iDreamPost

విశాఖలో ఇంటర్నేషనల్‌ బెట్టింగ్‌.. ఏకంగా 400 కోట్ల లావాదేవీలు!

విశాఖలో ఇంటర్నేషనల్‌ బెట్టింగ్‌.. ఏకంగా 400 కోట్ల లావాదేవీలు!

విశాఖపట్నంలో ఇంటర్‌ నేషనల్‌ బెట్టింగ్‌ ముఠా గుట్టురట్టయింది. ఆన్‌లైన్‌ ద్వారా బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముఠాకు సంబంధించిన 11 మందిని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. దినేష్‌ అలియాస్‌ మోను, వాసుదేవరావులు ప్రధాన నిందితులుగా పోలీసులు తేల్చారు. అనకాపల్లికి చెందిన సూరిబాబు అనే వ్యక్తి ఈ బెట్టింగ్‌ ముఠాలో కీలకంగా వ్యవహరిస్తున్నాడని పోలీసులు తెలిపారు. బెట్టింగ్‌లు పెట్టడంతో మొదలెట్టి.. బుకీగా మారిపోయాడని, ఇంటర్‌ నేషనల్‌, ఐపీఎల్‌ బెట్టింగులు నిర్వహిస్తున్నాడని వెల్లడించారు.

ప్రతీ మ్యాచ్‌కు నాలుగు లక్షల దాకా వెనకేసే వాడని, ఏడాదికి 5నుంచి 6 కోట్ల రూపాయల దాకా వెనకేసుకునేవాడని చెప్పారు. ఈ లావాదేవీలపై అనుమానం రాకుండా.. టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ యజమాని దినేష్‌కు పంపేవాడని తెలిపారు. ఈ ఇంటర్‌ నేషనల్‌ బెట్టింగ్‌ ముఠా వందల కోట్ల రూపాయల లావాదేవీలు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. 63 బ్యాంక్‌ అకౌంట్ల ద్వారా 367 కోట్ల రూపాయల లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. 32 అకౌంట్లలో 75 లక్షల రూపాయలు ఉండటంతో వాటిని ఫ్రీజ్‌ చేయించారు.

కాగా, ఈ బెట్టింగ్‌ ముఠాపై ఎర్ర సత్తిబాబు అనే వ్యక్తి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశాడు. తాను ఆ ముఠా ద్వారా మోసపోయానని తెలిపాడు. ఈ బెట్టింగ్‌పై సీపీ రవిశంకర్‌ దర్యాప్తుకు ఆదేశించారు. బాధితుడు సత్తిబాబు బ్యాంక్‌ అకౌంట్స్‌ ద్వారా దర్యాప్తు చేయగా అసలు దొంగలు దొరికారు. సూరిబాబు అనే బుకీ ఖాతాకు సత్తిబాబు ఎనిమిది లక్షల రూపాయలు పంపించినట్లు తేలింది. సూరిబాబు బ్యాంక్ అకౌంట్‌ను ట్రేస్‌ చేయగా.. అసలు సూత్రదారి దినేష్‌ వివరాలు బయటపడ్డాయి. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి