Venkateswarlu
Venkateswarlu
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కోసం పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చిన ఓ వ్యక్తి చిక్కుల్లో పడ్డాడు. అత్తింటి వారి మాటలు విన్న అతడు జైలు పాలయ్యాడు. అక్రమంగా ఇండియాలోకి ప్రవేశించాడన్న కారణంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ కిషన్ బాగ్‌కు చెందిన నేహా ఫాతిమా అనే 29 ఏళ్ల యువతి ఉపాధి నిమిత్తం 2019లో షార్జా వెళ్లింది. పాకిస్తాన్‌కు చెందిన ఫయాజ్ అహ్మద్ అనే 24 ఏళ్ల యువకుడు కూడా ఉపాధి నిమిత్తం షార్జా వెళ్లాడు.
అక్కడ ఇద్దరికీ పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. ఆ స్నేహం ప్రేమకు దారి తీసింది. దీంతో 2019లోనే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ మగబిడ్డ కూడా పుట్టాడు. అయితే, గత సంవత్సరం ఫాతిమా ఒక్కత్తే హైదరాబాద్‌కు వచ్చేసింది. ఫయాజ్ పాకిస్తాన్ వెళ్లిపోయాడు. అప్పటినుంచి భార్యా భర్తలు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఫాతిమా తల్లిదండ్రులు ఫయాజ్ను సంప్రదించారు. హైదరాబాద్ రావాలని, గుర్తింపు పత్రాలు వచ్చేలా చూసుకుంటామని హామీ ఇచ్చారు. అత్తా,మామల మాటలు విని ఫయాజ్ అక్రమంగా ఇండియాలోకి వచ్చాడు.
పాకిస్తాన్‌నుంచి నేపాల్‌కు వచ్చి.. నేపాల్ నుంచి ఇండియాలోకి వచ్చాడు. గత కొన్ని నెలల నుంచి హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు. అయితే, ఆధార్ కార్డు సృష్టించుకునే నేపథ్యంలోనే ఫయాజ్ దొరికిపోయాడు. పోలీసులు ఫయాజ్ను అరెస్ట్ చేశారు. ఫయాజ్నుంచి పాస్ పోర్టు స్వాధీనం చేసుకున్నారు. అతడితో పాటు అతడి అత్తామామలపై కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారు. మరి, ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కోసం అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి అరెస్ట్ అయిన ఫయాజ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.