iDreamPost
android-app
ios-app

పొత్తు వల్ల కూలిన మరో జనసేన వికెట్! పవన్ ఇకనైనా మేలుకో!

పొత్తు వల్ల కూలిన మరో జనసేన వికెట్! పవన్ ఇకనైనా మేలుకో!

జనసేన పార్టీకి మరో షాక్ తగిలింది.  ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న జనసేన పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తప్పడంలేదు. ముఖ్యంగా టీడీపీతో పొత్తు ప్రకటించిన దగ్గర నుంచి జనసేన పార్టీలో అనేక మార్పులు జరుగుతున్నాయి. పొత్తులు ప్రకటించిన అనంతరమే నాల్గో విడత వారాహి విజయ యాత్రను పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లాలో విజయవంతం చేశారు. అయితే ఇదే సమయంలో వరుస రాజీనామాలు పార్టీకి ఇబ్బందిగా మారాయి. కొన్ని రోజుల క్రితం వివిధ కారణాలతో  కల్యాణ్ దిలీప్ సుంకర్ పార్టీ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అలానే నిన్నటికి నిన్న పిఠాపురం జనసేన ఇన్ ఛార్జీ మాకినీడి శేషు కుమారి రాజీనామా చేశారు. ఈ దెబ్బ నుంచి కోలుకోక ముందే జనసేన పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలిగింది. నెల్లూరు జిల్లాకు చెందిన జనసేన కీలక నేత రాజీనామా చేశారు.

నెల్లూరు సిటీకి  చెందిన జనసేన నేత కేతం రెడ్డి వినోద్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.  అంతేకాక జనసేన పార్టీకి రాజీనామా చేయడంతో పాటు రేపు ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు అర్బన్ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా  పోటీ చేసిన వినోద్ రెడ్డి ఓడిపోయారు.  ఆ తరువాత  కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అయితే కొంతకాలం నుంచి తనను పార్టీ కార్యక్రమాలకు దూరంగా పెడుతున్నారని కేతంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

జనసేన పార్టీకి ఆయన రాసిన రాజీనామా లేఖ ఇలా ఉంది. యువతకు ప్రాధాన్యత కల్పిస్తానన్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాల పట్ల ఆకర్షితుడినై తాను జనసేన పార్టీలో చేరానని తెలిపారు. పార్టీలో చేరిన నాటి నుండి తాను ఒక నిబద్ధత గల జనసైనికునిగా పనిచేస్తూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళానని వినోద్ రెడ్డి తెలిపారు. తన పట్టుదల గుర్తించి పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించారని పేర్కొన్నారు. ఆ సమయంలో ఓడిపోయినా “కాబోయే సీఎం పవన్ కళ్యాణ్” అనే సింగిల్ పాయింట్ ఎజెండాతో తాను 316 రోజుల పాటు నా నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కూడా మిస్ కాకుండా “పవనన్న ప్రజాబాట” చేశానని తెలిపారు. అయితే నేడు మారిన పరిస్థితుల నేపథ్యంలో అవమానాలను భరిస్తూ ఉండలేనని, తన ఓర్పు, సహనం నశించిందని అందుకే పార్టీ మారుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

ఇక తనను నమ్ముకున్న ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పిస్తామని, భరోసాగా నిలిచే వారితోనే తన మున్ముందు ప్రయాణం ఉండబోతోందని వివరించారు కేతంరెడ్డి. రాజకీయంగా తాను ఏ పార్టీలో ఉన్నా కూడా నీతి, నిబద్ధత తప్పనని, తనను ఆదరించే ప్రజలకు, ఇప్పటివరకు తోడుగా నిలిచిన జనసైనికులకు ఏ కష్టమొచ్చినా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. అయితే ఇలా పొత్తుల తరువాత వరుసగా జనసేన పార్టీ కి కీలక నేతలు గుడ్ బై చెప్పడం ఆ పార్టీ కార్యకర్తలను ఆందోళనకు గురి చేస్తోంది. మరి.. ముందు ముందు మరెంత మంది పార్టీకి వీడుతారో  అనే అనుమానులు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా పవన్ మేలుకోవాలంటూ కొందరు సలహాలు ఇస్తున్నారు. మరి.. పొత్తుల అనంతరం జనసేన పార్టీని నేతలు వరుసగ విడిచి పెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.