కిచెన్ లో మద్యం బాటిళ్లు.. సోఫాలో శవమై తేలిన యువతి! అసలేం జరిగిందంటే?

అది సోమవారం.. అర్థరాత్రి సమయం. ఇంట్లో అక్కాచెల్లెలు ఇద్దరే ఉన్నారు. కలిసి తిని పడుకున్నారు. కట్ చేస్తే.. తెల్లవారు జామున వీరి తండ్రి ఫోన్ చేశాడు. ఎవరూ ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆ తండ్రి పక్కింటివాళ్లకు ఫోన్ చేశాడు. వాళ్లు ఇంట్లోకి వచ్చి చూడగా.. పెద్ద కూతురు సోఫాలో శవమై కనిపించగా, చిన్న కూతురు జాడే లేదు. ఈ విషయం తెలుసుకున్న తండ్రి ఇంటికి చేరుకుని కూతురుని చూసి గుండెలు పగిలేలా ఏడ్చాడు. అనంతరం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. జిగిత్యాల జిల్లా కోరుట్లలోని భీమునిదిబ్బలో బంక శ్రీనివాస్ రెడ్డి-మాధవి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి దీప్తి (24), చందన, కుమారుడు సంతానం. పెద్ద కూతురు సాఫ్ట్ వేర్ ఉద్యోగి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది. చిన్న కూతురు బీటెక్ ఈ మధ్యే పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటుంది. ఇక కుమరుడు మాత్రం బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తూ అక్కడే ఉంటున్నాడు. ఇదిలా ఉంటే.. సోమవారం హైదరాబాద్ లో బంధువుల గృహ ప్రవేశం ఉండడంతో శ్రీనివాస్ రెడ్డి భార్యతో పాటు వెళ్లారు. అదే రోజు అక్కా చెల్లెల్లు దీప్తి, చందన 10 గంటల వరకు తల్లిదండ్రులతో ఫోన్ లో మాట్లాడి ఆ తర్వాత పడుకున్నారు.

కట్ చేస్తే.. మంగళవారం తెల్లవారుజామున తండ్రి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కూతుళ్లకు ఫోన్ చేశాడు. కానీ, ఎవరూ స్పందించలేదు. అనుమానంతో అతడు పక్కింటి వాళ్లకు ఫోన్ చేసి చూడమని చెప్పాడు. వాళ్లు ఇంట్లోకి వెళ్లి చూడగా.. పెద్ద కూతురు దీప్తి సోఫాలో శవమై కనిపించింది. ఈ సీన్ చూసి షాక్ గురై వెంటనే తండ్రి శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ చేసి జరిగింది వివరించారు. ఈ విషయం తెలుసుకున్న ఆ దంపతులు హుటాహుటిన ఇంటికి చేరుకుని కూతురుని ఆ స్థితిలో చూసి గుండెలు పగిలేలా ఏడ్చారు. పెద్ద కూతురు మరణించడం, చిన్న కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులకు ఏం జరిగిందో అస్సలు అర్థం కాలేదు.

ఈ విషయం పోలీసుల పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఇంటి పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించగా.. వారి ఇంట్లోని కిచెన్ లో మద్యం బాటిళ్లు, వెనిగర్, నిమ్మకాయలు కనిపించాయి. ఇదే సమయంలో చందన పరారైన విషయం తెలుసుకున్న పోలీసులు కోరుట్ల బస్టాండ్ సీసీ కెమెరాలను పరిశీలించగా.. చందన  ఓ యువకుడితో కలిసి ఆ బస్టాండ్ లో ఉండగా రికార్డ్ అయింది. అయితే ఖచ్చితంగా అతడు  ఆమె ప్రియుడే అయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇక చందన ఫోన్ కాల్ డేటా సేకరించగా.. ఆ యువతి రోజూ ఓ యువకుడితో గంటల తరబడి ఫోన్ లో మాట్లాడినట్లుగా తెలుసుకున్నారు. అనంతరం మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమనాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చందన ఆ యువకుడితో పారిపోయే క్రమంలో దీప్తి అడ్డుకుంటే ఇద్దరు కలిసి ఆమెను హత్య చేశారా? అసలేం జరిగిందని పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Show comments