ప్రస్తుతం ఒక్క భారతదేశంలోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా అందరినీ వేధిస్తున్న సమస్య నిరుద్యోగం. చదువుకున్న చదువుకు సరైన ఉద్యోగం దొరక్క కొందరు, అసలు నెల జీతం వచ్చే ఉద్యోగం లేక కొందరు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ ఉద్యోగుల పరిస్థితిత అగమ్యగోచరంగా మారడం చూశాం. ఖర్చుల నియంత్రణ, ఆర్థికమాంద్యాన్ని ఎదుర్కోవాలి అంటూ వేల సంఖ్యలో ఉద్యోగులను ఇళ్లకు పంపేశారు. చిన్న చిన్న స్టార్టప్స్ మాత్రమే కాకుండా.. పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు కూడా ఏళ్ల తరబడి పని చేసిన ఉద్యోగులను లేఆఫ్స్ పేరిట గెంటేశాయి.
రాను రాను ఈ పరిస్థితులు మరింత దారుణంగా మారుతాయంటూ ఇప్పటి నుంచే వార్తలు కూడా వస్తున్నాయి. జాబ్ మార్కెట్ ఎంత దారుణంగా ఉందో చెప్పేందుకు ఒక ఉదాహరణ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బెంగళూరుకు చెందిన ఒక స్టార్టప్ సీఈవో చేసిన ట్వీట్ అందరినీ ఆలించపజేయడం మాత్రమే కాకుండా.. భయాందోళనకు కూడా గురి చేస్తోంది. వాళ్లు చేసిన ఒక జాబ్ ఆఫర్ కు వచ్చిన రెజ్యూమ్స్ చూసి నోరెళ్లబెట్టాల్సి వచ్చింది.
బెంగళూరుకు చెందిన ఒక స్ప్రింగ్ వర్కస్ అనే స్టార్టప్ కంపెనీలో జాబ్ ఆపర్చునిటీ ఉందని తమ వెబ్ సైట్ లో ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటనకు విశేష స్పందన వచ్చింది. ఆ విషయాన్ని ఉంటకిస్తూ ఆ కంపెనీ సీఈవో జాబ్ మార్కెట్ కి సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తూ.. ట్వీట్ చేశారు. “మేము మా వెబ్ సైట్ లో ఒక జాబ్ కి సంబంధించి ప్రకటన చేశాం. కేవలం 48 గంటల్లోనే 3000 రెజ్యూమ్స్ వచ్చాయి. జాబ్ మార్కెట్ మరీ ఇంత దారుణంగా ఉందా?” ఆశ్చర్యపోయారు. ఇంతకీ వాళ్లు ఏ పోస్టు కోసం ప్రకటన ఇచ్చారంటే.. సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్ పోస్టు కోసం చేశారు. ఈ జాబ్ కు రిమోట్ వర్క్ ఆప్షన్ కూడా ఉంది. ఆ జాబ్ కోసం 12 వేలకు పైగా రెజ్యూమ్స్ వచ్చినట్లు రిప్లైస్ లో వెల్లడించారు.
ఈ ప్రకటన వాళ్లు కేవలం వారి వెబ్ సైట్ లో మాత్రమే పబ్లిష్ చేశారు. ఇంకా ఎలాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో కూడా పోస్ట్ చేయలేదు. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉండటమే ఇంతటి స్పందనకు కారణంగా కంపెనీ భావిస్తోంది. ఎంత రిమోట్ వర్క్ ఆప్షన్ ఉన్నా.. అన్ని రెజ్యూమ్స్ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంక ఈ ట్వీట్ కాస్తా ట్విట్టర్ లో తెగ వైరల్ అయింది. నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జాబ్ మార్కెట్ ఎలా ఉంది? ఉద్యోగాల కోసం ఎంతగా పోటీ పడుతున్నారు? అనే ప్రశ్నలకు ఈ సంఘటన అద్దం పడుతోంది. మరింత గడ్డు పరిస్థుతులూ కూడా చూడాల్సి వస్తుందని కొందరు హెచ్చరిస్తున్నారు.
Received over 3K resumes in the last 48 hours just on our website – how bad is the job market?
— Kartik Mandaville (@kar2905) July 16, 2023