద్దరే హీరో రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగ.

ముందుగా సందీప్ రెడ్డి వంగా :

సందీప్ కి బాలీవుడ్ మాఫియాకి మధ్య ఇప్పుడు ఓ యుద్ధం జరుగుతోంది. ఇది సందీప్ తన సినిమాలను ఆడించుకోవడానికి చేస్తున్న యుద్ధం కాదు. నిజానికి ఆ అవసరం కూడా తనకి లేదు. ఎందుకంటే.. బాలీవుడ్ మాఫియా రివ్యూవర్స్ ఒక్క స్టార్ ఇచ్చిన “కబీర్ సింగ్” అక్కడ కలెక్షన్స్ సునామి సృష్టించింది. వారంతా బాగాలేదని పెదవి విరిచిన “యానిమల్” బాలీవుడ్ బాక్సాఫీస్ ని తన పంజా కింద పెట్టి తొక్కి పడేసింది. మరి ఇంకెందుకు సందీప్ సాగిస్తున్న యుద్ధం అంటే.. బాలీవుడ్ అనే వ్యవస్థని కొన్ని కుటుంబాలకు పరిమితం చేసి.. అమాయకుల ఆశలతో, జీవితాలతో ఆటలు ఆడుతున్న అసలైన యానిమల్స్ రియల్ ఫేస్ ప్రపంచానికి చాటి చెప్పడానికి.

ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో సందీప్ రెడ్డి వంగ ఇస్తున్న ప్రతి ఇంటర్వ్యూ ఈ యుద్ధంలో భాగమే. తాను ఐదేళ్ల కాలం బాలీవుడ్ లోనే ఉండి.. అక్కడి గురించి తెలుసుకున్న నిజాలను నిర్భయంగా చెప్తున్నాడు. సందీప్ చెప్తున్న నిజాలు వింటుంటే ఇందుకు కదా సుశాంత్ ఆత్మహత్య చేసుకుంది, ఇందుకు కదా కంగనా కన్నీరు పెట్టుకుంది, ఇందుకు కదా ప్రియాంక అమెరికాకి వలస పోయింది అన్న ఆలోచనలు సగటు సినీ ప్రేక్షకుడి మనసులో రాక మానవు.

బాలీవుడ్‌ మాఫియాకి వణుకు పుట్టిస్తున్న సందీప్‌ రెడ్డి వంగా:

బాలీవుడ్‌ గ్యాంగ్‌ అంటే లోకల్స్‌కు నిజంగానే ప్యాంట్లు తడిచిపోతాయి. వారితో పెట్టుకుంటే తర్వాత కెరీర్‌ నాశనం అవుతుందని లోకల్స్‌ గట్టిగా నమ్ముతారు. అందుకే వారి ఆగడాలను భరిస్తూ.. దిన దిన గండం నూరేళ్ల ఆయుష్షులా జీవిస్తూ ఉన్నారు. కానీ, చాలా కాలం తర్వాత ఓ నాన్‌లోకల్‌ బాలీవుడ్‌ గ్యాంగ్‌​కు చెమటలు పట్టిస్తున్నాడు. ఆ గ్యాంగ్‌ చేసే ఆగడాలను బాహాటంగా బయటకు చెబుతూ మండిపడుతున్నాడు. అది కూడా బాలీవుడ్‌ గడ్డ మీద.. అతడే తెలుగు బిడ్డ సందీప్‌ రెడ్డి వంగ. బాలీవుడ్‌లో తీసింది కేవలం రెండు సినిమాలే అయినా.. రికార్డులు అంటే ఎలా ఉంటాయో.. కొత్తగా పరిచయం చేశాడు. మాదే భారత చిత్ర పరిశ్రమ.. మేమే తోపులం అని జబ్బలు చరుస్తున్న మాఫియాకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాడు.

‘‘అనుప‌మ చోప్రా, రాజీవ్ మ‌సంద్, సుచిత్ర త్యాగి లాంటి బాలీవుడ్‌ క్రిటిక్స్ సినిమాలపై అవగాహన లేకుండానే రివ్యూలు రాస్తున్నారు. సినిమాలు ఎలా చూడాలో తెలియని వాళ్లు కూడా సినిమాలు చూసి రివ్యూలు రాస్తున్నారు. మూవీ అర్థం కాకపోతే బ్యాడ్‌ రివ్యూలు ఇస్తున్నారు. అర్జున్‌ రెడ్డి విషయంలోనూ ఇదే జరిగింది. నేను డబ్బులు ఇచ్చి ఎప్పుడూ రివ్యూలు కొనుక్కోలేదు. దాదాపు ఐదేళ్లుగా ముంబైలో ఉంటున్నా. ఈ ఐదేళ్లలో నాకో విషయం బాగా అర్థం అయింది. అక్కడో గ్యాంగ్‌ ఉంది. వాళ్లు కేవలం కొన్ని రకాల సినిమాలను మాత్రమే ఇష్టపడతారు. వాళ్లు కేవలం అలాంటి సినిమాలు తీసే దర్శకులను మాత్రమే ఇష్టపడతారు.

క్రిటిక్స్‌కు, రివ్యూవర్లకు డబ్బులు ఇచ్చే సంప్రదాయం కూడా ఉంది. మిగతా వాళ్ల సినిమాలపై తప్పుడు రివ్యూలు కూడా రాయిస్తారు. బ్యాడ్‌ రివ్యూల కారణంగానే హిందీలో ఫస్ట్‌ డే కలెక్షన్లపై దెబ్బ పడింది’’ అని సందీప్ రెడ్డి బాహాటంగా కామెంట్స్ చేయడంతో బీ-టౌన్ అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అక్కడి దర్శకులు కాదు కదా.. స్టార్ హీరోలు సైతం ఈ సో కాల్డ్ రివ్యూవర్స్ ని టచ్ చేయాలంటే భయపడతారు. అలాంటిది సందీప్ రెడ్డి వంగ.. ఇప్పుడు ఆ వ్యవస్థని గెలికి పడేశాడు. దీంతో.. ఇప్పుడు ఈ సో కోల్డ్ రివ్యూవర్స్ సినీ నాలెడ్జ్ పై బాలీవుడ్ ప్రేక్షకుల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలయింది. ఇప్పుడు వారి ఉనికే ప్రశ్నార్ధకం అయ్యే పరిస్థితులు తలెత్తాయి.

ప్రభాస్ అంటే కోపంతో.. సలార్ పై కుట్ర:

ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే కాదు.., చాలా రీజనల్ మూవీస్ ఉన్నాయని ఇప్పుడు అందరికీ తెలిసి వచ్చింది. కానీ.., ఆ బాలీవుడ్ కోట బీటలు పగుళ్లు వచ్చేలా ఢీ కొట్టిన మొట్టమొదటి స్టార్ మన బాహుబలి.. రెబల్ స్టార్ ప్రభాస్. ఖాన్స్ మాత్రమే బాలీవుడ్ వద్ద కింగ్ లు, కింగ్ ఖాన్ లు అనుకుంటున్న సమయంలో ప్రభాస్ ఆ కలెక్షన్స్ ఆటలో హద్దులు చెరిపేసి.. వారి ఊహకి కూడా అందనంత ఎత్తులో కూర్చున్నాడు. బాలీవుడ్ మాఫియాకి 6 ఏళ్లుగా ఆ కడుపు మంట అలాగే ఉండిపోయింది.

సాహోని సైడ్ చేయాలని ఈ మాఫియా అంత అప్పట్లో దారుణమైన రివ్యూస్ ఇచ్చింది. కానీ.., డార్లింగ్ కటౌట్ ముందు ఆ ఆటలు సాగలేదు. సాహో అక్కడ సూపర్ హిట్. కట్ చేస్తే ఇప్పుడు సలార్ పై కూడా అదే కుట్ర రిపీట్ చేశారు. ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ చేయకుండా.. సింగిల్ స్క్రీన్స్ అన్నీ డంకీకి కట్టబెట్టేశారు. కానీ.., డార్లింగ్ ఇప్పుడు బాక్సాఫీస్ డైనోసార్. ఆ రీసౌండ్ ముందు కింగ్ ఖాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ముందు ఇవ్వని ధియేటర్స్ అన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా సలార్ కి వచ్చి చేరుతున్నాయి. ఇది కూడా బాలీవుడ్ మాఫియాకి మింగుడు పడటం లేదు.

నిజానికి సౌత్‌తో పోల్చుకుంటే.. నార్త్‌లో నెపోటిజం ప్రభావం చాలా దారుణంగా ఉంటుంది. ఎంతలా అంటే.. ఇప్పుడు స్టార్లుగా ఎదిగిన, ఎదుగుతున్న ప్రతీ నటీ,నటుడు ఇతర క్రాఫ్ట్‌ల వాళ్లు కూడా సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి వచ్చిన వారే. ఇండస్ట్రీ మొత్తం కపూర్స్‌, ఖాన్స్‌ల చుట్టే తిరుగుతూ ఉంటుంది. వీరితో పాటు కరణ్‌ జోహార్‌ పేరు తరచుగా వినిపిస్తూ ఉంటుంది. నటన, నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్‌ ఇలా అన్నిటిలో వీరిదే ఆధిపత్యం. నార్త్‌లో  ఎక్కువ సినిమా థియేటర్లు వీరి గుప్పిట్లోనే ఉన్నాయి.

సినిమాలో కొత్త వాళ్లకు అవకాశాలు రావాలన్నా.. వాళ్లు పైకి ఎదగాలన్నా.. వీరి కరుణ, దయాదాక్షిణ్యాలు ఉండాలనే టాక్‌ బాలీవుడ్‌లో గట్టిగా ఉంది. వీళ్లకు నచ్చిన వాళ్లను.. బయటి వాళ్లపై నిర్థాక్షిణ్యంగా వ్యవహరిస్తారని చాలా మంది బాలీవుడ్‌ సెలెబ్రిటీలు.. చాలా సార్లు చెప్పారు. ఈ గ్యాంగులోని సభ్యుడితో పెట్టుకుంటే.. కెరీర్‌ నాశనం అవుతుందట. సల్మాన్‌ ఖాన్‌తో గొడవ కారణంగా ప్రముఖ హీరో వివేక్‌ ఓబేరాయ్‌, దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌, నటుడు పులకిత్‌ సామ్రాట్‌లతో పాటు చాలా మంది తమ కెరీర్‌ కోల్పోయారని టాక్‌.

ఈ గ్యాంగ్‌కు బయటినుంచి వచ్చిన వ్యక్తులు స్టార్లుగా ఎదగటం ఇష్టం ఉండదట. కొంచెం పేరు తెచ్చుకున్నా తట్టుకోలేదట. వారి కొచ్చే అవకాశాలు మొత్తం పోగొట్టేసి సంతోషిస్తుందట. దీనికి సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఓ ప్రత్యక్ష ఉదాహరణగా చెప్తుంటారు. ఈ మాఫియాపై సందీప్, ప్రభాస్ లా కొంతమంది ఎదురుతిరిగినా వారి శక్తి ముందు.. వీరి సామర్ధ్యం సరిపోలేదు. కానీ.., వారు నరకం అనుభవిస్తూ ఇచ్చిన స్టేట్మెంట్స్ మాత్రం ఇంకా చరిత్రలో పథిలంగానే ఉన్నాయి.

  • ప్రియాంక చోప్రా : బాలీవుడ్‌లో ఇబ్బందుల వల్లే అమెరికా వెళ్లిపోయా.
  • అభినవ్‌ కశ్యప్‌ : సల్మాన్‌ ఖాన్‌, అతడి కుటుంబం నా జీవితాన్ని నాశనం చేసింది.
  • రణ్‌వీర్‌ షోరే : నన్ను ఒంటరి వాడ్ని చేశారు. నాపై తప్పుడు వార్తలు రాశారు.
  • కంగనా రనౌత్‌ : నువ్వు కూడా త్వరలో సూసైడ్‌ చేసుకుంటావు అని సూసైడ్‌ గ్యాంగ్‌ అంది.
  • ఏఆర్‌ రెహ్మాన్‌ : ఓ గ్యాంగ్‌ నాపై తప్పుడు ప్రచారం చేస్తోంది. ఆ ప్రచారం కారణంగా బాలీవుడ్‌లో అవకాశాలు తగ్గుతున్నాయి.
  • రవీనా టాండన్ : బాలీవుడ్‌లో కొంతమంది చెడ్డ వ్యక్తులు ఉన్నారు. వాళ్లు నీ నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు. నేను కూడా వారి కారణంగా చాలా బాధ పడ్డాను. వాళ్లు క్లాస్‌ రూమ్‌ పాలిటిక్స్‌ చేస్తూ ఉంటారు. తోటి సినిమా వాళ్ల జీవితాలతో ఆటలు ఆడుతూ ఉంటారు.
  • రసూల్‌ పూకుట్టి ( సౌండ్‌ డిజైనర్‌) : ఆస్కార్‌ గెలుచుకున్న తర్వాత బాలీవుడ్‌లో ఓ గ్యాంగ్‌ నా మీద పగబట్టింది. అక్కడ అవకాశాలు రాకుండా చేసింది. నేను అల్లాడిపోయాను.
  • అమిత్‌ సద్‌ ( టీవీ నటుడు) : నేను నిర్భయంగా మాట్లాడతాననే కారణంతో రెండు గ్యాంగులు నాపై పగబట్టాయి. నాకు పని లేకుండా చేయాలని రెండు గ్యాంగులు మాట్లాడుకున్నాయి.
  • సోను నిగమ్‌ ( సంగీత దర్శకుడు) : ఇండస్ట్రీలో మూవీ మాఫియా కూడా ఉంది.
  • సోన మహాపాత్ర ( సింగర్‌) : అంబర్‌ సారియా వంటి సూపర్‌ హిట్‌ సాంగ్‌ పాడిన తర్వాత నాకు మళ్లీ అవకాశాలు రాలేదు. సాజిద్‌ ఖాన్‌,
  • అనుమాలిక్‌లు తెలిసిన వాళ్లకే అవకాశాలు ఇస్తున్నారు.
  • మనోజ్‌ బాజ్‌పాయి ( నటుడు) : బాలీవుడ్‌లో బయటి వాళ్లకు మర్యాద ఉండదు. మంచి సినిమాలు చేసినా.. చెడ్డ సినిమాలు చేసినా నిన్ను విమర్శిస్తారు. ఓ గ్యాంగ్‌ కొంత మంది సినీ విమర్శకులని, ట్రేడ్‌ అనలిస్టులను పోషిస్తోంది. నువ్వు ఎంత మంచి సినిమా చేసినా..దాన్ని చెత్త సినిమాగా ప్రొజెక్ట్‌ చేస్తారు.
  • ఉపెన్‌ పాటెల్‌ ( నటుడు) : నన్ను ఉన్నట్టుండి దూరం పెట్టాలని వాళ్లు భావించారు. నేను ఎటూ కాకుండా పోయాను. అది నా మానసిక జీవితంపై ప్రభావం చూపింది.
  • శ్రేయాస్‌ తల్పాడే (నటుడు) : నేను కరణ్‌ జోహార్‌తోనూ.. యశ్‌ రాజ్‌తోనూ పని చేయలేదు. వారి దగ్గరకు కూడా వెళ్లలేదు. వాళ్లు కూడా నాతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించలేదు.

‘‘ఆస్కార్‌’’ విషయంలోనూ మాఫియా కుళ్లు..

ఏ చిత్ర పరిశ్రమకైనా ఆస్కార్‌ తీసుకోవటం అనే ఓ పెద్ద కల. ఏ చిత్ర పరిశ్రమ అయినా.. ఆస్కార్‌ తెచ్చిన వారిని నెత్తిన పెట్టుకుని చూసుకుంటుంది. కానీ, బాలీవుడ్‌లో మాత్రం అలా జరగలేదు. ‘‘స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌’’కు గాను రెహ్మాన్‌తో పాటు మరికొంత మందికి ఆస్కార్‌ అవార్డులు వచ్చాయి. వీరి కెరీర్‌ బాలీవుడ్‌లో దేదీప్యమానంగా వెలిగిపోతుందని అందరూ భావించారు. కానీ, అలా జరగలేదు. వారంతా అవకాశాలు లేక ఇండస్ట్రీ మారిపోయే ఆలోచనకు వచ్చారు.

ఇందుకు ‍ప్రధాన కారణం బాలీవుడ్‌ మాఫియా. దీనిపై ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు శేఖర్‌ కపూర్‌ స్పందిస్తూ.. ‘‘ బాలీవుడ్‌కు ఆస్కార్‌ను అందుకోవటం చావు బతుకుల సమస్య. కానీ, నువ్వు అలా వెళ్లి ఇలా ఆస్కార్‌ను తెచ్చేశావు. అదే బాలీవుడ్‌కు నచ్చటం లేదు’’ అని ఏఆర్‌ రెహమాన్‌ను ఉద్దేశించి ఈ మాటలన్నారు. ఆస్కార్‌ గెలిచిన తర్వాత ‘‘ నువ్వు మాకు అవసరం లేదు’’ అంటూ కొంతమంది తన ముఖం మీదే చెప్పారని రసూల్‌ పూకుట్టి అనే సౌండ్‌ డిజైనర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలా ప్రతీ విషయంలోనూ తాము సాధిస్తేనే విజయం అనుకునే కుంచిత భావంతో ఆ గ్యాంగ్‌ బతుకుతుండటం గమనార్హం. ఇలా ఒకటా, రెండా లెక్కకి మించిన కథలు, లెక్కకి మించిన వ్యథలు. బాలీవుడ్ మాఫియా తొక్కేసిన జీవితాలు ఎన్నో. ఇప్పుడు ప్రభాస్, సందీప్ వీళ్ళకే నిద్ర లేకుండా చేస్తున్నారు. ఆ మాఫియా పునాదులను తవ్వడం మొదలు పెట్టారు. ఇద్దరు తెలుగోళ్లు దైర్యంగా.. దశాబ్దాలుగా అంట కట్టిన అహంకారంతో విర్రవీగిన ఓ వ్యవస్థతో చేస్తున్న యుద్ధం ఇది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.