Uppula Naresh
Uppula Naresh
గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో జీహెచ్ఎంసీ అధికారులు ట్యాంక్ బండ్ పై నిమజ్జన ఏర్పాట్లు చేశారు. అయితే గురువారం ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనాన్ని తిలకించేందుకు నగరం నలు మూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక ఇసుకేస్తే కూడా రాలనంత జనం రావడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా దొంగల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సైతం ముందే హెచ్చరించారు. అయినా.. సరే గురువారం మాత్రం దొంగలు రెచ్చిపోయారు.
కేవలం నిన్న ఒక్కరోజే ట్యాంక్ బండ్ పై 67 దొంగతనం కేసులు ఫిర్యాదులు అందడంతో పోలీసులు షాక్ గురవుతున్నారు. ప్రజలంతా నిమజ్జనంలో హడావిడిలో ఉండడంతో దొంగలకు ఇదే మంచి సమయం అనుకుని సెల్ ఫోన్స్, డబ్బులు వంటివి దొంగిలించినట్లుగా తెలుస్తుంది. ఈ దొంగతనాలపై బాధితులు నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాలను, డ్రోన్ దృశ్యాలను పరిశీలించి నిందితులను పట్టుకునే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే పోలీసులు కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.