Uppula Naresh
Uppula Naresh
తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత అంజి రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. మొదట్లో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ తర్వాత హత్య అని నిర్ధారించారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన సంచలనంగా మారుతోంది. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. నిర్మాత అంజి రెడ్డిని ఎందుకు హత్య చేశారు? ఎవరు హత్య చేశారు? హత్యకు దారి తీసిన కారణాలు ఏంటంటే?
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాతగా వ్యవహరించిన అంజిరెడ్డి ఎన్నో చిత్రాలు నిర్మించారు. ఈయన నగరంలోని పద్మారావు నగర్ లో నివాసం ఉండేవారు. అయితే తన వద్ద ఉన్న ఆస్తులన్నీ అమ్మి అమెరికా వెళ్లాలని కుమారులతోనే ఉండాలని అనుకున్నాడు. మరో విషయం ఏంటంటే? అంజి రెడ్డి వద్ద దాదాపు 30 ఏళ్ల నుంచి రవి కాట్రగడ్డ అనే వ్యక్తి సీనియర్ ఫొటో గ్రాఫర్ గా పని చేస్తున్నాడు. ఈ నమ్మకంతోనే అంజి రెడ్డి తన ఆస్తులను అమ్మే బాధ్యతను రవికి అప్పగించాడు.
దీంతో ఇతనికి తెలిసిన జీఆర్ కన్వెన్షన్ యజమాని రాజేష్ ను అంజిరెడ్డికి పరిచయం చేశాడు. ఇక పద్మారావునగర్ లో ఉన్న అంజిరెడ్డి ఆస్తులను కొనడానికి రాజేష్ కూడా అంగీకరించాడు. అయితే ఈ క్రమంలోనే అంజిరెడ్డి ఆస్తులను కాజేయాలని రాజేష్ పథకం రచించాడు. మొత్తానికి ఎలాంటి డబ్బులు ఇవ్వకుండానే ఆస్తి పాత్రలను తన పేర రాసుకుని.., ఆ తర్వాత అంజి రెడ్డిని హత్య చేయాలని భావించాడు. ఇందులో భాగంగానే రాజేష్ సెప్టెంబర్ 29న అంజిరెడ్డిని నమ్మించి ఓ చోటుకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత రాజేష్ ఇద్దరు బీహారిలకు సుఫారి ఇచ్చి అదే రోజు నిర్మాత అంజి రెడ్డిని దారుణంగా హత్య చేయించాడు.
ఇక చేసిన తప్పును కప్పు పుచ్చుకునేందుకు నిందితుడు రాజేష్.. అంజి రెడ్డిది రోడ్డు ప్రమాదంగా చిత్రకరించే ప్రయత్నం చేశాడు. ఇక సాయంత్రం తండ్రి ఇంటికి చేరకపోవడంతో అతని కుమారుడు అనేకసార్లు ఫోన్ చేశాడు. కానీ, ఎంతకు అంజి రెడ్డి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో అనుమానం రావడంతో అంజి రెడ్డి కుమారుడు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి ఎట్టకేలకు నిర్మాత అంజిరెడ్డిది హత్య అని తేల్చారు. ఆ తర్వాత పోలీసులు ప్రధాన నిందితుడైన రాజేష్ తో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. ఆస్తులను కాజేసుకోవడానికే నిర్మాత అంజిరెడ్డిని రాజేష్ హత్య చేశాడని పోలీసులు తెలిపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సంచలనంగా మారుతోంది.