iDreamPost
android-app
ios-app

భార్య గర్భవతి అని తెలిసిన గంటల వ్యవధిలోనే అంతులేని విషాదం

  • Published Jan 04, 2024 | 11:52 AM Updated Updated Jan 04, 2024 | 11:52 AM

వారిద్దరిది ప్రేమ వివాహం.. ఒక కుమార్తె సంతానం కాగా.. మరో సారి భార్య గర్భవతి అని తెలిసింది. ఈ వార్త తెలిసి ఆనందించేలోపే.. అంతులేని విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు..

వారిద్దరిది ప్రేమ వివాహం.. ఒక కుమార్తె సంతానం కాగా.. మరో సారి భార్య గర్భవతి అని తెలిసింది. ఈ వార్త తెలిసి ఆనందించేలోపే.. అంతులేని విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు..

  • Published Jan 04, 2024 | 11:52 AMUpdated Jan 04, 2024 | 11:52 AM
భార్య గర్భవతి అని తెలిసిన గంటల వ్యవధిలోనే అంతులేని విషాదం

వారిద్దరికి నాలుగేళ్ల క్రితం సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఒకరిని విడిచి ఒకరు బతకలేమని భావించారు. తమ ప్రేమ గురించి ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పారు. అయితే ముందుగా వారు అంగీకరించలేదు. దాంతో ఇద్దరు ఎంతో కష్టపడి పెద్దలను ఒప్పించి.. వారి అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఇక జీవితంలో అన్ని సంతోషాలే అని భావించారు. వారి అన్యోన్యతకు గుర్తుగా పండంటి కుమార్తె జన్మించింది. పాప వయసు ఏడాదిన్నర. ఇంతలోనే భార్య మరోసారి గర్భం దాల్చింది. ఆ వార్త తెలిసి వారు ఆనందంలో మునిగిపోయారు. అయితే వారి అన్యోన్యతను చూసి విధికి కన్ను కుట్టింది. రోడ్డు ప్రమాదం రూపంలో ఆ కుటుంబాన్ని కాటేసింది. ఫలితంగా ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించిన భార్య, బిడ్డలు దూరమయ్యి.. అతడు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నాడు. ఈ విషాదకర సంఘటన వివరాలు..

ఈ దారుణం.. తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. దేవరపల్లి మండలం బందపురం జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రెండు కార్లు ఢీకొని 19 నెలల చిన్నారితో సహా ముగ్గురు మృతి చెందగా ఎనిమిది మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఇక్కడ దారుణం ఏంటంటే చనిపోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు. ప్రమాదంలో సంగారెడ్డి జిల్లాకు చెందని సుభాష్ గౌడ్ తల్లి రమాదేవి, భార్య దివ్య ప్రియ, కుమార్తె 19 నెలల చిన్నారి గణిష్క చనిపోయారు. తీవ్రంగా గాయపడ్డ సుభాష్ కు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ఇక ఈ ప్రమాదంలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న 19 నెలల చిన్నారి గణిష్క అయిన ప్రాణాలతో తిరిగి రావాలని ప్రతి ఒక్కరు ఎదురు చూశారు. ప్రమాదం జరిగిన వెంటనే చిన్నారిని బైక్ మీద హుటాహుటిన దేవరపల్లి ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. చిన్నారిలో చలనం లేకపోవడంతో నోటి ద్వారా శ్వాసను అందించి ప్రాణం పోశారు. అయితే ప్రమాదంలో గణిష్క తలకు బలమైన గాయం అవ్వడంతో వైద్యులు ఎంత ప్రయత్నించిన చిన్నారిని కాపాడలేకపోయారు. ఇక ప్రమాదంలో తల్లి, భార్య, కూతురు చనిపోవడం ఆ విషయం తెలియక వారి కోసం అల్లాడుతున్న సుభాష్ గౌడ్ పరిస్థితి చూసి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కన్నీరు పెట్టుకున్నారు.

ప్రమాదం ఎలా జరిగింది అంటే..

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం బీహెచ్‌ఈఎల్‌ మాక్‌ సొసైటీకి చెందిన ఈడిగ సుభాష్‌గౌడ్‌ కొత్త ఇళ్లకు ఇంటీరియర్‌ పనులు చేయిస్తుంటాడు. ఇతనితో పాటు తల్లి, చెల్లి, తమ్ముడు ఉన్నారు. చెల్లికి పదేళ్ల కిందటే పెళ్లి చేశారు. తమ్ముడు ఉద్యోగరీత్యా వేరే రాష్ట్రంలో ఉన్నారు. సుభాష్‌ గౌడ్‌కి విశాఖపట్నం జిల్లా గాజువాకకు చెందిన దివ్యప్రియతో 2020 జూన్‌లో వివాహం జరిగింది. వీరిది ప్రేమ వివాహం. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.

ఆ తర్వాత 2021 జూన్‌లో ఈ దంపతులకు గణిష్క జన్మించింది. నూతన సంవత్సరం సందర్భంగా సుభాష్‌ గౌడ్‌, తన భార్య దివ్యప్రియ(25), కుమార్తె గణిష్క(19నెలలు), తల్లి రమాదేవి(50), చెల్లి స్వప్న, బావ మల్లిఖార్జున, మేనల్లుడు వికాశ్‌సాయితో గత నెల అనగా డిసెంబర్ 30న అత్తగారి ఇంటికి వెళ్లారు.అక్కడకు వెళ్లాక దివ్యప్రియకు వైద్య పరీక్షలు చేయించగా ఆమె గర్భవతి అని.. ప్రస్తుతం రెండో నెల అని తెలిసింది.

ఇక నూతన సంవత్సరం వేడుకలు అయిపోవడంతో.. వారంతా తిరిగి జనవరి 2న ఉదయం 10.00 గంటలకు హైదరాబాద్‌ బయలుదేరారు. కారు ముందు సీట్లో సుభాష్, అతడి భార్య, కుమార్తె ఉన్నారు. మధ్యలో తల్లి, చెల్లి, వెనుక బావ, మేనల్లుడు ఉన్నారు. ఇలా వెళ్తుండగా.. ఊహించని రీతిలో మరో కారు వీరికి ఎదురుగా వేగంగా రావడంతో ప్రమాదం జరిగింది. కారును కంట్రోల్ చేయడానికి కూడా అవకాశం లభించలేదు.ఈ ప్రమాదంలో సుభాష్‌గౌడ్‌కి తీవ్రగాయాలు అవ్వడంతో దేవరపల్లి ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం అందించారు. అతడి తల్లి, భార్య, బిడ్డలు స్పాట్ లోనే చనిపోయారు.

ఇక ఆస్పత్రిలో స్పృహలోకి వచ్చిన సుభాష్‌ నా భార్య, కుమార్తె, తల్లికి ఏమయ్యిందని అడుగుతుంటే వారు ఇక లేరని చెప్పలేక పోతున్నారు బంధువులు. బుధవారం సుభాష్‌ గౌడ్‌ బంధువులు వచ్చి అందరూ బాగానే ఉన్నారని చెప్పి హైదరాబాద్‌ తీసుకుని వెళుతున్నాం. నీ భార్య, కుమార్తె కూడా వైద్య నిమిత్తం వేరే వాహనంలో హైదరాబాద్‌ వస్తున్నారని చెప్పడంతో మనస్సును రాయి చేసుకుని బంధువులతో బయలుదేరాడు. కానీ వారు లేరన్న వార్త తెలిసిన తర్వాత అతడి పరిస్థితి ఏంటన్నది అర్థం కాక.. ఎలా ఓదార్చాలో తెలియక కన్నీరుమున్నీరు అవుతున్నారు.