iDreamPost
android-app
ios-app

పెనుగొండ: పెళ్లైన 4 రోజులకే గోదారిలో దూకిన జంట.. అతడిపైనే అనుమానం

  • Published Dec 21, 2023 | 9:00 AM Updated Updated Dec 23, 2023 | 5:57 PM

వివాహమై పట్టుమని పది రోజులు కూడా కాలేదు.. ఆ నవదంపతులు గోదారిలో దూకారు. మరి వారు అలాంటి దారుణ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు.. అసలేం జరిగింది అంటే..

వివాహమై పట్టుమని పది రోజులు కూడా కాలేదు.. ఆ నవదంపతులు గోదారిలో దూకారు. మరి వారు అలాంటి దారుణ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు.. అసలేం జరిగింది అంటే..

  • Published Dec 21, 2023 | 9:00 AMUpdated Dec 23, 2023 | 5:57 PM
పెనుగొండ: పెళ్లైన 4 రోజులకే గోదారిలో దూకిన జంట.. అతడిపైనే అనుమానం

వారిద్దరి ఆమోదం మేరకే నాలుగు రోజుల క్రితం తల్లిదండ్రలు ఎంతో ఘనంగా.. బంధు మిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేశారు. నిండు నూరేళ్లు పిల్లా పాపాలతో వర్దిల్లాలలని పెళ్లికి వచ్చిన వారంతా ఆ జంటను ఆశీర్వదించారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నీ చేయి వీడనంటూ అతడు.. అన్ని సమయాల్లో నీకు తోడుగా పక్కనే ఉంటానని ఆమె పెళ్లి ప్రమాణాలు చేసుకున్నారు. వివాహమై కేవలం నాలుగు రోజులు మాత్రమే అవుతుంది. మరి ఏం జరిగిందో తెలియదు కానీ.. ఆ కొత్త జంట గోదారిలో దూకింది. భార్య గల్లంతు కాగా.. భర్త ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చాడు. పెళ్లైన నాలుగు రోజులకే చనిపోవాల్సినంత కష్టాలు వారికి ఏం వచ్చాయి.. అసలేం జరిగింది అంటూ వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషాదకర సంఘటన వివరాలు..

ఈ విషాదకర సంఘటన ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం వంతెన దగ్గర చోటు చేసుకుంది. ఉండ్రాజవరం మండలం మోర్తకు చెందిన శివరామకృష్ణకు వారం రోజుల క్రితం అనగా డిసెంబర్ 15న వడలికి చెందిన కోరాడ సత్యవాణి అనే యువతితో.. అన్నవరప్పాడు వెంకటేశ్వరస్వామి ఆలయంలో వివాహం జరిగింది. ఈ క్రమంలో కొత్త జంట.. మంగళవారం రాత్రి అనగా డిసెంబర్ 19న సినిమాకు వెళ్తున్నామని ఇంట్లో చెప్పి.. వడలి నుంచి బైక్‌పై బయటకు వెళ్లారు. తర్వాత ఏమైందో తెలియదు కానీ.. గోదారిలో దూకారు. ఈ క్రమంలో సిద్ధాంతం వంతెన వద్ద వారి బండి, వరుడు ఈదుకొచ్చిన చోట వధువు చెప్పులు ఉన్నట్లు చెబుతున్నారు స్థానికులు.

అయితే వరుడు శివరామకృష్ణ ఈదుకుంటూ ఒడ్డుకు చేరాడు. ఆ తర్వాత వెంటనే ఇరువురి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకుని.. మత్స్యకారుల సాయంతో బుధవారం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ తర్వాత శివరామకృష్ణను తణుకులోని ప్రైవేటు ఆసుపత్రి నుంచి తీసుకువచ్చారు. ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. పెళ్లైన నాలుగు రోజులకే చనిపోవాల్సినంత కష్టం ఏం వచ్చింది.. పైగా నవ వధువు చనిపోగా.. శివరామకృష్ణ ఒడ్డుకు ఈదుకుంటూ రావడంతో.. అతడిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాక పెళ్లి సందర్భంగా సత్యవాణి తల్లిదండ్రులు కట్నం కింద లక్షా 60 వేలు, బంగారు ఆభరణాలు పెట్టామని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. అంతేకాక శివరామకృష్ణనే తమ కుమార్తెని చనిపోయేలా ప్రేరేపించి.. ఇప్పుడు ఏదో నాటకం ఆడుతున్నాడని వధువు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసినట్లు పెనుగొండ పోలీసులు తెలిపారు.