iDreamPost
android-app
ios-app

ఇంకోసారి ఇద్దరు మిత్రుల యుద్ధం

ఇంకోసారి ఇద్దరు మిత్రుల యుద్ధం

నిన్న కర్నూలులో జరిగిన వీరసింహారెడ్డి అఫీషియల్ టైటిల్ లాంచ్ తర్వాత విడుదల తేదీ గురించి పూర్తి క్లారిటీ వచ్చేసింది. డిసెంబర్ రిలీజ్ గురించిన ప్రచారానికి చెక్ పెడుతూ నిర్మాతలు 2023 సంక్రాంతికే ఫిక్స్ అయ్యారు. ఖచ్చితమైన డేట్ చెప్పలేదు కానీ జనవరి 9 నుంచి 13 మధ్యలో ఉంటుంది. మరోవైపు చిరంజీవి వాల్తేర్ వీరయ్యని కూడా డిసైడ్ చేస్తే ఆపై బయ్యర్లకు స్పష్టత వస్తుంది. రెండూ ఒకే మైత్రి బ్యానర్ నిర్మాణంలో రూపొందినవి కావడంతో డిస్ట్రిబ్యూషన్ పరంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రొడ్యూసర్లు ప్లాన్ చేసుకుంటున్నారు. ఆది పురుష్, విజయ్ వారసుడు కూడా పొంగల్ కే కట్టుబడటంతో థియేటర్ల సమస్య గట్టిగానే ఉండనుంది.

సో చిరు బాలయ్య ఇద్దరు మిత్రుల యుద్ధం కన్ఫర్మ్ అయ్యింది. చివరిసారి వీళ్ళు తలపడింది ఖైదీ నెంబర్ 150 – గౌతమీపుత్ర శాతకర్ణి సమయంలో. ఇందులో కమర్షియల్ గా మెగాస్టార్ దే పైచేయి అయ్యింది కానీ బాలయ్యకు సైతం ఆ టైంలో కెరీర్ బెస్ట్ ఫిగర్స్ నమోదయ్యాయి. పదికి పైగా సందర్భాల్లో చిరంజీవి బాలకృష్ణలు ఇలా క్లాష్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఫ్యాన్స్ కు ప్రధానంగా గుర్తొచ్చేవి కొన్నున్నాయి. నరసింహనాయుడు మృగరాజులు ఢీ కొట్టినప్పుడు నందమూరి నాయకుడే విజయం సాధించాడు. అన్నయ్య వంశోద్ధారకుడు టైంలో చిరు పెద్ద మార్జిన్ తో సక్సెస్ సాధించాడు. హిట్లర్ పెద్దన్నయ్య నువ్వా నేనా రీతిలో పోటీ పడ్డాయి.

ఇంకా వెనక్కు వెళ్తే చాలా ఉదాహరణలు ఉన్నాయి కానీ సోషల్ మీడియా ఫ్యాన్స్ అప్పుడే ట్రోలింగ్ యుద్ధాలు మొదలుపెట్టారు. వాల్తేర్ వీరయ్య సోమవారం టీజర్ తో పాటు టైటిల్ లాంచ్ చేయబోతున్నారు. దీనికేమైనా ప్రత్యేకమైన ఈవెంట్ చేస్తారా లేక సింపుల్ గా ఆన్ లైన్ లో వదులుతారా తెలియాల్సి ఉంది. మొత్తానికి రాబోయే రెండు నెలలు మైత్రికి ప్రమోషన్ల పరంగా పెను సవాళ్ళే ఎదురు కాబోతున్నాయి. ఎంత లేదన్నా పోలికలు వస్తుంటాయి కాబట్టి ఇద్దరి అభిమానులను సంతృప్తి చెందేలా పబ్లిసిటీ చేయాల్సి ఉంటుంది. చాలా కాలం తర్వాత టాలీవుడ్ సంక్రాంతి పండగ అంత చలిలోనూ రికార్డుల వేటలో విపరీతమైన సెగలు పుట్టించేలా ఉంది.