P Venkatesh
బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగండగా మారి 17వ తేదీ నాటికి ఒడిశా తీరానికి చేరుకునే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది.
బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగండగా మారి 17వ తేదీ నాటికి ఒడిశా తీరానికి చేరుకునే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది.
P Venkatesh
గత మూడు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రంలో పలు చోట్ల మోస్తరు వర్షాలు పడుతున్నాయి. తాజాగా దక్షిణ అండమాన్ సముద్రంలోని ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావారణ శాఖ అలర్ట్ జారీ చేసింది. మంగళవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటం వల్ల బుధవారం ఉదయం వరకు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని.. ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశంచబోతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఆ తర్వాత ఉత్తర ఈశాన్యంగా దిశ మార్చుకొని 17వ తేదీ వరకు ఒడిశా తీరానికి సమీపంలో ఉన్న వాయువ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ క్రమంలోనే ఏపిలో పలు జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ హెచ్చరిస్తున్నారు.
వాతావరణంలో ఏర్పడిన పరిస్థితుల కారణంగా ఉత్తర కోస్తాలోని అనేక చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది. ఉత్తర కోస్తా లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉండటంతో బుధ, గురువారాల్లో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవొద్దని హెచ్చరిస్తున్నారు. రానున్న రెండు రోజుల్లో గంటకు 40 నుంచి 50 కిలో మీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అంటున్నారు. పలు చోట్ల ఉరుములు, మెరుపులు, వడగండ్ల వానతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పనులు అయితేనే బయటకు వెళ్లాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీ తీర ప్రాంత రాష్ట్రాలైన ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేస్తుంది. రానున్న ఐదు రోజుల్లో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తరాంధ్ర, యానాం తీరాలకు సమీపంలో సముద్ర కెరటాల ఉధృతి అధికాంగా ఉంటుందని అంటున్నారు. అల్పపీడనం తుఫానుగా మారుతుందా? లేదా? అన్న విషయాన్ని వాతావరణ శాఖ ధృవీకరించలేదు. కాగా, గత నెల బంగాళాఖాతంలో హమూన్ తుఫాన్ ఏర్పడి తీవ్ర భయాందోళనలు సృష్టించింది. బంగ్లాదేశ్ తీరాన్ని తాకడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే.. ఏపీలో ఇప్పటికే కురుస్తున్న వర్షాల కారణంగా వరి పనలు తడిసిపోతాయనే ఆందోళన రైతుల్లో వ్యక్తం అవుతుంది.. దీంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.