జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏలూరు సభలో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఆ సభలో ఆయన ప్రసంగిస్తూ వాలంటీర్లపై చేసిన కామెంట్స్ మీద రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఆయనకు వ్యతిరేకంగా వాలంటీర్లు నిరసనలు, ధర్నాలు చేపట్టారు. జనసేనాని వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ వ్యాఖ్యలపై మహిళా కమిషన్‌కు కంప్లయింట్ చేశారు. దీంతో మహిళా కమిషన్ పవన్‌కు నోటీసులు పంపింది. పవన్ తన వ్యాఖ్యలపై 10 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసింది.
పవన్ కల్యాణ్ కామెంట్స్‌కు వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా వాలంటీర్లు నిరసనలు చేపట్టారు. కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, ఆందోళనలు నిర్వహించారు. జనసేనాని తమకు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. పవన్ వ్యాఖ్యలు తమను ఎంతగానో బాధించాయని.. మహిళలమే ఎక్కువమంది వాలంటీర్లుగా పనిచేస్తున్నామని చెబుతున్నారు. పవన్ కామెంట్స్‌పై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్‌ను కోరామన్నారు. పవన్ వ్యాఖ్యల వివాదం మీద రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ సీరియస్ అయ్యారు.
ఏపీలో విచారణ జరుగుతున్న మహిళల అదృశ్యం కేసులు 1,400 మాత్రమేనని.. పవన్ చెబుతున్న 30 వేల సంఖ్య ఎక్కడిదని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ఏ కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఆయనకు చెప్పారని క్వశ్చన్ చేశారు. దీనికి పవన్ సమాధానం ఇవ్వాలని లేదా తప్పు మాట్లాడానని అంగీకరించి మహిళలకు సారీ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ‘టీనేజ్ అమ్మాయిల అదృశ్యానికి మీరు చేస్తున్న సినిమాలు కారణం కాదా? కాలేజీ ప్రేమ పేరుతో మీరు తీసే సినిమాలు సమాజంపై ఎంత ప్రభావం చూపిస్తున్నాయో తెలీదా? నిస్వార్థంగా పనిచేస్తున్న వాలంటీర్లను పట్టుకొని సంఘ విద్రోహ శక్తులని మాట్లాడుతారా? ఈ మిస్సింగ్ కేసుల్లో పవన్ కల్యాణ్, ఆయన సినిమాల పాత్రేంటి?’ అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. వాలంటీర్లను ఉద్దేశించి పవన్ చేసిన కామెంట్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.