iDreamPost
android-app
ios-app

ఆ గ్రామంలో వరుస మరణాలు.. అసలేం జరుగుతుందీ?

  • Published Nov 16, 2024 | 2:50 PM Updated Updated Nov 16, 2024 | 4:04 PM

Mulugu District: వ‌రుస మ‌ర‌ణాల‌తో ఆ గ్రామంలో ప్రజలు భ‌యాందోళ‌నకు గురవుతున్నారు. అంతు చిక్కని మాయరోగం ఊళ్లో వాళ్లను కబలిస్తుంది. రోజు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు.

Mulugu District: వ‌రుస మ‌ర‌ణాల‌తో ఆ గ్రామంలో ప్రజలు భ‌యాందోళ‌నకు గురవుతున్నారు. అంతు చిక్కని మాయరోగం ఊళ్లో వాళ్లను కబలిస్తుంది. రోజు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు.

ఆ గ్రామంలో వరుస మరణాలు.. అసలేం జరుగుతుందీ?

త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన ఖలేజా సినిమా గుర్తుందా. ఆ సినిమా కథ ఓ మారుమూల పల్లె పాలి అనే గ్రామం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. గ్రామంలో జరిగే వరుస మరణాలు గ్రామస్థులను కలవర పెడుతూ ఉంటాయి. అప్పటి వరకూ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు అంతు చిక్కని కారణాలతో కళ్ల ముందే ప్రాణాలు కోల్పోతుంటారు. తెలంగాణలో అచ్చం అలాంటి సమస్యనే ములుగు మండ‌లం జంగాల‌ప‌ల్లి ప్రజలు ఎదుర్కొంటున్నారు. గత నెల నుంచి ఈ గ్రామంలోని ప్రజలు ముఖ్యంగా 30 నుంచి 50 ఏళ్ళ‌లోపు వయసు వాళ్లు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటి వరకు జంగాల‌ప‌ల్లిలో 20 మంది మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. రాత్రి అయితే చాలు గుండె చిక్కబట్టుకొని బతకాల్సి వస్తుందని వాపోతున్నారు. గ్రామానికి అరిష్టం దాపురించిందని కొందరు.. అనారోగ్యం కారణంగా చనిపోతున్నారని మరికొంతమంది వాదిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

ములుగు జిల్లా జంగాలపల్లిలో నివసిస్తున్న ప్రజలు భయానకమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కారణాలు ఏవైనా చిన్న, పెద్దా తేడా లేకుండా భయంతో వణికిపోతున్నారు. రాత్రి అయితే చాలు ఇంటి ముందు లైట్లు, ఇంటికి తాళాలు వేసుకొని ఇంట్లోనే బిక్కు బిక్కు మంటూ కాలం వెల్లదీస్తున్నారు. గ్రామంలో గత నెల నుంచి ఉన్నట్లు మరణాల సంఖ్య పెరుగుతుందని గ్రామస్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు తమ గ్రామంలో 20 మంది చనిపోగా అందులో చాలా వరుకు యుక్త వయసు ఉన్నవాళ్లు ఉండటం కలవరపెడుతుందని అంటున్నారు. ఊరికి ఏదో అరిష్టం పట్టిందని? చనిపోయిన వారికి చేతబడి చేశారని? ఇలా రక రకాల ప్రచారాలు గ్రామంలో జరుగుతున్నాయి. తమ గ్రామానికి కీడు పట్టిందని.. గ్రామ దేవతలకు శాంతి పూజలు చేయాలని గ్రామస్థులు అంటున్నారు. ఈ విషయం గురించి గ్రామస్థులు మాట్లాడుతూ.. మా ఊరిలో గత నెల నుంచి వరుసగా చనిపోతున్నారు. హాస్పిటల్ కు తీసుకుపోతే.. తిరిగి వస్తారన్న నమ్మకం లేకుండా పోయింది. పోయేటపుడు మనుషులుగా వెళ్తున్నారు.. వచ్చేటపుడు శవాలుగా వస్తున్నారు.

ఊళ్లో ఏదో దిరుగుతుందని, గ్రామ దేవతను శాంతి పర్చాలని అంటున్నారు. మేం దేవతలకు మొక్కుతం.. మొక్కుబడులు చెల్లిస్తూనే ఉన్నాం. గ్రామస్థులు ఇలా చనిపోవడానికి అంతు చిక్కని జబ్బులే కారణమని.. గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఇప్పటికైనా అధికారులు గ్రామాన్ని సందర్శించి ప్రజలకు మనోధైర్యం కలిగేలా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఇదిగో పులి అంటే అదిగో తోక అనే కాలం.. మంచి కన్నా చెడు ఎక్కువ ప్రచారం జరుగుతుంది. కొంతమంది దీన్ని క్యాష్ చేసుకునేందుకు గ్రామంలో దుష్ట శక్తి ఉందని శాంతి పూజలు చేయాంటూ డబ్బులు వసూళ్లు చేసే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ గ్రామానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి అధికారులు ఇప్పటికైనా స్పందించి గ్రామ ప్రజలు భయాలను తొలగించి మెరుగైన వైద్య సేవలు అందేలా చేయాలని కోరుతున్నారు.