Uppula Naresh
Uppula Naresh
చెన్నైలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ ఏసీ కారణంగా తల్లీకూతురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొందరు స్థానికులు వెంటనే అప్రమత్తమై వారిని ఆస్పత్రికి తరలించారు. కానీ, వాళ్లు అప్పటికే మరణించినట్లుగా వైద్యులు నిర్ధారించారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అసలు తల్లీకూతుళ్లు ఏసీ కారణంగా ఎలా చనిపోయారు? అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. చెన్నై శివారులోని అంబత్తూరు మీనంబేడు పరిధిలోని ఏకాంబర నగర్ లో ఆదిల (50), నష్రీన్ (16) అనే తల్లీకూతుళ్లు ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే ఆదిల భర్త ఇటీవల అనారోగ్య కారణంగా మృతి చెందాడు. దీంతో అప్పటి నుంచి తల్లీకూతుళ్లు తమ కుటుంబ సభ్యుల ఇంట్లో అద్దెకు దిగారు. ఇక తల్లి ఓ స్కూల్ లో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, కూతురు స్థానికంగా ఓ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. ఇదిలా ఉంటే.. శనివారం ఉదయం వీరుంటున్న ఇంట్లో ఏసీలో షార్ట్ సర్కూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఏసీ ఆన్ లో ఉండడంతో మంటలు, పొగలు ఇళ్లంతా వ్యాపించాయి.
ఆ సమయంలో ఊపిరాడక తల్లీకూతరు తీవ్ర అస్వస్థతకు గురై ఇంట్లోనే పడిపోయారు. ఇక చుట్టు పక్కల వాళ్లు గమనించి పొగలను అదుపు చేశారు. ఆ తర్వాత ఆ తల్లీకూతుళ్లను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. అప్పటికే వాళ్లు ప్రాణాలు కోల్పోయినట్లుగా నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకుని వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇదే విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏసీకి షార్ట్ సర్క్యూట్ కారణంగానే పొగలు వ్యాపించి ఊపిరాడక తల్లీకూతురు మరణించినట్లుగా తేలింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.