భర్తతో కలిసి పుట్టింటికి బయల్దేరింది.. కానీ అంతలోనే

పుట్టింటికి వెళ్లడం అంటే వివాహిత మహిళలకు ఎంత సంతోషమో మాటల్లో చెప్పలేము. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహిళ కూడా అలానే ఎంతో సంతోషంగా భర్తతో కలిసి తన పుట్టింటికి బయలుదేరింది. మరి కాసేపట్లో.. తన తల్లిగారింట్లో అడుగుపెడతానని సంతోషంగా ఉంది. ఇంతలో భర్తకు ఫోన్‌ రావడంతో.. అతడు బైక్‌ పక్కకు ఆపి.. కాల్‌ మాట్లాడుతున్నాడు. మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ.. అప్పటి వరకు బాగానే ఉన్న మహిళ.. ఒక్కసారిగా దారుణ నిర్ణయం తీసుకుంది. భర్త కళ్లేదుటనే.. కాలువలోకి దూకి మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ దారుణ ఘటన ఏలూరులో చోటు చేసుకుంది. ఉంగుటూరు మండలం అక్కుపల్లి గోకవరంకు చెందిన శ్రీనివాసరావుకు.. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు చెందిన కస్తూరితో ఈ ఏడాది అనగా.. 2023 జనవరిలో వివాహమైంది. ఇక శ్రీనివాసరావు తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వెలివెన్నులోని ఓ ప్రైవేటు స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. కస్తూరి అత్తింట్లోనే ఉంటుంది. ఈ క్రమంలో గురువారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో శుక్రవారం ఉదయం కస్తూరిని ఆమె పుట్టిల్లు.. కొవ్వూరులో దించేందుకు బైక్‌పై బయలుదేరారు.

నల్లజర్ల మండలం అనంతపల్లిలో పోలవరం కుడి బ్రిడ్జి దగ్గరకు వచ్చే సమయానికి.. కస్తూరి భర్త శ్రీనివాస్‌కు ఫోన్ వచ్చింది. దాంతో పక్కనే బైక్‌ ఆపి ఫోన్‌ మాట్లాడుతున్నాడు. అదే సమయంలో కస్తూరి.. తన చెప్పు పడిపోయిందని.. దాన్ని తెచ్చుకుంటానని వెనక్కి వెళ్లి.. భర్త శ్రీనివాస్‌ కళ్లముందే కాలువలోకి దూకింది. కళ్ల ముందే కస్తూరి కొట్టుకుపోతున్నా ఆమెని రక్షించేందుకు ఎవరూ ప్రయత్నం చేయలేదు. అలా సుమారు 500 మీటర్ల దూరం వరకు నీళ్లపై కనిపించిన కస్తూరి.. ఆ తర్వాత నీటిలో మునిగిపోయింది.

గజఈతగాళ్ల సహాయంతో వెదికినా ఆమె ఆచూకీ దొరకలేదు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేశారు. కస్తూరి కోసం గాలిస్తున్నారు. అయితే పెళ్లై ఏడాది కూడా కాలేదని.. కానీ గత కొంతకాలంగా భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని.. ఈ క్రమంలోనే ఆమె కాలువలోకి దూకేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Show comments