చిత్తూరు జిల్లాలోని పుంగనూరు పోలీసు స్టేషన్లో శుక్రవారం జరిగిన ఒక ఘటన ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పుంగనూరు పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. ఆ పార్టీ కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. కొందరు టీడీపీ కార్యకర్తలు అంతటితో ఆగకుండా పోలీసుల వాహనాలను ధ్వంసం చేసి, వాటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనకు సంబంధించి 30 మంది తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదు చేశామని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. అయితే ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని తెలిపారు. వారందర్నీ గుర్తించే పనిలో ఉన్నామని చెప్పారు.
ఆ 30 మందిపై ఐపీసీ 147, 148, 332, 353, 128బీ కింద ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడం, సర్కారు అధికారుల మీద దాడులకు దిగడం, విధినిర్వహణలో ఉన్నప్పుడు దాడులు, దొమ్మీ, ముందస్తు ప్రణాళికతోనే దాడి అభియోగాలను మోపారు. పుంగనూరు ఘటనపై ఇన్వెస్టిగేషన్ చేయాలని డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ రిషాంత్లను డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దాడిలో పోలీసులు గాయపడ్డారని.. వెహికల్స్ను కూడా ఉద్దేశపూర్వకంగానే తగులబెట్టారని డీజీపీ అన్నారు. ఈ దాడి ఘటనలో రాళ్లు రువ్విన వారితో పాటు వాహనాలకు నిప్పు పెట్టిన వారందర్నీ గుర్తించామని ఆయన తెలిపారు.
పుంగనూరు ఘటనకు సంబంధించి సీసీ కెమెరా ఫుటేజీని విశ్లేషిస్తున్నామని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలాగే అనుమానం ఉన్న మరికొందరి కదలికలపై నిఘా పెట్టామన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రూట్ ప్లాన్ మార్పు వ్యవహారం పైనా విచారణ జరుగుతోందని.. దీని వెనుక ఎవరు ఉన్నారో ప్రాథమిక సమాచారం తమ వద్ద ఉందన్నారు డీజీపీ. రెచ్చగొట్టే ప్రసంగాల మీద కూడా తాము దృష్టి పెట్టామని ఆయన పేర్కొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు.