ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఎన్నికల్లో పేదలకు, పెత్తందారులకు మధ్య కురుక్షేత్ర యుద్ధం జరగనుందని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఈ యుద్ధంలో ప్రజలు తనకు అండగా నిలవాలని ఆయన కోరారు. విజయవాడలో నిర్వహించిన వైఎస్సార్ వాహనమిత్ర నిధుల విడుదల కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. వాహనమిత్రతో ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు లబ్ధి పొందుతున్నారు. ఇప్పటికే 2.75 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లోకి రూ.10 వేల చొప్పున జమచేశారు. ఆ తర్వాత మాట్లాడిన సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరు అడగకున్నా, ఉద్యమించకపోయినా సంక్షేమం అందిస్తున్నామని చెప్పారు.
స్కిల్ స్కామ్, అమరావతి పేరుతో స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్, నీరు-చెట్టు పేరుతో దోపిడీ, రైతులను మోసం చేసిన వారితో తమకు యుద్ధం జరగబోతోందన్నారు జగన్. పేదల ప్రభుత్వం ఒకవైపు ఉంటే.. పేదల్ని మోసగించిన వాళ్లు మరోవైపు ఉన్నారని ఆయన విమర్శించారు. మనది మనసున్న ప్రభుత్వం అని.. గత పాలకులకు మనసు లేదన్నారు. ఇది పేదల కోసం పనిచేస్తున్న సర్కారు అని.. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని తాము అమలు చేశామన్నారు. వివక్ష అనేది లేకుండా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్స్‌లో నగదు జమచేశామన్నారు సీఎం జగన్.
‘ఇప్పుడూ ఇదే బడ్జెట్.. గతంలోనూ ఇదే. మారిందల్లా ముఖ్యమంత్రి ఒక్కరే. కానీ గతంలో ఎందుకు ఈ పథకాలు ఇవ్వలేకపోయారు? పేదోడి ప్రభుత్వం నిలవాలి. పెత్తందారుల ప్రభుత్వం రాకూడదు. వచ్చే ఎలక్షన్స్‌లో వీటన్నింటి గురించి ఆలోచించాలి. వారికి అధికారం కావాల్సింది దోచుకోవడానికి.. దోచుకున్నది పంచుకోవడానికి. వారిలా నాకు దత్తపుత్రుడి తోడు లేదు. వాళ్ల మాదిరిగా నాకు గజదొంగల ముఠా తోడూ లేదు. దోచుకొని పంచుకొని తినడం నా పద్ధతి కాదు. మీ ఇంట్లో మంచి జరిగిందని భావిస్తే నాకు తోడుగా నిలవండి. త్వరలో జరిగే కురుక్షేత్ర యుద్ధంలో నాకు అండగా నిలబడండి. ఓటు వేసే ముందు ఇప్పటిదాకా జరిగిన మంచి గురించి ఆలోచించండి’ అని ముఖ్యమంత్రి జగన్ చెప్పుకొచ్చారు.
ఇదీ చదవండి: ముందస్తు బెయిల్ పిటిషన్.. లోకేష్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ!