ఈ రోజుల్లో సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగింది. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా యాప్స్‌ను వాడుతున్నారు. అయితే ఉపయోగాలు ఎక్కువగా ఉన్నప్పటికీ వీటిని జాగ్రత్తగా వినియోగించాలి. సమాచారాన్ని సేకరించడంతో పాటు షేర్ చేసుకోవడానికి ఒక వేదికగా వాడుకోవాలి. అంతేగానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మాత్రం అడ్డంగా బుక్కైనట్లే. ఇప్పుడు ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం పార్టీ నేతలది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్, రిమాండ్‌ను నిరసిస్తూ పలువురు సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయారు.
కొంతమందైతే ఏకంగా సోషల్ మీడియా వేదికగా జడ్జి హిమబిందుతో పాటు పలువురు లాయర్లను ట్రోల్ చేశారు. జడ్జి హిమబిందుతో పాటు న్యాయవాదులను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడాన్ని జగన్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై ఏజీ శ్రీరామ్ ఏపీ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశం మీద బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. అనంతరం క్రిమినల్ కంటెప్ట్ పిటిషన్లో 26 మందికి నోటీసులు ఇవ్వాలని కోర్టు నిర్ణయించింది. టీడీపీ నేత బుద్ధా వెంకన్న సహా 26 మందికి నోటీసులు ఇవ్వాలని డిసైడ్ అయింది. ట్రోల్ చేసిన సోషల్ మీడియా అకౌంట్స్‌ను పరిశీలించి.. 26 మందికి నోటీసులు ఇవ్వాలని డీజీపీకి ఏపీ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ట్విట్టర్, ఫేస్బుక్, బుద్ధా వెంకన్న సహా 26 మందిని ప్రతివాదులుగా చేర్చింది ప్రభుత్వం. ఇద్దరు హైకోర్టు జడ్జీలతో పాటు ఏసీబీ జడ్జి ఫ్యామిలీలను టార్గెట్ చేసి ట్రోలింగ్ చేశారని ఏజీ వాదనలు వినిపించారు. ఇక, స్కిల్ స్కాం కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అయితే బాబు అరెస్ట్‌పై టీడీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోశారు. దీంతో బాబు అరెస్ట్ అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు, దిగువ కోర్టు జడ్జిల మీద దూషణల వ్యవహారంలో క్రిమినల్ కంటెప్ట్ను హైకోర్టు డివిజన్ బెంచ్ ముందుకు తీసుకెళ్లారు.
ఇదీ చదవండి: బాబు అరెస్ట్‌పై స్టాండప్ కమెడియన్ సెటైర్లు!