Arjun Suravaram
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కి ఓటమి భయం పట్టుకుందనే టాక్ వినిపిస్తోంది. అందుకే ఇటీవల విడుదల చేసిన జాబితాలో తన పేరను ప్రకటించలేదు. భీమవరం నుంచి పిఠాపురంకి పవన్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. అందుకు గల కారణాలు ఏమింటంటే..
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కి ఓటమి భయం పట్టుకుందనే టాక్ వినిపిస్తోంది. అందుకే ఇటీవల విడుదల చేసిన జాబితాలో తన పేరను ప్రకటించలేదు. భీమవరం నుంచి పిఠాపురంకి పవన్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. అందుకు గల కారణాలు ఏమింటంటే..
Arjun Suravaram
త్వరలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అధికార వైస్సార్ సీపీ 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. అలానే ఎలాగైనా సీఎం జగన్ గెలుపు ఆపాలని ప్రత్యర్థి పార్టీలైన టీడీపీ, జనసేన విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వైఎస్సార్ సీపీ జాబితాలను విడుదల చేసిన తరువాత ఈ రెండు పార్టీలు ఉమ్మడి జాబితాను విడుదల చేశాయి. ఇక్కడ జనసేనకు కేటాయించిన సీట్లపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక్కడ మరొక ఆసక్తికర విషయం ఏమిటంటే.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానాన్ని ప్రకటించలేదు. దీంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రానున్న ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నసంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల ఇరుపార్టీల అధినేతలు కలిసి ఉమ్మడి అభ్యర్థుల తొలిజాబితాను ప్రకటించారు. 118 స్థానాలతో తొలి లిస్టును ప్రకటించిన ఈ పార్టీలు.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మొత్తంగా జనసేన 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు కేటాయిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. తొలి జాబితాలో 94 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించగా.. అందులో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, బాలకృష్ణ పేర్లు ఉన్నాయి. అలానే జనసేన కేవలం ఐదు స్థానాల్లో మాత్రమే తమ అభ్యర్థులను ప్రకటించింది. అందులో నాదెండ్ల మనోహర్ పేరు తప్ప.. పవన్ కల్యాణ్ పేరు రాలేదు. దీంతో అసలు పార్టీ అధ్యక్షుడు పోటీ చేసే స్థానంపై తొలి జాబితాలో పేరు లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
టీడీపీకి చెందిన ప్రధాన నేతలు అందరూ తాము పోటీ చేసే స్థానాలను ప్రకటించగా.. పవన్ కళ్యాణ్ మాత్రం ప్రకటించలేదు. తొలి జాబితాలో భీమవరం నుంచి పవన్ కల్యాణ్ పేరు వినిపిస్తోందని అందరూ భావించారు. కానీ తొలి జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన భీమవరం నుంచి పోటీ చేయడం లేదని, పిఠాపురంకి వెళ్లే ఆలోచనలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. అందుకు గల కారణాలు కూడా పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తున్నాయి.
కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు పవన్ నిర్ణయించుకున్నారని సమాచారం. పిఠాపురం నియోజకవర్గంలో కాపుల ఓట్లు 90 వేలకు పైగా ఉండడం ప్రధాన కారణమని తెలుస్తోంది. ఆ నియోజకవర్గంలోని ఓటర్లలో సగం మంది కాపులే అని పవన్ గుర్తించారు. దీంతో అక్కడ తన గెలుపు సునాయాసమని ఆయన నమ్ముతున్నారని టాక్. 2019లో భీమవరం నుంచి పోటీ చేసి.. వైఎస్సార్ సీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ చేతిలో ఓడిపోయారు. ఈ సారి కూడా ఇక్కడి నుంచి పోటీ చేయాలని తొలుత భావించినా.. పవనన్ కి ధైర్యం సరిపోవడం లేదని టాక్. ఈ సారి కూడా భీమవరం నుంచి పోటీ చేస్తే.. గెలిచే అవకాశం ఉందని జనసేన నేతలు బలంగా చెబుతున్నారు. అయితే పవన్ కల్యాణ్ కి మాత్రం ఆ నమ్మకం లేదంట.
మరోసారి వైసీపీ అభ్యర్థిగా గ్రంధి శ్రీనివాస్ పోటీ చేయనున్నారు. అంతేకాక శ్రీనివాస్ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత. ఆయనకు కాపుల్లో బలమైన పట్టు ఉంది. దీంతో ఆ వర్గానికి చెందిన ఓట్లు గ్రంధికి ఎక్కువ సంఖ్యలో వెళ్లే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అలానే భీమవరంలో తాను పోటీ చేస్తే.. తన సామాజికవర్గ ఓట్లు చీలడంతో పాటు క్షత్రియులు, ఇతర సామాజిక వర్గాలు తనకు వ్యతిరేకంగా ఓటు వేస్తాయని పవన్ భయపడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. 2024 ఎన్నికలు రాజకీయంగా తనకు చావు బతుకుల సమస్య కావడంతో భీమవరంలో ప్రయోగానికి పవన్ వెనకడుగు వేస్తున్నారని టాక్.
భీమవరం కంటే పిఠాపురం సురక్షితమైన సీటు అని పవన్ భావించినట్లు తెలుస్తోంది. రాష్ట్రం మొత్తంలో పిఠాపురం కంటే తనకు గెలుపుపై నమ్మకం కలిగించే మరో నియోజకవర్గం పవన్ కళ్యాణ్ కి కనిపించలేదంట. ఇక్కడ అత్యధిక కాపులు ఉండడంతో, వారిపై గెలుపు భారాన్ని వేసి పోటీ చేయాలని పవన్ నిర్ణయించినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. తాను కులాలు, మతాలకు అతీతమని పదే పదే చెబుతుండే పవన్.. గెలుపు కోసం మాత్రం తన సామాజిక వర్గం ఉండే ప్రాంతం వైపే చూడటంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.