iDreamPost
android-app
ios-app

కల్కి క్లైమ్యాక్స్‌లో కమల్ హాసన్ చెప్పిన “జగన్నాథ రథచక్రాలు” పూర్తి కవిత ఎప్పుడైనా చదివారా?

  • Published Jul 02, 2024 | 12:29 PM Updated Updated Jul 02, 2024 | 12:29 PM

Kalki 2898 AD, Kamal Haasan, SriSri: కల్కి సినిమాలో సినిమా మొత్తం అయిపోయాక.. చివర్లో కమల్‌ హాసన్‌ పాత్ర చెప్పే ‘జగన్నాథ రథచక్రాలు’ డైలాగ్‌ నెక్ట్స్‌ లెవెల్‌. మరి ఆ డైలాక్‌ ఎక్కడి నుంచి తీసుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

Kalki 2898 AD, Kamal Haasan, SriSri: కల్కి సినిమాలో సినిమా మొత్తం అయిపోయాక.. చివర్లో కమల్‌ హాసన్‌ పాత్ర చెప్పే ‘జగన్నాథ రథచక్రాలు’ డైలాగ్‌ నెక్ట్స్‌ లెవెల్‌. మరి ఆ డైలాక్‌ ఎక్కడి నుంచి తీసుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jul 02, 2024 | 12:29 PMUpdated Jul 02, 2024 | 12:29 PM
కల్కి క్లైమ్యాక్స్‌లో కమల్ హాసన్ చెప్పిన “జగన్నాథ రథచక్రాలు” పూర్తి కవిత ఎప్పుడైనా చదివారా?

ప్రభాస్‌ హీరోగా, నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సంచలన విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై.. సూపర్‌ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకొని.. భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే.. ఈ సినిమా మొత్తం ఒకెత్తు.. కమల్‌ హాసన్‌ చివర్లో చెప్పే ‘జగన్నాథ రథచక్రాల్‌’ డైలాగ్‌ మరో ఎత్తు. సినిమా ఎండ్‌ కార్డ్స్‌ పడిన తర్వాత.. ఒక్కసారిగా శక్తి పొందిన కమల్‌ హాసన్‌ పాత్ర చెప్పే డైలాగ్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుంది. సినిమా చూసి బయటికి వచ్చిన తర్వాత.. ఆ డైలాగ్‌ చేవుల్లో మారుమోగిపోతుంది. అయితే.. ఆ జగన్నాథ రథచక్రాల్‌ డైలాగ్‌.. మహాకవి శ్రీశ్రీ రాసిన మాహాప్రస్థానంలోనిది. జగన్నాథుని రథచక్రాలు కవితలోని నాలుగు లైన్లు తీసుకొని సినిమాలో వాడాడు. అయితే.. ఆ పూర్తి కవిత మాత్రం ఇది..

పతితులార !

భ్రష్టులార !

బాధాసర్ప దష్టులార !

బ్రదుకు కాలి,

పనికిమాలి,

శని దేవత రథచక్రపు

టిరుసులలో పడి నలిగిన

దీనులార !

హీనులార !

కూడు లేని, గూడు లేని

పక్షులార ! భిక్షులార !

సఖులవలన పరిచ్యుతులు,

జనులవలన తిరస్కృతులు,

సంఘానికి బహిష్కృతులు—

జితాసువులు,

చ్యుతాశయులు,

హృతాశ్రయులు,

హతాశులై

ఏడవకం డేడవకండి !

మీరక్తం, కలగి కలగి

మీ నాడులు కదలి కదలి

మీ ప్రేవులు కనలి కనలి

ఏడవకం డేడవకండి.

ఓ వ్యథానివిష్టులార !

ఓ కథావశిష్టులార !

పతితులార !

భ్రష్టులార !

బాధాసర్పదష్టులార !

ఏడువకం డేడవకండి !

వస్తున్నా యొస్తున్నాయి…

జగన్నాథ,

జగన్నాథ,

జగన్నాథ రథచక్రాల్‌ !

జన్నాథుని రథచక్రాల్‌ !

రథచక్రాల్‌,

రథచక్రాల్‌,

రథచక్రాల్‌, రథచక్రా

లోస్తున్నా యొస్తున్నాయి !

పతితులార !

భ్రష్టులార !

మొయిల్దారిని

బయల్దేరిని

రథచక్రాల్‌, రథచక్రా

లొస్తున్నా యొస్తున్నాయి !

సింహాచలం కదిలింది,

హిమాలయం కరిగింది,

వింధ్యాచలం పగిలింది—

సింహాచలం,

హిమాచలం,

వింధ్యాచలం, సంధ్యాచలం…

మహానగా లెగురుతున్నాయి !

మహారథం కదులుతున్నాది !

చూర్ణమాన

ఘూర్ణమాన

దీర్ణమాన గిరిశిఖరాల్‌

గిరగిరగిర తిరుగుతున్నాయి !

పతితులార !

భ్రష్టులార !

బాధాసర్పదష్టులార !

రారండో ! రండో! రండి!

వూరవతల నీరింకిన

చెరువుపక్క, చెట్టునీడ—

గోనెలతో, కుండలతో,

ఎటు చూస్తే అటు చీకటి,

అటు దుఃఖం, పటునిరాశ—

చెరసాలలు, ఉరికొయ్యలు,

కాలువలో ఆత్మహత్య !

దగాపడిన తమ్ములార !

మీ బాధలు నే నెరుగుదును…

వడలో, కడు

జడిలో, పెను

చలిలో తెగనవసి కుములు

మీ బాధలు, మీ గాధలు

అవగాహన నాకవుతాయి

పతితులార !

భ్రష్టులార !

దగాపడిన తమ్ములార !

మీ కోసం కలం పట్టి ,

ఆకసపు దారులంట

అడావుడిగ వెళిపోయే,

అరుచుకుంటు వెళిపోయే

జగన్నాథుని రథచక్రాల్‌,

రథచక్ర ప్రళయఘోష

భూమార్గం పట్టిస్తాను !

భూకంపం పుట్టిస్తాను !

నట ధూర్జటి

నిటాలాక్షి పగిలిందట !

నిటాలాగ్ని రగిలిందట !

నిటాలాగ్ని !

నిటాలాగ్ని !

నిటాలాక్షి పటాలుమని

ప్రపంచాన్ని భయపెట్టింది !

అరెఝా ! ఝా!

ఝుటక్‌, ఫటక్‌ …

హింసనణచ

ధ్వంసరచన

ధ్వంసరచన

హింసరచన

విషవాయువు, మరఫిరంగి,

టార్పీడో, టోర్నిడో!

అది విలయం,

అదిసమరం,

అటో యిటో తెగిపోతుంది ?

సంరంభం,

సంక్షోభం,

సమ్మర్దన, సంఘర్షణ !

హాలహలం పొగ చూరింది !

కోలాహలం చెలరేగింది !

పతితులార !

భ్రష్టులార !

ఇది సవనం,

ఇది సమరం !

ఈ యెగిరిన ఇనుప డేగ,

ఈ పండిన మంట పంట,

ద్రోహాలను తూలగొట్టి,

గోషాలను తుడిచిపెట్టి,

స్వాతంత్య్రం,

సమభావం,

సౌభ్రాత్రం

సౌహార్దం

పునాదులై ఇళ్లు లేచి,

జనావళికి శుభం పూచి—

శాంతి, శాంతి, శాంతి, శాంతి

జగమంతా జయిస్తుంది,

ఈ స్వప్నం నిజమవుతుంది !

ఈ స్వర్గం ఋజువవుతుంది !

పతితులార !

భ్రష్టులార !

బాధాసర్పదష్టులార !

దగాపడిన తమ్ములార !

ఏడవకం డేడవకండి !

వచ్చేశాయ్‌ , విచ్చేశాయ్‌,

జగన్నాథ,

జగన్నాథ,

జగన్నాథ రథచక్రాల్‌,

జగన్నాథుని రథచక్రాల్‌

రథచక్రాల్‌,

రథచక్రాల్‌,

రథచక్రాల్‌, రథచక్రాల్‌,

రారండో! రండో! రండో!

ఈ లోకం మీదేనండి!

మీ రాజ్యం మీ రేలండి