iDreamPost
android-app
ios-app

మహిళా రైతుకు అండగా నిలిచిన దిశ యాప్

మహిళా రైతుకు అండగా నిలిచిన దిశ యాప్

దిశ యాప్.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ యాప్ రాష్ట్రంలోని అమ్మాయిలకు, మహిళలకు అండగా నిలుస్తోంది. ఎవరైనా మహిళలపై దాడులకు ప్రయత్నిస్తే.. సమచారం అందించిన క్షణాల్లోనే ఘటనా స్థలానికి చేరుకుని బాధిత మహిళలకు, అమ్మాయిలను అండగా ఉంటోంది. దిశ యాప్ ద్వారా ఇప్పటికీ ఎంతో మంది బాధితులు నిందితుల నుంచి రక్షించబడ్డారు. అయితే తాజాగా ఓ మహిళా రైతుకు సైతం దిశ యాప్ అండగా నిలిచింది. దీంతో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దిశ యాప్ నన్ను కాపాడిందని సంతోషం వ్యక్తం చేసింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని నంద్యాల జిల్లా రుద్రవరం మండలం పెద్ద కంబలూరులో ఓ మహిళ నివాసం ఉంటుంది. అయితే ఇటీవల ఆమె ఎప్పటిలాగే పొలం పనులు ముగించుకొని సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్తుంది. ఇదే సమయంలో ప్రసాద్ అనే వ్యక్తి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేయబోయాడు. దీంతో ఆ మహిళ ఒక్కసారిగా కేకలు వేసి దుండగుడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఇదే సమయంలో స్థానికులు అప్రమత్తమై అక్కడికి రావడంతో ప్రసాద్ అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం బాధిత మహిళ దిశ SOS కు ఫోన్ చేసి వివరించింది.

దీంతో దిశ పోలీసులు కేవలం పది నిముషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకుని పారిపోతున్న నిందితుడు ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మహిళ ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 354 A, 354 B, 506 ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కాల్ చేసిన క్షణాల్లోనే ఘటనా స్థలానికి చేరుకుని దిశ పోలీసులు నన్ను రక్షించారని ఆ మహిళా రైతు సంతోషం వ్యక్తం చేసింది. దిశ యాప్ గురించి గ్రామ సచివాలయ సిబ్బంది ఎలా ఉపయోగించాలో వివరించారని, ఈ యాపే ఈ రోజు నన్ను రక్షించిందని ఆమె తెలిపింది. ఆపదలో ఉన్న తనకు రక్షణగా నిలిచిన దిశ పోలీసుల సహాయం ఎప్పటికీ మరువలేనని మహిళ సంతోషం వ్యక్తం చేసింది.

ఇది కూడా చదవండి: మహిళల విషయంలో ఇకపై ఆ పదాలు వాడొద్దు: సుప్రీంకోర్టు