ఆల్కహాల్ తాగడం ఆరోగ్యానికి హానికరం అని ఎవరు ఎంత మొత్తుకున్నా పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదు. మద్యం తాగేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. మద్యం అమ్మకాలు కూడా ఏటికేడు పెరుగుతున్నాయి. వీకెండ్స్‌లో మద్యం దుకాణాల ముందు పెద్దవారితో పాటు యువత కూడా బారులు తీరుతుండటం గమనార్హం. ఇక, పండుల సమయంలోనైతే చెప్పనక్కర్లేదు. దసరా లాంటి పలు ఫెస్టివల్స్‌కు రికార్డు స్థాయిలో మద్యం అమ్ముడుపోతోంది.
ఆల్కహాల్‌కు బానిసలై ఎంతో మంది యువత తమ లైఫ్‌ను నాశనం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్, కాకినాడ జిల్లాలోని తుని మండలం, గవరయ్య కోనేరు దగ్గర మద్యం బాటిళ్లతో వెళ్తున్న ఒక మినీ వ్యాన్ బోల్తా పడింది. వ్యాన్ బోల్తా పడిన ఈ ఘటనలో కొన్ని మద్యం సీసాలు ధ్వంసం అయ్యాయి. అయితే మరికొన్ని బాటిళ్లు రోడ్డుపై పడ్డాయి. రోడ్డు మీద పడిన బీర్లు, లిక్కర్ బాటిళ్ల కోసం ప్రజలు ఎగబడ్డారు. దొరికిందే ఛాన్స్ అనుకుంటూ బీర్లు, మద్యం సీసాలను అందినకాడికి ఎత్తుకెళ్లారు. వ్యాన్‌లో ఉన్నవాళ్లు మద్యం సీసాలను ఎత్తుకెళ్లొద్దని ఎంత మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. అయితే కొందరు మాత్రం వ్యాన్‌లో ఉన్నవారికి సాయం చేశారు.
మినీ వ్యాన్ బోల్తాపడిన సమాచారం తెలియడంతో పోలీసులు, పెట్రోలింగ్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. స్థానికులు లిక్కర్ బాటిళ్లు తీసుకోకుండా వాళ్లు అడ్డుకున్నారు. కానీ అప్పటికే చాలా మంది బీర్లు, మద్యం సీసాలు తీసుకెళ్లారు. మద్యం లోడుతో ఉన్న మినీ వ్యాన్ సామర్లకోట నుంచి తునికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. టైర్ పంక్చర్ కావడంతో బండి బోల్తా పడిందని చెబుతున్నారు. ఈ ప్రమాదం కారణంగా కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన పోలీసులు.. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అలాగే మద్యం సీసాలను మరో వాహనంలోకి ఎక్కించి తీసుకెళ్లినట్లు సమాచారం. గతంలోనూ ఇలా రోడ్డుపై మద్యం సీసాలు కనిపించగానే జనాలు వచ్చిన ఘటనలు ఒకట్రెండు జరిగాయి.