తండ్రే కాలయముడై గోదావరిలో తోస్తే.. సమయస్ఫూర్తితో ప్రాణాలు కాపాడుకున్న కీర్తన

ఒక మనిషి బత్రకడానికి ఏం కావలి.. అసరరాలు తీర్చుకోవడానికి సరిపడా డబ్బు.. ఉండటానికి ఇల్లు.. ఇలా సవాలక్ష చెప్పవచ్చు. కానీ మనిషి బతకడానికి కావల్సింది ఇవి కాదు.. గుండె ధైర్యం, కాస్తంత ఆత్మవిశ్వాసం. ఈ విషయం తెలియక చాలా మంది చిన్న చిన్న సమస్యలకే ప్రాణాలు తీసుకుంటున్నారు. బ్రతుకు మీద చిన్నపాటి ఆశ ఉంటే చాలు.. ఎంత పెద్ద కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని.. జీవితంలో ముందుకు సాగవచ్చు. ఇందుకు నిదర్శనంగా నిలిచింది ఓ చిన్నారి. తమ బంధానికి అడ్డుగా ఉన్నారని భావించి.. చిన్నారులని కూడా చూడకుండా.. వారి ప్రాణాలు తీయడానికి ప్రయత్నించాడు ఓ రాక్షసుడు. పిల్లలను గోదారిలోకి తోసేసాడు.

కానీ వారిలో ఓ చిన్నారి మాత్రం ఎంతో ధైర్యంగా, సమయస్పూర్తితో వ్యవహరించి.. తన ప్రాణాలు కాపాడుకుంది. కళ్ల ముందే కన్నతల్లి, తోడబుట్టిన చెల్లి గోదారిలో కొట్టుకుపోతున్నా.. తాను మాత్రం ధైర్యంగా వ్యవహరించి.. తన ప్రాణాలు కాపాడుకుంది. బాలిక చొరవ, సమయస్ఫూర్తి చూసి స్థానికులు, పోలీసులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకు ఏం జరిగింది అంటే..

ఈ సంఘటన రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగానే ఈ దారుణం చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన పుప్పాల సుహాసిని అనే మహిళకు భర్తతో విభేదాలు రావడంతో దూరంగా ఉంటోంది. సుహాసినికి కీర్తన అనే కుమార్తె ఉంది. కూలిపనులు చేసుకుంటూ బిడ్డను పోషించుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈక్రమంలో సుహాసినికి రెండేళ్ల క్రితం ప్రకాశం జిల్లా దర్శికి చెందిన ఉలవ సురేష్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో.. ప్రస్తుతం వీరు గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉంటున్నారు.. ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో సుహాసిని-సురేష్‌లకు జెర్సీ అనే ఏడాది పాప ఉంది. అయితే కొద్ది రోజులుగా సుహాసిని, సురేష్‌ల మధ్య గొడవలు వచ్చాయి. దాంతో వారిని అడ్డు తొలగించుకోవాలని భావించాడు సురేష్‌.

పక్కా ప్లాన్‌తో..

ఈ క్రమంలో శనివారం సాయంత్రం సురేష్ షాపింగ్‌ చేద్దామని చెప్పి.. సుహాసిని, పిల్లలను రాజమహేంద్రవరం తీసుకొచ్చాడు. రాత్రంతా అక్కడే తిరిగారు. ఇక ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో రావులపాలెంలోని గౌతమి పాత వంతెన దగ్గరకు వారిని తీసుకెళ్లాడు సురేష్‌. అక్కడ సెల్ఫీ తీసుకుందామని చెప్పి నమ్మించాడు. వారు కూడా అంగీకరించడంతో.. సుహాసినిని, పిల్లల్ని రెయిలింగ్‌ దగ్గర పిట్టగోడపై నిలబెట్టాడు. ఆ తర్వాత ఒక్కసారిగా సురేష్ ముగ్గుర్ని నదిలోకి తోసేశాడు. ఆ తర్వాత కారు తీసుకుని పారిపోయాడు. సుహాసిని, జెర్సీ నదిలో పడిపోగా.. కీర్తన మాత్రం వంతెన పక్కగా వేసిన కేబుల్‌ పైపు చేతికి అందడంతో గట్టిగా పట్టుకుంది. ఒక చేత్తో పైపును పట్టుకొని వేలాడింది. ఎలాగైనా అక్కడ నుంచి బయటపడి ప్రాణాలు కాపాడుకోవాలని భావించింది. పైపును పట్టుకునే.. సాయం చేయమని కేకలు వేసింది.

సమయస్ఫూర్తితో వ్యవహరించి..

తన కళ్ల ముందే తల్లి, చెల్లి గోదారిలో గల్లంతయ్యారు. తాను ఏమాత్రం పట్టు జారినా.. గోదావరిలో పడి ప్రాణాలు కోల్పోతానని అర్థం అయ్యింది. ఓ వైపు పడిపోతాననే భయం వెంటాడున్నప్పటికి.. ఎలాగైనా ప్రమాదం నుంచి బయటపడి ప్రాణాలు దక్కించుకోవాలని భావించింది కీర్తన. ధైర్యం తెచ్చుకుని.. సమయస్ఫూర్తిగా వ్యవహరించింది. అప్పుడే తన దగ్గర మొబైల్‌ ఉన్న విషయం గుర్తుకొచ్చింది. ఒక చేత్తో పైపును జాగ్రత్తగా పట్టుకుని వేలాడుతూనే.. తన దగ్గరున్న మొబైల్ తీసి కింద పడిపోకుండా జాగ్రత్తగా పట్టుకుని 100 నంబరుకు కాల్‌ చేసింది. తర్వాత తనకు ఎదురైన ప్రమాదం, తాను ఉన్న పరిస్థితిని పోలీసులకు వివరించింది.

కీర్తన చెప్నిన మాటలు విన్న రావులపాలెం పోలీసులు వెంటనే స్పందించి అక్కడకు చేరుకున్నారు. పైపుకు వేలాడుతున్న కీర్తనను చూసి ఆలస్యం చేయకుండా ఆమెను రక్షించారు. కీర్తన అలా చీకట్లో పైపుకు వేలాడుతూ ఉండడమే కాక ఫోన్‌ చేసి తమకు సమాచారం అందించడాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. చిన్నారి ధైర్యాన్ని, సమయస్ఫూర్తితో వ్యవహరించిన తీరును అభినందించారు. కీర్తన ఫిర్యాదు మేరకు సురేష్‌ మీద కేసు నమోదు చేశారు రావులపాలెం పోలీసులు. గోదావరిలో గల్లంతైన సుహాసిని, జెర్సీ కోసం గాలింపు మొదలు పెట్టారు.. అలాగే నిందితుడు సురేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. చిన్నారి కీర్తనను రక్షించిన పోలీసులను ఎస్పీ అభినందించారు.

Show comments