Reliance: షాకిచ్చిన అంబానీ.. 42 వేల మందికిపైగా ఉద్యోగులు అవుట్‌.. అసలేం జరిగింది

Reliance Industries Workforce: రిలయన్స్‌ ఇండస్ట్రీ నుంచి 42 వేల మందికి పైగా ఉద్యోగులు బయటకు వెళ్లారు. ఎందుకంటే..

Reliance Industries Workforce: రిలయన్స్‌ ఇండస్ట్రీ నుంచి 42 వేల మందికి పైగా ఉద్యోగులు బయటకు వెళ్లారు. ఎందుకంటే..

మన దేశంలోనే కాక అంతర్జాతీయంగా కూడా ఐటీ కంపెనీల్లో తీవ్ర అస్థిరత నెలకొని ఉంది. దాంతో చాలా కంపెనీలు.. ఖర్చులను తగ్గించుకోవడం కోసం.. ఉద్యోగులను తొలగిస్తున్నాయి. వీటిల్లో టాప్‌ ఎంఎన్‌సీలు కూడా ఉండటం గమనార్హం. తాజాగా డెల్‌ 12,500 మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఐటీ రంగానికే పరిమితమైన ఈ సంక్షోభం.. ఇప్పుడు మిగతా రంగాలకు షాకిస్తోంది. వేర్వేరు రంగాల్లోని సంస్థలు కూడా అక్కడ కూడా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అయితే అనూహ్యంగా ఈ జాబితాలో.. ప్రపంచ కుబేరుడు.. ఇండియాలోనే అత్యంత ధనవంతుడు అయిన ముఖేష్‌ అంబానీ సంస్థ రిలయన్స్‌ కూడా చేరింది. ఏకంగా 42 వేల మందికి ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. అసలేం జరిగింది.. ఎందుకు ఇంత భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందంటే..

రిలయన్స్ ఇండస్ట్రీస్.. దేశంలోని అతిపెద్ద సంస్థ మాత్రమే కాక.. ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేసే సంస్థల్లో ఇదొకటిని చెప్పవచ్చు. ఇంత పెద్ద కంపెనీలో కిందటి ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 42 వేల మందికి పైగా ఉద్యోగులు తగ్గారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. టాప్‌ మోస్ట్‌ ఎంఎన్‌సీల నుంచి కూడా ఉద్యోగులు భారీ సంఖ్యలో బయటకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కూడా చేరింది. ఇక్కడ ఏడాది వ్యవధిలో 42,052 మంది ఉద్యోగులు సంస్థ నుంచి బయటకు వెళ్లారు. ఇలా వెళ్లిన వారిలో కొందరు ఇతర సంస్థలకు మారగా.. మరి కొందరిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఇక స్వచ్ఛందంగా రాజీనామాలు చేసిన వారి సంఖ్య అంతకు ముందుతో పోలిస్తే ఈ ఏడాది తగ్గిందని సంస్థ పేర్కొంది. రిలయన్స్‌ వార్షిక నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది.

దీని ప్రకారం.. రిలయన్స్ సంస్థలో 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఉద్యోగుల సంఖ్య 3,47,362 గా ఉంది. అంతకుముందు ఏడాది ఈ సంఖ్య 3,89,414 కావడం గమనార్హం. అంటే ఈ సంవత్సరం ఉద్యోగుల సంఖ్య తగ్గింది అన్నమాట. అయితే ఆయిల్ నుంచి టెలికాం వరకు విస్తరించిన రిలయన్స్ సంస్థలో.. ఎక్కువగా రిటైల్ నుంచే ఉద్యోగులు తగ్గడం గమనార్హం. మొత్తం తగ్గిన 42 వేల మంది ఉద్యోగుల్లో సుమారు 38 వేల మందికిపైగా రిటైల్ నుంచే ఉన్నారు. అయితే రిటైల్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉద్యోగాలు మారుతుంటారని.. ఇదే ప్రభావం చూపిందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చెప్పుకొచ్చింది. ఇక జియోలో 43 శాతానికిపైగా నాన్-రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారని.. ఇందులో కాంట్రాక్ట్, పార్ట్ టైమర్స్, అప్రెంటిస్, ఇంటర్న్స్ ఎక్కువగా ఉన్నారని వార్షిక నివేదికలో ప్రకటించింది.

ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మొత్తం కొత్తగా 1.71 లక్షల కొత్త ఉద్యోగుల్ని నియమించుకుంది. దీంతోనే సంస్థలో ఉద్యోగుల సంఖ్య 3.48 లక్షలకు చేరుకుంది. ఇక్కడ విశేషం ఏంటంటే.. దాదాపుగా సగం కంటే ఎక్కువ మంది ఉద్యోగులు 30 సంవత్సరాలలోపు వారే ఉండగా.. వీరిలో సుమారు 21.4 శాతం మంది మహిళలే ఉండటం గమనార్హం. ఇక కొత్తగా నియమించుకున్నవారిలోనూ 81.8 శాతం 30 ఏళ్ల లోపువారే ఉండగా.. వీరిలో కూడా సుమారు 24 శాతం మహిళా ఉద్యోగులు ఉన్నారని నివేదిక వెల్లడించింది. అయితే ఉద్యోగం నుంచి బయటకు వస్తోన్న వారిలో కూడా 30 ఏళ్ల లోపే వారే ఎక్కువగా ఉండటం కొసమెరుపు

Show comments