35 పైసలకే రూ. 10 లక్షల బీమా.. విజయనగరం బాధితులకు వర్తిస్తుందా?

విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గతంలో ఒడిశాలో కూడా ఈ తరహా ప్రమాదం జరిగింది. ఇలాంటి సమయంలో రైలు ప్రమాద బాధితులు 10 లక్షల వరకు బీమా పొందే అవకాశం ఉంది. ఆ వివరాలు..

విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గతంలో ఒడిశాలో కూడా ఈ తరహా ప్రమాదం జరిగింది. ఇలాంటి సమయంలో రైలు ప్రమాద బాధితులు 10 లక్షల వరకు బీమా పొందే అవకాశం ఉంది. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌, విజయనగరం జిల్లా, కొత్తవలస మండలంలోని కంటకాపల్లి-అలమండ మధ్య ట్రాక్‌ మీద ఉన్న రైలును వెనుకనుంచి మరొక ట్రైన్ వచ్చి ఢీకొనడంతో.. ఘోర ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ దుర్ఘటనలో 3 బోగీలు నుజ్జునుజ్జు కాగా.. సుమారు 15 మంది మృతిచెందారు. 50 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులకి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందుతోంది. ఇక సీఎం జగన్‌ స్వయంగా వెళ్లి బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం వారిని అన్ని విధాల ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు సీఎం జగన్‌. అయితే ఇలా రైలు ప్రయాణంలో ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులకు రూ. 10 లక్షల బీమా వర్తిస్తుందని మీకు తెలుసా.. మరి ఇప్పుడు విజయనగరం ప్రమాద బాధితులకు ఈ బీమా వస్తుందా.. లేదా.. వర్తిస్తే ఎలా క్లెయిం చేసుకోవాలి వంటి వివరాలు..

ఐఆర్‌సీటీసీలో టికెట్‌ బుక్‌ చేసుకుంటే..

మన దేశంలో నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు.. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీఈసీ) ద్వారా ట్రైన్ టికెట్లను బుక్ చేసుకుంటుంటారు. ఇలా టికెట్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరూ రూ. 10 లక్షల ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు పొందొచ్చు. అయితే గతంలో ఇది అందరికి వర్తించేది కాదు. కేవలం టికెట్ బుక్ చేసుకునే సమయంలో.. ప్రమాద బీమా ఆప్షన్‌ను ఎంచుకున్న వారికి మాత్రమే ఇది వర్తించేది.

అయితే టికెట్ బుక్ చేసుకునే హాడావుడిలో.. దీనిని ఎంపిక చేసుకోవడం మర్చిపోతుంటారనే ఉద్దేశంతో.. తర్వాత ఐఆర్‌సీటీసీ చిన్న మార్పు చేసింది. ఈ బీమా సదుపాయాన్ని డీఫాల్ట్ చేసింది. అంటే టికెట్‌ బుక్‌ చేసుకునే ప్రయాణికులు అందరికీ ఈ బీమా సదుపాయం అందించాలన్న ఉద్దేశంతో.. ఈ నిర్ణయం తీసుకుంది.

35 పైసలకే రూ.10 లక్షలు..

ఐఆర్‌సీటీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో.. ప్రస్తుతం ఈ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే సమయంలో ట్రావెల్ ఇన్సూరెన్స్ బీమా ఆప్షన్ పక్కన టిక్ బాక్స్ ప్రత్యేకంగా ఎంచుకోవాల్సిన పని లేదు. ఒవకేళ ఈ ప్రయోజనాలు వద్దనుకున్న వారు మాత్రం టిక్ బాక్స్ తీసేయొచ్చు. ఈ ఆప్షన్ ఎంచుకున్న వారికి కేవలం 35 పైసలు కట్ అవుతాయంతే. భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) రూల్స్ ప్రకారం.. ఏ సంస్థ కూడా బీమా డీఫాల్ట్‌గా ఇవ్వదు. కేవలం ఐఆర్‌సీటీసీకి మాత్రమే ఈ అవకాశం కల్పించింది.

ఎంత మొత్తం వస్తుందంటే..

  1. ఈ ఆప్షన్‌ను ఎంచుకున్న ప్రయాణికులకు ప్రమాద బీమా కింద గరిష్టంగా రూ. 10 లక్షల బీమా సదుపాయం లభిస్తుంది.
  2. రైలు ప్రమాదంలో మరణించినా లేదా.. శాశ్వతంగా అంగవైకల్యం ఏర్పడి ఏ పని చేయలేని పరిస్థితి ఉంటే ఆ బాధిత కుటుంబాలకు రూ. 10 లక్షలొస్తాయి.
  3. తీవ్రంగా గాయపడి.. వైకల్యం ఏర్పడినప్పుడు రూ. 7.5 లక్షల వరకు బీమా డబ్బులు అందుతాయి.
  4. ఇక గాయపడ్డ వారికి వైద్య ఖర్చుల కోసం రూ. 2 లక్షల వరకు అందిస్తారు.

బీమా పాలసీ కింద ప్రయాణికులు నామినీ వివరాలు యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని క్లెయిమ్‌ చేసుకోవాలనుకునేవారు.. సంబంధిత పత్రాల్ని తీసుకొని దగ్గరలో ఉన్న బీమా సంస్థను సంప్రదించాలి. ఏ సంస్థ బీమా ఇస్తుందనే వివరాల్ని ఐఆర్‌సీటీసీ ద్వారా పొందవచ్చు. ప్రమాదం జరిగిన 4 నెలల్లోగా బీమా తీసుకున్న వ్యక్తి, నామినీ ఈ ప్రయోజనాల్ని పొందుతారు. అయితే ఒకవేళ నామినీ వివరాలు అందించకపోయినా.. లేదా నామినీ వ్యక్తి చనిపోయినా.. వారసులు ఈ బీమా ప్రయోజనాలు పొందవచ్చు. కాకపోతే ప్రాసెస్‌ కాస్త ఆలస్యం అవుతుంది.

గతంలో ఒడిశా రైలు ప్రమాదంలో బాధితులు ఈ బీమా డబ్బుల్ని అందుకున్నారు. కాబట్టి ప్రస్తుతం విజయనగరం రైలు ప్రమాదంలో మృతి చెందిన వారు, గాయపడ్డ వారిలో ఎవరైనా ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే.. వారు, వారి కుటుంబ సభ్యులు ఈ బీమా సదుపాయం పొందగల్గుతారు.

Show comments