ఈ ఏడాది అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా చోటు దక్కించుకున్న కాంతార ఒరిజినల్ వెర్షన్ రిలీజై యాభై రోజులకు దగ్గరగా ఉండగా తెలుగు వెర్షన్ సరిగ్గా నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. కేవలం 2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగి ఇప్పటిదాకా 26 కోట్ల 71 లక్షల షేర్ రాబట్టిన ఈ శాండల్ వుడ్ వండర్ ఇంకా స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తునే ఉంది. ప్రధాన కేంద్రాల్లో ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లు వస్తూనే ఉన్నాయి. అన్ని భాషలు కలిపి కాంతార కలెక్ట్ చేసిన మొత్తం 363 కోట్లు. అంటే షేర్ రూపంలో 185 కోట్ల దాకా వస్తుంది. దీనికైన బడ్జెట్టే 16 కోట్ల దాకా ఉంటుంది. అంటే పెట్టుబడి రాబడి సూత్రంలో చూసుకుంటే ఎంత పెద్ద లాభమో అర్థం చేసుకుంటే మైండ్ పోతుంది.
కాంతారకు ముందు వెనుక వచ్చినవేవి దీని తాకిడి ముందు నిలవలేకపోయాయి. చిరంజీవి గాడ్ ఫాదర్ తో సహా అన్నీ నెమ్మదించాల్సి వచ్చింది. నిన్న యశోద వచ్చాక జనం దీనికి టర్న్ అవుతున్నారు కానీ నిజానికి అప్పటిదాకా డామినేషన్ మొత్తం కాంతార. ఒకవేళ ఇది ఈ స్థాయిలో విజయం సాధించకపోయి ఉంటే ఈపాటికి ఓటిటిలో వచ్చి ఉండేది. కానీ బిగ్ స్క్రీన్ రన్ బాగున్న నేపథ్యంలో డిజిటల్ స్ట్రీమింగ్ ని మరికొంత ఆలస్యం చేసేలా అమెజాన్ ప్రైమ్ తో హోంబాలే ఫిలిమ్స్ చర్చలు జరుపుతోందని బెంగళూరు టాక్. ఒకవేళ ఇవి సఫలమైతే ఈ నెలాఖరుకు కాంతార స్ట్రీమింగ్ అవుతుంది. లేదూ అంటే మాత్రం వచ్చే 18 న స్మార్ట్ స్క్రీన్ మీద చూసుకోవచ్చు.
మరోవైపు కర్ణాటకలో ఫుట్ ఫాల్స్ (థియేటర్ కు ప్రత్యక్షంగా వచ్చిన ఆడియన్స్ కౌంట్)పరంగా కాంతారా కోటి మార్కు దాటేసి కెజిఎఫ్ రెండు భాగాలను కిందకు నెట్టేసింది. ఇది ఒక్క రాష్ట్రం నుంచే తీసుకున్న లెక్క. ఇండియా వైడ్ తీసుకుంటే దీనికి రెట్టింపు ఉండొచ్చు. హిందీలోనూ దీని జోరు ఇంతే స్థాయిలో ఉంది. ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు ఎన్ని వస్తున్నా ఉత్తరాది ప్రేక్షకులు దీన్ని ఆదరిస్తున్న తీరు బాగుంది. నాలుగు వందల కోట్ల మార్కుని దాటేయడం ద్వారా బ్రహ్మాస్త్ర లాంటి విజువల్ గ్రాండియర్ సాధించలేని ఫీట్ కూడా దర్శక హీరో రిషబ్ శెట్టి సృష్టించిన ఈ అద్భుతం అందుకుంటుంది. తెలుగులోనే ఫిఫ్టీ డేస్ మార్కు అందుకున్నా ఆశ్చర్యం లేదు.