విశాఖ బీచ్‌ రోడ్డులో కారు బీభత్సం.. ముగ్గురి ప్రాణాలు బలి తీసుకున్న మద్యం

మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. ప్రాణాలు తీస్తుంది అని మందుబాబులకు తెలియదా.. తెలుసు. ఇళ్లు, ఒళ్లు గుల్లవుతుంది అని తెలిసినా సరే.. ఆ అలవాటును మానరు. ఇక మద్యం మత్తులో చోటు చేసుకునే ప్రమాదాలకు లెక్కేలేదు. ఒళ్లు తెలియకుండా తాగిన మత్తులో.. ఎదురుగా ఎవరు ఉన్నారు ఏంటి అనేది చూసుకోకుండా.. అతి వేగంతో వాహనాలు నడిపి.. ప్రమాదాలు చేయడం.. ఫలితంగా ఎన్నో కుటుంబాల్లో చీకట్లు అలుముకుంటున్న ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. ఇక తాజాగా విశాఖపట్నం, భీమిలి బీచ్‌రోడ్డులో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వస్తోన్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ప్రమాదానికి గురైన కారులో మద్యం బాటిళ్లు ఉన్నాయి. ఆ వివరాలు..

విశాఖపట్నంలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భీమిలి బీచ్‌ రోడ్డులోని రాడిసన్‌ బ్లూ హోటల్‌ దగ్గర సోమవారం రాత్రి అతి వేగంగా వచ్చిన ఓ కారు..బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. సాగర్‌నగర్‌ నుంచి రుషికొండ వైపు ఓవర్‌ స్పీడ్‌తో వచ్చిన కారు.. రాడిసన్‌ దగ్గర అదుపుతప్పి డివైడర్‌ మధ్యలో ఉన్న చెట్టును ఢీకొట్టింది. మళ్లీ అతి వేగంతో ముందుకు దూసుకువెళ్లి రుషికొండ నుంచి సాగర్‌నగర్‌ వైపు వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది.

ఈ ఘటనలో బైక్‌పై ఉన్న దంపతులు మృతి చెందారు. వీరు ఒడిశా రాయగడ జిల్లా కృష్ణానగర్‌కి చెందిన సింగారపు పృథ్వీరాజు, ప్రియాంకలుగా గుర్తించారు పోలీసులు. ఇక ఈ ప్రమాదంలో వారు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి కారణమైన కారులో పీఎం పాలెం ఆర్‌హెచ్‌ కాలనీకి చెందిన మజ్జి మణికుమార్‌ అనే యువకుడు ఉన్నాడు. అతడు కూడా ఈ ప్రమాదంలో మృతి చెందాడు.

ఈ ప్రమాదంలో మృతి చెందిన పృథ్వీరాజు బ్రిడ్జ్‌ అండ్‌ రూఫ్‌ కంపెనీలో సైట్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో వినయ్‌ అనే యువకుడు కారు డ్రైవ్‌ చేస్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు. కారులో మద్యం సీసాలు ఉండటంతో.. తాగిన మత్తులో డ్రైవింగ్‌ చేయడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని భావిస్తున్నారు పోలీసులు. కారులో ఆరుగురు యువకులు ఉండగా.. వీరిలో వెనక సీటులో కూర్చున్న మణికుమార్‌ మృతి చెందాడు. మరోకరికి తీవ్ర గాయాలు కావడంతో.. అతడిని కేజీహెచ్‌ ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదానికి ముందే వేరే చోట గొడవ..

ప్రమాదానికి గురైన కారు.. జోడుగుళ్లపాలెం తీరం నుంచి సాగర్‌నగర్‌ వైపుగా వచ్చింది. ఈ సమయంలో కారులో ఆరుగురు యువకులు ఉన్నారు. కారు ప్రమాదానికి గురి కావడానికి ముందే దానిలో ఉన్న యువకులు సాగర్‌నగర్‌ ఆర్చ్‌ వద్ద అక్కడి స్థానికులతో గొడవ పడ్డారు. కారులో ఉన్న వారు.. సాగర్‌నగర్‌ ఆర్చ్‌ వద్ద బీరు బాటిళ్లను రోడ్డుపై పడేశారు. ఆ వెనుకే వెళుతున్న మద్దిలపాలేనికి చెందిన కిషోర్‌, మురళీకృష్ణ అనే యువకులు దీని గురించి.. కారులో ఉన్న వారిని ప్రశ్నించినట్లు చెబుతున్నారు. దీంతో కారు ఆపి.. డ్రైవింగ్‌ సీటులో ఉన్న వినయ్ తమతో గొడవపడినట్లు కిషోర్, మురళి వెల్లడించారు.

తమను కొడతానంటూ బెదిరించాడని.. కిషోర్‌ దగ్గర నుంచి ఫోన్‌ లాక్కుని కారును వేగంగా ముందుకు పరిగెత్తించారని తెలిపారు. దాంతో వినయ్‌పై జోడుగుళ్లపాలెం పోలీసు అవుట్‌ పోస్టులో ఫిర్యాదు చేసినట్లు మురళి, కిషోర్‌ తెలిపారు. పోలీసులు ఈ యువకుల గురించి ఆరా తీసేలోగానే ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణమైన కారులో ఉన్నవారు మద్యం సేవించి ఉన్నారని కిషోర్‌, మురళీకృష్ణ అంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Show comments