iDreamPost
android-app
ios-app

పవన్‌ కళ్యాణ్‌పై ఫిర్యాదు.. వాలంటీర్‌ రంగవల్లి వాంగ్మూలం రికార్డు చేసిన కోర్టు

  • Published Aug 19, 2023 | 12:36 PM Updated Updated Aug 19, 2023 | 12:36 PM
  • Published Aug 19, 2023 | 12:36 PMUpdated Aug 19, 2023 | 12:36 PM
పవన్‌ కళ్యాణ్‌పై ఫిర్యాదు.. వాలంటీర్‌ రంగవల్లి వాంగ్మూలం రికార్డు చేసిన కోర్టు

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌.. వాలంటీర్ల మీద చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాలంటీర్లు.. రాష్ట్రంలోని ఒంటరి మహిళల సమాచారాన్ని సేకరించి సంఘ విద్రోహ శక్తులకు చేరవేస్తున్నారంటూ సంచలన ఆరోణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్‌ వ్యాఖ్యలు తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించాయని విజయవాడ శాంతినగర్‌కు చెందిన వలంటీర్‌ రంగవల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు స్పందిచకపోవడంతో.. తాజాగా ఆమె న్యాయమూర్తి ఎదుట తన ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో వలంటీర్‌ రంగవల్లి నేరుగా విజయవాడ మెట్రోపాలిటన్‌ మేజ్రిస్టేట్‌ కోర్టు న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం న్యాయమూర్తి.. రంగవల్లి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఆమె తరఫు న్యాయవాది ఒగ్గు గవాస్కర్, మరో 25 మంది న్యాయవాదుల సమక్షంలో కోర్టు హాల్లో గంటన్నరపాటు రంగవల్లి వాంగ్మూలాన్ని న్యాయమూర్తి సేకరించారు.

‘‘పవన్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలు అన్ని దినపత్రికలు, వార్తా చానళ్లు, ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగాం, ట్విట్టర్‌లలో వచ్చాయి. పవన్‌ వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని నేను నివాసం ఉంటున్న, విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతంలో కొందరు సూటిపోటి మాటలంటూ నన్ను విమర్శిస్తూ.. వేధిస్తున్నారని’’ ఆవేదన వ్యక్తం చేసింది.

అంతేకాక తన పిల్లలను స్కూల్‌కి తీసుకెళ్లేటప్పుడు కొందరు యువకులు తనని వేధిస్తున్నారని.. రంగవల్లి న్యాయమూర్తి ముందు వాపోయింది. తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించి సమాజంలో మర్యాద లేకుండా చేసిన పవన్‌ కళ్యాణ్‌పై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె వేడుకుంది. రంగవల్లి నుంచి పూర్తి సమాచారం సేకరించిన న్యాయమూర్తి విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేశారు. ఆ రోజు మిగిలిన సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించారు.