టమాటా ధరలపై కేంద్ర కీలక ప్రకటన.. భారీగా దిగి వచ్చే అవకాశం

టమాటా ధరలపై కేంద్ర కీలక ప్రకటన.. భారీగా దిగి వచ్చే అవకాశం

పది రోజుల క్రితం వరకు టమాటా ధర చుక్కలను తాకింది. కిలో ధర ఏకంగా 200 రూపాయల పైగా చేరింది. పెరిగిన ధరలు చూసి సామాన్యులు టమాటాను కొనడమే మానేశారు. జనాలను భయపెట్టిన టమాటా ధర.. రైతులను మాత్రం లక్షాధికారులను చేసింది. ఈ ఏడాది టమాటా విక్రయం ద్వారా.. చాలా మంది రైతులు రోజుల వ్యవధిలో కోట్ల రూపాయలు సంపాదించారు. గరిష్టాలకు చేరిన టమాటా ధర.. ప్రస్తుతం దిగి వచ్చింది. మార్కెట్‌లో కిలో టమాటా 50-60 రూపాయలు పలుకుతుంది. ఈ క్రమంలో టమాటా రేటును మరింత తగ్గించడం కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దాంతో టమాటా ధర మరింత దిగి వచ్చే అవకాశం ఉంది. ఆ వివరాలు..

టమాటా ధరలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (ఎన్‌సీసీఎఫ్‌), జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్యలకు (ఎన్‌ఏఎఫ్‌ఈడీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. రిటైల్ వినియోగదారులకు టమాటాలు కిలో రూ. 40 చొప్పున విక్రయించాలని కేంద్రం స్పష్టం చేసింది ఆగస్ట్ 20 (ఆదివారం) నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో టమాటా కొనుగోలుదారులకు భారీ ఊరట లభించనుందని చెప్పొచ్చు. టమాటా ధరలు పెరిగినప్పటినుంచి తగ్గించేందుకు.. కేంద్రం పలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

హోల్‌సేల్ రేట్లు (టోకు ధరలు) తగ్గుతుండటంతో కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్‌సీసీఎఫ్‌, ఎన్‌ఏఎఫ్‌ఈడీలు .. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, రాజస్థాన్‌లోని.. జైపూర్, కోటా.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూ, వారణాసి, కాన్పుర్, ప్రయాగ్‌రాజ్‌ల్లో.. బిహార్‌లోని పట్నా, ముజఫర్‌పుర్, అర్రా, బక్సర్‌ల్లో టమాటాలు విక్రయిస్తున్నాయి. తొలుత ఎన్‌సీసీఎఫ్, ఎన్‌ఏఎఫ్‌ఈడీ సేకరించిన టమాటాల ధర కేజీకి రూ. 90 గా ఉండేది. అయితే హోల్‌సేల్ రేట్లు తగ్గుతున్న క్రమంలోనే ఈ ఫిక్స్‌డ్ రేటును కూడా తగ్గిస్తూ వచ్చింది. ఈ రిటైల్ ధర చివరిగా ఆగస్ట్ 15న కిలోకు రూ.50కి తగ్గించాయి. ఇక ఆదివారం నుంచి 40 రూపాయలు దిగి రానుంది. కేంద్ర నిర్ణయం పట్ల జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Show comments