P Krishna
P Krishna
మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా ఉన్నవాళ్లు హఠాత్తుగా మన నుంచి దూరమైపోతుంటారు. రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు, అగ్ని ప్రమాదాలు, కరెంట్ షాక్ ఇలా ఎన్నో రకాలుగా మనుషులు మృత్యువాత పడుతున్నారు. సర్వాంగసుందరంగా ముస్తాబైన ఫంక్షన్ హాల్‌లో సంబురంగా వివాహ వేడుక జరుగుతుంది.. అంతలోనే మంటలు చెలరేగాయి.. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోగా పిల్లలు, పెద్దలు మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటన ఇరాక్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఇరాక్ లో పెళ్లింట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివాహవేడుక జరుగుతున్న ఓ ఫంక్షన్ హాల్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అప్పటి వరకు పెళ్లి సందడితో సంతోషంగా ఉన్న ఆ ఫంక్షన్ హాల్‌లో ఒక్కసారే మంటలు వ్యాపించడంతో హాహాకారాలు, ఆర్తనాదాలతో మార్మోగింది. ఈ దారుణ ఘటనలో 100 మందికి పైగా సజీవదహనం అయ్యారు. మరో 150 మందికి పైగా అతిథులు తీవ్రంగా గాయపడ్డారని అక్కడ మీడియా వర్గాలు వెల్లడించాయి.
ఈ ఘటనలో గాయపడిన వారిలో నూతన వధూవరులు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ విషాద సంఘటన ఉత్తర ఇరాక్ లోని అల్ – హమ్ దానియా ప్రాంతంలో చోటు చేసుకుంది. ఫంక్షన్ హాల్ లో మంటలు చెలరేగడంతో స్థానికులు పోలీసులకు, ఫైర్ స్టేషన్ కి సమాచారం అందించారు. హుటాహుటిన ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని అతి కష్టం మీద మంటలు ఆర్పివేశారు. క్షతగాత్రులను అంబులెన్స్ లో వివిధ ఆసుపత్రులకు తరలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టానికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదం పటాసులు కాల్చడం వల్ల జరిగి ఉంటుందని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయని ఇరాక్ పౌర రక్షణ విభాగం తెలిపింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.